ముద్రగడ కోసం కాకినాడ నుంచి డాక్టర్లు

Update: 2016-06-15 07:57 GMT
కాపు నేత.. మాజీ మంత్రి ముద్రగడ పద్మానాభం చేస్తున్న దీక్ష ఏడో రోజుకు చేరుకున్న సంగతి తెలిసిందే. తుని విధ్వంసానికి పాల్పడిన వారిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకోవటాన్ని నిరసిస్తూ.. వారిని వెంటనే విడుదల చేయాలంటూ దీక్ష షురూ చేస్తున్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఆయన దీక్ష చేస్తున్నారు. వైద్యుల మాటను ఆయన ససేమిరా అనటం.. వైద్యం చేయించుకోవటానికి ఏ మాత్రం ఇష్టపడకపోవటం ఒక ఎత్తు అయితే.. బలవంతంగా ఆయనకు వైద్యం తాము చేయలేమంటూ వైద్యులు స్పష్టం చేయటం ఏపీ సర్కారుకు ఇబ్బందికరంగా మారింది. ఆయన హెల్త్ బులిటెన్ ను విడుదల చేసిన సందర్భంగా.. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని.. తక్షణమే వైద్యసాయం అవసరమని వైద్యులు తేల్చి చెప్పారు.

ఇదిలా ఉంటే.. ముద్రగడకు వైద్యం చేసేందుకి వీలుగా ప్రత్యేక వైద్య బృందాన్ని సిద్ధం చేయాలని ఏపీ సర్కారు భావిస్తోంది. ముద్రగడకు వైద్యం చేయటానికి వీలుగా కాకినాడ నుంచి వైద్యుల్ని రప్పించనున్నట్లుగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. ముద్రగడతో పాటు.. దీక్ష చేస్తున్న వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణిస్తుందన్న ఆయన.. ముద్రగడకు అత్యవసర వైద్యం చేయటానికి తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

మంత్రి కామినేని మాటలు ఇలా ఉంటే.. మరోవైపు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మాత్రం ముద్రగడకు బలవంతంగా తాము వైద్యం చేయలేమని తేల్చి చెబుతున్నారు. ఈ కారణంతోనే కాకినాడ నుంచి ప్రత్యేకంగా వైద్యుల్ని రప్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. నాటకీయ పరిణామాల మధ్య  ఇంటి నుంచి ఆసుపత్రికి తరలించిన రీతిలోనే.. వైద్యాన్ని సైతం అదే రీతిలో ఇప్పిస్తారా? అన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది.
Tags:    

Similar News