కమ్మరావతి... స్ట్రాంగ్ స్టాంప్ ?

Update: 2022-04-16 09:30 GMT
అమరావతిని భ్రమరావతి అని మేధావులు అన్నారు. ఒక దశలో వామపక్షాలు, ప్రజా సంఘాలు, ఆలోచనాపరులు అంతా కలసి దాని మీద ఉద్యమించారు కూడా. దానికి కారణం అక్కడ సామాజిక సమీకరణల మధ్య సమతూల్యత లేదని. అలాగే పర్యావరణాన్ని కూడా పక్కన పెట్టేసి పచ్చని పొలాల్లో చిచ్చు పెట్టేశారని. మరి కొందరు అయితే ముందుకు వెళ్లి అమరావతి అన్నది రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీయడానికే అన్నారు. అక్కడ భూములు రాత్రికి రాత్రి కొనుగోలు చేసి చాలా మంది రాజధాని బూమింగులో మల్టీ మిలియనీర్లు అయ్యేందుకు రాచబాట వేశారని అన్నారు.

ఇక అమరావతి రాజధాని గురించి మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ క్రిష్ణారావు రాసిన పుస్తకంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి.  సరే మొత్తానికి ఇపుడు అమరావతి విషయంలో అంతా యూ టర్న్ తీసుకున్నారు అది వేరే సంగతి.ఇవన్నీ ఇలా ఉంటే అమరావతిని కమ్మరావతి అని ఎవరు అన్నారో తెలియదు. భ్రమరావతి అని మాత్రం మేధావులు చాలా మంది అన్నారు.

అయితే  కమ్మవారి అడ్డాగా అమరావతి ఉందని అర్ధం వచ్చేలాగా, వారిదే మొత్తం రాజధాని అని భావన వచ్చేలా కమ్మరావతి పేరు పెట్టారని అనుకోవాలి. సరే మూడు రాజధానుల ప్రకటన తరువాత కమ్మరావతి పేరు అలా బయటకు వచ్చింది. అయినా సరే అక్కడ బీసీలు ఉన్నారు. ఎస్సీలు ఉన్నారు, ఇతర సామాజిక వర్గీయులు ఉన్నారని లెక్కలు కూడా చాలా మంది తీసి చూపించారు. అయినా ఇది కుల రాజాధాని అంటూ రచ్చ జరుగుతూనే ఉంది.

అది రాజకీయంగానే తేల్చుకోవచ్చు. కానీ ఇపుడు సామాజిక రంగుని పూసి మరీ కొందరు ముందుకు రావడంతో అసలు కధ కీలక మలుపు తిరిగింది. అమరావతి పేరుని దమ్ముంటే కమ్మరావతి గా పెట్టు అంటూ తెలంగాణాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి జగన్ కి సవాల్ చేయడమే బిగ్ ట్విస్ట్.

నిజానికి ఆమె చేసిన ఈ సవాల్ అనేక రకాలుగా చూస్తే అంత సహేతుకంగా అనిపించడంలేదు అంటున్నారు. విభజన తరువాత ఆమె తెలంగాణా రాష్ట్రానికే పరిమితం అయ్యారు. ఆమె రాజకీయ కార్యక్షేత్రం అక్కడ. పోనీ నిన్నటిదాకా రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కటి కాబట్టి ఆమె దీని మీద  స్పందించవచ్చు అని అనుకోవచ్చు. కానీ ఆమె స్పందించింది, హాట్ కామెంట్స్ చేసింది రాజకీయ సభల్లో కాదు, సొంతంగా మీడియా సమావేశం పెట్టి కూడా కాదు.

ఆమె నిజామాబాద్ లోని కమ్మ కులస్థుల ఆత్మీయ సభలో తమ స్వజనుల మధ్యన నిలబడి గర్జించారు. ప్లేస్ చూస్తే తెలంగాణా గడ్డ. వేదిక చూస్తే ఒక సామాజికవర్గం వారిది. మరి రేణుక అక్కడ నుంచి చేసిన సవాల్ ఎంత గొప్పదైనా ఎలాంటి రూపం తీసుకుంటుంది. ఎవరైనా ఎలా ఆలోచిస్తారు. ఇంతకాలం అమరావతి అంటే అందరి రాజధాని అని ఏ కోశానా అయినా కాస్తా నమ్మకం ఉన్న వారి ఆలోచనలను మార్చే విధంగా ఈ సవాల్ ఉందంటే తప్పుందా.

ఏపీలో కుల సమరం పెద్ద ఎత్తున  సాగుతోంది. ప్రధానంగా రెండు ఆధిపత్య కులాల మధ్య రాజ్యాధికారం కోసం పోరాటం సాగుతోంది. అందులో అమరావతి కూడా ఒకటిగా ఉంది. అందువల్ల దాన్ని రాజకీయంగానే తేల్చుకోవాలి. ఇక కమ్మ వారి ఆస్తి అమరావతి అంటే నిజం నిగ్గ్గు తేల్చి అసలు విషయం చెప్పాల్సింది కమ్మ వారు కాదు కదా. అక్కడ ఉన్న బీసీలు, ఎస్సీలు, ఇతర బడుగు వర్గాలు ఇది అందరి రాజధాని అని గట్టిగా చెబితే ఆ విలువ గౌరవం వేరుగా ఉంటుంది.

కానీ అమరావతి రాజధాని విషయంలో మొదటి నుంచి జరుగుతున్న పొరపాటు ఏంటి అంటే ఒక సామాజికవర్గం తమ భుజాన వేసుకోవడం, వారే పోరాటాలు చేయడం, వారే మీడియా ముందుకు వచ్చి గర్జించడం, ఇపుడు వేరు పార్టీలు, వేరు ప్రాంతాల్లో ఉన్నా కూడా ఆ సామాజికవర్గం వారే అమరావతి వేదికగా చేసుకుని అధికార పార్టీకి సవాళ్ళు చేయడం. దీన్ని బట్టి చూస్తే వైసీపీ కోరి మరీ అంటించిన ఈ కుల బురదను తాము మరింతగా పూసుకోవడం లేదా అనిపించకమానదు. ఇలాంటి సవాళ్ల వల్ల మరింతగా ఇబ్బందులు వస్తాయని, తమ అసలు లక్ష్యం దెబ్బ తింటుంది అన్న ఆలోచన లేకపోతే ఎలా.

ఏదైతే అధికార పార్టీ కోరుకుంటోందో అదే చేసి చూపించడం ద్వారా అవతల సామాజిక వర్గం అతి ఉత్సాహాం చూపిస్తోంది. ఏది ఏమైనా ఒక్క మాట అమరావతి విషయంలో నిజాలూ ఉన్నాయి. నిందలూ ఉన్నాయి. కానీ వాస్తవాలు బయటకు రానీయకుండా అటూ ఇటూ సాగుతున్న రాజకీయ రచ్చలో రాజధాని పుట్టీ పుట్టకుండానే ఇంత వివాదాలామయం కావడం బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఉండదేమో.
Tags:    

Similar News