బీఆర్‌ఎస్‌ లోకి ఏపీ నేతల చేరికలు.. జగన్, కేసీఆర్‌ కుట్ర వల్లేనా?

Update: 2023-01-04 16:30 GMT
తెలంగాణలో బండి సంజయ్, ఏపీలో పవన్‌ కల్యాణ్‌ లను బలహీనం చేయడానికే జగన్, కేసీఆర్‌ కుట్ర పన్నారని బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌–కేసీఆర్‌ కుట్రలో భాగంగానే బీఆర్‌ఎస్‌ లోకి ఏపీ నేతలు వెళ్తున్నారని కన్నా ఆరోపించారు. ఏపీలో పవన్, తెలంగాణలో బండి సంజయ్‌ను బలహీనం చేసే కుట్ర జరుగుతుందని హాట్‌ కామెంట్స్‌ చేశారు. ముఖ్యంగా కాపు నేతలపైనే బీఆర్‌ఎస్‌ దృష్టి పెట్టిందని కన్నా లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. పవన్‌కు తామంతా అండగా ఉంటామని స్పష్టం చేశారు.

అలాగే బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహార శైలిని కన్నా లక్ష్మీనారాయణ తప్పుబట్టారు. కోర్‌ కమిటీలో చర్చ లేకుండా బీజేపీ జిల్లా అధ్యక్షులను మార్చడంపై కన్నా అసహనం వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుల మార్పుపై తనతో చర్చించలేదన్నారు. ఇప్పుడు జిల్లా అధ్యక్షులుగా తొలగించిన వాళ్లంతా తన హయాంలో పార్టీలోకి వచ్చిన వాళ్లేనని స్పష్టం చేశారు. కోర్‌ కమిటీ సమావేశం తప్ప పార్టీలో తనకు ఏ సమాచారం తెలియట్లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

 తాను బీజేపీరాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు చాలామందిని పార్టీలో చేర్చానని కన్నా గుర్తు చేశారు. ఇప్పుడు వాళ్లంతా ఎందుకు పార్టీ వీడుతున్నారో సోము వీర్రాజు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా సోము వీర్రాజు వియ్యంకుడు ఎందుకు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)లో చేరారో సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు వ్యాఖ్యలు.. స్థానిక కార్యకర్తల అభిప్రాయాలకు ఎప్పుడూ భిన్నంగానే ఉంటాయని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించడం విశేషం. అమరావతి రాజధాని, ఇతర అంశాల్లో జీవీఎల్‌ వైఖరి ఎలా ఉందో చూస్తున్నామన్నారు.

కాగా పవన్‌ కు అండగా నిలుస్తానని కన్నా లక్ష్మీనారాయణ చెప్పడంపై చర్చ జరుగుతోంది. కన్నా లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీలో చేరతారని వార్తలు వస్తున్నాయి. గుంటూరు పశ్చిమ నుంచి జనసేన తరఫున బరిలోకి దిగుతారని చెబుతున్నారు. గత కొంతకాలంగా బీజేపీపై ఆయన అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సొంత పార్టీ నేతలపై విమర్శలు చేశారని పేర్కొంటున్నారు. జనసేన–టీడీపీ పొత్తు కుదిరే అవకాశం ఉందని కన్నా భావిస్తున్నట్టు టాక్‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News