కేసీఆర్ సర్కారుకు తలనొప్పిగా మారిన బండి సంజయ్!

Update: 2019-11-01 12:01 GMT
అసలే ఫైర్ బ్రాండ్.. ఆపై అధిష్ఠానం నుంచి ఆశీర్వాదం ఉన్న నేత ఎలా చెలరేగిపోతారన్నది కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. తన అడ్డాలో కాకుండా వేరే చోట అయితే తన ప్రతాపాన్ని పెద్దగా ప్రదర్శించలేని ఆయనకు.. కరీంనగర్ ఆర్టీసీ డ్రైవర్ బాబు ఆకస్మిక మరణం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసేలా చేస్తోంది. సరూర్ నగర్ లో నిర్వహించిన సకలజనుల సమరభేరీ సభకు హాజరై గుండెపోటుతో మరణించిన బాబు అంశాన్ని కేసీఆర్ సర్కారుకు చెమటలు పట్టేలా చేస్తున్నారు.

ఆర్టీసీ కార్మికులతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరిపే వరకూ అంత్యక్రియలు జరిపేదే లేదని చెప్పిన ఆయన.. తాజాగా అంత్యక్రియల్లో భాగంగా భౌతికకాయాన్ని ర్యాలీగా బస్టాండ్ కు తీసుకెళ్లాలని డిసైడ్ చేశారు. కేసీఆర్ అడ్డా లాంటి కరీంనగర్ లో ప్రస్తుతం చక్రం తిప్పుతున్న బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారారని చెప్పక తప్పదు.

భౌతికకాయాన్ని ర్యాలీగా తీసుకెళతానని బండి సంజయ్ నిర్ణయాన్ని పోలీసులు నో చెప్పేస్తున్నారు. ర్యాలీని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని.. ఒకవేళ బలవంతంగా చేపడితే అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. తనకు వార్నింగ్ లు ఇవ్వటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బండి.. తాను ర్యాలీ చేస్తానని.. ఎలా అడ్డుకుంటారో చూస్తానని.. దమ్ముంటే అరెస్ట్ చేయాలంటూ తేల్చి చెబుతున్న ఆయన మాటలు పోలీసుల్ని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఒకవైపు అధికారపక్షం మరోవైపు.. సెంట్రల్ నుంచి మస్తు సపోర్ట్ ఉన్న బండి సంజయ్ లాంటి నేత విషయంలో ఎలా వ్యవహరించాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.

ఎవరు ఆపినా ఆగేది లేదని.. మానవత్వం ఉన్న ఎవరైనా తనతో కలిసి నడవొచ్చని పిలుపునిస్తున్న సంజయ్ మాటలతో ఉద్వేగానికి గురవుతున్నారు. పెద్ద ఎత్తన జనసమీకరణ జరిగి.. ర్యాలీ కనుక సాగితే తమకొచ్చే కష్టాన్ని గుర్తు చేసుకుంటున్న కరీంనగర్ పోలీసులకు ఇప్పుడు ముందు చూస్తే నుయ్యి.. వెనుక చూస్తే గొయ్యి అన్నట్లుగా ఉందని వాపోతున్నారు. మొత్తంగా డ్రైవర్ బాబు అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వానికే కాదు.. పోలీసులకు సైతం ఇప్పుడో సవాలుగా మారినట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News