టీటీడీపీకి షాక్ ఇచ్చేలా మ‌ళ్లీ చేరిక‌లు...

Update: 2017-11-12 09:25 GMT
తెలంగాణ‌లో ఇప్ప‌టికే చిక్కి శ‌ల్య‌మైపోయిన తెలుగుదేశం పార్టీకి మ‌రో గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గ‌ల‌నుంది. అదికూడా టీటీడీపీ ర‌థ‌సార‌థిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎల్‌.ర‌మ‌ణ సొంత జిల్లా అయిన ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్‌ లో కావ‌డం హాట్ టాపిక్‌గా మారింది. మాజీ మంత్రులు - ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్న షాకుల పరంప‌ర‌కు తాజాగా నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీలు తోడ‌య్యారు. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న ప‌రిణామాల ప్ర‌కారం ముగ్గురు నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీలు టీడీపీకి నేడు గుడ్ బై చెప్తుండ‌గా..మ‌రొక‌రు రాజీనామా చేసేందుకు రెడీగా ఉన్న‌ట్లు స‌మాచారం.

తెలంగాణ టీడీపీ నేతగా ఉన్న రేవంత్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌ లో చేరిపోవ‌డంతో టీటీడీపీ నేత‌ల్లో త‌మ భ‌విష్య‌త్‌ పై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. దీంతో ప‌లువురు నేత‌లు త‌మ‌దారి తాము చూసుకున్నారు. ఈ ఎఫెక్ట్ పార్టీ ప్రెసిడెంట్ అయిన ఎల్‌.ర‌మ‌ణ సొంత జిల్లా జగిత్యాల‌పై కూడా ప‌డింది. రేవంత్ వెంటే కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ - పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు - చొప్పదండి నియోజకవర్గ ఇన్‌ చార్జి మేడిపల్లి సత్యం - హుజూరాబాద్‌ నియోజకవర్గ ఇన్‌ చార్జి ముద్దసాని కశ్యప్‌ రెడ్డి - ధర్మపురి నియోజకవర్గ ఇన్‌ చార్జి మద్దెల రవీందర్‌  టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ లో చేరిపోయారు. ఈ న‌లుగురు నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీలు న‌డిచిన దారిలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌ చార్జి అన్నమనేని నర్సింగారావు, మంథని నియోజకవర్గ ఇన్‌ చార్జి కర్రు నాగయ్య - హుస్నాబాద్‌ నియోజకవర్గ ఇన్‌ చార్జి పి రవీందర్‌ రావు టీడీపీకి గుడ్‌ బై చెప్పనున్నారని స‌మాచారం. ఈ ముగ్గురు అధికార టీఆర్ ఎస్ పార్టీలో చేరేందుకు రాజీనామాకు సిద్ధ‌ప‌డ్డార‌ని తెలుస్తోంది. నాగ‌య్య - ర‌వీంద‌ర్ రావు ఆదివారం పార్టీకి రాజీనామా చేస్తుండ‌గా..న‌ర్సింగ‌రావు ఒక‌ట్రెండు రోజులు ఆగి రిజైన్ చేయ‌నున్నార‌ట‌. వీరంతా 15వ తేదీన హైద‌రాబాద్‌ లో టీఆర్ ఎస్ పార్టీలో చేర‌నున్నార‌ని స‌మాచారం.

జ‌గిత్యాల నియోజకవర్గ ఇన్‌ చార్జి సాగర్‌ రావు ఒక్క‌రే పార్టీలో ఉండే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. పార్టీ అధ్యక్షుడు ర‌మ‌ణ అనుచ‌రుడు - స‌న్నిహితుడు కావ‌డం వ‌ల్ల ఆయ‌న సైకిల్ పార్టీకి టాటా చెప్ప‌క‌పోవ‌చ్చున‌ని తెలుస్తోంది. మ‌రోవైపు రామ‌గుండం ఇంచార్జీగా ఉన్న క‌రీంన‌గ‌ర్ అసెంబ్లీ ఇంచార్జీ గండ్ర న‌ళిని సైతం పార్టీతో అంటీముట్ట‌న‌ట్లుగానే ఉండ‌టం గ‌మ‌నార్హం. స్థూలంగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలోని మెజార్టీ నేత‌లు వ‌ల‌స బాట‌ప‌డుతుండ‌టంతో అధ్యక్షుడిగా ఉన్న ఎల్‌.రమణపై ఒత్తిడి పెరుగుతోంద‌ని అంటున్నారు. పార్టీకి భ‌విష్య‌త్ లేనందునే నాయ‌కులు గుడ్ బై చెప్తున్న క్ర‌మంలో త‌న‌ను బాధ్యుడిగా చేయ‌డం స‌రికాద‌ని ర‌మ‌ణ స‌న్నిహితుల‌తో వ్యాఖ్యానించిన‌ట్లు స‌మాచారం.
Tags:    

Similar News