కర్ణాటక కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఆస్తులు ఐదేళ్లలో అంతలా పెరిగాయట

Update: 2023-04-19 09:29 GMT
డీకే శివకుమార్ పేరు విన్నంతనే.. కర్ణాటక బీజేపీ ప్రభుత్వ హయాంలో ఒక బాధితుడిగా గుర్తుకు వస్తారు. ఆయనపై పలు శాఖలు వరుస దాడులు.. తనిఖీలు చేపట్టి ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయన్న మాట వినిపిస్తూ ఉంటుంది. బీజేపీ సర్కారు కారణంగా ఆర్థికంగా ఆయన భారీగా నష్టపోయినట్లుగా కొందరు చెబుతుంటారు.

అయితే.. తాజాగా ఆయన దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ను చూస్తే.. ఆయన చతురతకు వావ్ అనకుండా ఉండలేం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన ఆయన.. కనకపుర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి డీకే శివకుమార్ తన ఆస్తుల్ని ప్రకటించారు. తన కుటుంబ ఆస్తులు రూ.1414 కోట్లుగా పేర్కొన్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే డీకే శివకుమారే ముఖ్యమంత్రి అన్న ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. అలాంటి ఈ పెద్ద మనిషి గడిచిన ఐదేళ్ల కాలంలో తన ఆస్తులు 68 శాతం పెరిగిన విషయాన్ని వెల్లడించారు. నామినేషన్ వేస్తున్న ఫోటోను జతపర్చిన ఆయన.. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టటం ఆసక్తికరంగా మారింది.

కనకపుర నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన డీకే శివకుమార్ మీద బీజేపీ అభ్యర్థి ఆర్ అశోక తలపడుతున్నారు. మంత్రిగా పని చేసిన ఆయన.. డీకే శివకుమార్ మీద తలపడుతున్న వైనం ఆసక్తికరంగా మారింది. 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈసీకి ప్రకటించిన ఆస్తుల విలువ రూ.251 కోట్లు కాగా.. 2018 ఎన్నికల నాటికి ఆయన ఆస్తుల విలువ రూ.840 కోట్లకు పెరిగింది.

తాజాగా ప్రకటించిన ఆస్తుల లెక్కలోకి తీసుకుంటే.. గడిచిన ఐదేళ్లలో భారీగా పెరిగి రూ.1414 కోట్లకు చేరుకున్న విషయం అర్థమవుతుంది. ఆయనకు రూ.225 కోట్ల అప్పు కూడా ఉందన్న విషయాన్ని వెల్లడించారు.

డీకే పేరిట రూ.970 కోట్ల స్థిరాస్తులతో పాటు ఆయన పేరు మీద రూ.8.3 లక్షల విలువ చేసే టయోటా కారు ఉంది. ఆయన సతీమణి ఉష పేరు మీద రూ.113.38 కోట్ల స్థిరాస్తి ఉన్నట్లు పేర్కొన్నారు. డీకే కుమారుడు అకాశ్ పేరు మీద రూ.54.33 కోట్ల స్థిరాస్తి ఉన్నట్లు పేర్కొన్నారు.

డీకే శివకుమార్ వార్షిక ఆదాయం రూ.14.24 కోట్లు కాగా.. ఆయన సతీమణి వార్షికాదాయం రూ.1.9కోట్లు. మొత్తంగా ఆయన కుటుంబంలో డీకే ఒక్కరి పేరు మీద ఉన్న ఆస్తుల విలువ రూ.1214.93 కోట్లు. మే 10న జరిగే కర్ణాటక ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 13న జరగనుంది.

Similar News