సుప్రీం ఆదేశాల అమలుకు కర్ణాటక నో

Update: 2016-09-22 04:22 GMT
ఏదైనా వివాదం వస్తే అంతిమంగా అందరూ ఆశ్రయించేది అత్యున్నత న్యాయస్థానం సుప్రీంనే. మరి.. ఆ కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుకు ససేమిరా అని ఒక రాష్ట్రం అంటే..? వాస్తవానికి ఈ ప్రశ్న ఆలోచించేందుకే చాలామంది ఇష్టపడరు. కానీ.. తాజాగా అలాంటి పరిస్థితి తలెత్తటమే కాదు..  ఆ దిశగా దూకుడుగా వేస్తున్న అడుగులు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. కావేరీ జలవివాదం విషయంలో కర్ణాటక.. తమిళనాడు రాష్ట్రాల మధ్య పంచాయితీ నడుస్తున్న సంగతి తెలిసిందే.

కావేరీ జలాల్ని తమిళనాడుకు విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కర్ణాటకలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కావేరీ జలాల విడుదల విషయంలో కన్నడిగులు ససేమిరా అనటమే కాదు.. సుప్రీం ఆదేశాల నేపథ్యంలో కావేరీ జలాల్ని విడుదల చేస్తున్న వైనంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. వరుస ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో.. కర్ణాటక ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇదిలా ఉండగా.. ఈ వివాదంలో భాగంగా రెండు రాష్ట్రాల్లోనూ ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఇదిలా ఉండగా.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాజీ ప్రధాని దేవగౌడతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కావేరీ ఇష్యూ మీద సలహాలు కోరారు. అనంతరం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేవగౌడను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కావేరీ జలాల విడుదల విషయంలో సుప్రీం ఆదేశాల్ని పాటించాల్సిన అవసరం లేదన్న విషయాన్ని దేవగౌడ్ చెప్పటం.. దీనికి అఖిలపక్షం ఆమోదముద్ర వేయటంతోపాటు..వెంటనే అసెంబ్లీని అత్యవసరంగా సమావేశపర్చాలని నిర్ణయించారు.

దీనికి తగ్గట్లే.. సుప్రీం ఆదేశాలకు తగ్గట్లుగా తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయకూడదంటూ కర్ణాటక మంత్రిమండలి సైతం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఇష్యూపై శనివారం కర్ణాటక అసెంబ్లీని అత్యవసరంగా సమావేశ పర్చాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో.. తమిళనాడుకు కావేరీ జలాల విడుదల సాధ్యం కాదంటూ ఏకగ్రీవ నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. అనంతరం రాష్ట్ర నేతలందరితో కలిసి రాష్ట్రపతి ప్రణబ్ దాను కలవాని.. వినతిపత్రం అందించాలని నిర్ణయించారు. సుప్రీం ఆదేశాల్ని బేఖాతరు చేస్తూ.. కర్ణాటక ప్రభుత్వం వేస్తున్న వడి వడి అడుగులు పెద్ద చర్చకు తావిచ్చేలా ఉన్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాల్ని.. ఒక రాష్ట్ర ప్రభుత్వం నో అనటం.. అందుకు మిగిలిన రాజకీయ పార్టీలన్నీ కలిసికట్టుగా తీసుకుంటున్న నిర్ణయం రాజ్యాంగ సంక్షోభానికి కారణం అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి
Tags:    

Similar News