కేసీఆర్‌కు కర్ణాటక టెన్షన్.. వెళ్లాలా? వద్దా?

Update: 2023-03-04 18:13 GMT
ఈశాన్యంలో ఎన్నికలు ముగిసి కర్ణాటకలో ఎన్నికల వేడి పెరిగిన వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కొత్త టెన్షన్ పట్టుకుంది. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా దేశ రాజకీయాల్లోకి వస్తున్నామని ప్రకటించి ఇతర రాష్ట్రాల నేతలతో కలిసి నడుస్తున్న కేసీఆర్ అందులో భాగంగా కర్ణాటకలో జేడీఎస్‌తోనూ టచ్‌లో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రకటన వంటి  కార్యక్రమాలకు జేడీఎస్ నేత కుమారస్వామి వచ్చారు.

అంతకుముందు కేసీఆర్ కూడా బెంగళూరు వెళ్లి కుమారస్వామి, ఆయన తండ్రి మాజీ ప్రధాని దేవెగౌడను కలిసి వచ్చారు. అయితే.. ఇప్పుడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం కుమారస్వామి జోరుగా ప్రచారం చేస్తున్నా కేసీఆర్ వైపు నుంచి ఆయనకు సపోర్ట్ మాత్రం కనిపించడం లేదు. వచ్చే నెలలోనే కర్ణాటకలో ఎన్నికలు ఉన్నప్పటికీ అక్కడ జేడీఎస్ కోసం బీఆర్ఎస్ ప్రచారం చేస్తుందా లేదా అనే విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారట.

కేసీఆర్ లెక్కల ప్రకారం కర్ణాటకలో జేడీఎస్ రానున్న ఎన్నికలలో కనీసం రెండో స్థానంలో కూడా నిలిచే పరిస్థితులలో లేదట. దాంతో ఇప్పుడు తాము జేడీఎస్ తరఫున ప్రచారం చేసి.. ఆ పార్టీ బొక్కబోర్లా పడితే దేశరాజకీయాల్లో తమ ఇమేజ్‌కు దెబ్బ వస్తుందని కేసీఆర్ భావిస్తున్నారట. అదే సమయంలో ప్రచారానికి వెళ్లకుంటే కుమారస్వామితో తెగతెంపులు అయ్యే ప్రమాదం ఉండడంతో పాటు తనతో రాజకీయంగా స్నేహం చేసిన, చేయాల్సిన మిగతావారినీ ఆలోచనల్లో పడేస్తుందన్న ఆందోళనా కేసీఆర్‌ను వెంటాడుతోందట.

దేశ రాజకీయాలు అంటూ ఎంతగా బీరాలు పలుకుతున్నా తమ స్ట్రాంగ్ హోల్డ్ తెలంగాణే కావడంతో కర్ణాటక ఎన్నికలలో ప్రచారానికి వెళ్లి అక్కడ ఫెయిలైతే తెలంగాణ ఎన్నికల సమయంలో బీజేపీ, కాంగ్రెస్‌లు తమను ఎండగట్టడం ఖాయమని బీఆర్ఎస్ కీలక నాయకులూ అంటున్నారు. కుమారస్వామితో దూరం పెరిగినా ఫరవాలేదు కానీ కర్ణాటకలో జేడీఎస్ తరఫున ప్రచారం చేయకపోవడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు.

ఒకవేళ కుమారస్వామి నుంచి ఒత్తిడి ఉంటే చివర్లో ఒక వారం పాటు ప్రచారానికి వెళ్తే చాలని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఆ క్రమంలోనే కర్ణాటక ఎన్నికల గురించి బీఆర్ఎస్ నేతలు ఎక్కడా మాట్లాడడం లేదు. ఎక్కడా కర్ణాటక అనే మాటే వినిపించకుండా జాగ్రత్తపడుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News