హరీశ్ అండ్ కోకు కాసాని పంచ్ లు మామూలుగా లేవుగా?

Update: 2022-12-23 04:16 GMT
ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు అన్నట్లుగా తెలుగుదేశాన్ని అభిమానించే వారికి కొత్త అనుభవం.. అనుభూతి తాజాగా ఎదురవుతోంది తెలంగాణలో. పోరాడి సాధించిన రాష్ట్రమని గొప్పలు చెప్పుకునే రాజకీయ పార్టీ కావాలని మార్చిపోయి.. ప్రజల్ని సైతం మర్చిపోయేలా చేసే విషయం ఏమంటే..తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలుగుదేశం పార్టీ ఓకే చెప్పి నాడు కేంద్రంలో కొలువు తీరిన మన్మోహన్ సర్కారుకు లేఖ ఇచ్చిన తర్వాతే ప్రత్యేక తెలంగాణ ప్రాసెస్ అయ్యిందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

తెలంగాణ తీర్మానం మీద సంతకం పెడితే చాలు.. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అటెండర్ పని చేస్తానని కోతలు కోసిన ఇప్పటి మంత్రి హరీశ్ రావు..తెలంగాణ తీర్మానానికి అనుకూలంగా లేఖ ఇచ్చినందుకు.. కనీసం ఆ పార్టీ ఆఫీసుకు వెళ్లి థ్యాంక్స్ కూడా చెప్పలేదు.

అలాంటి హరీశ్ ఇప్పుడు మంత్రిగా వ్యవహరిస్తూ టీడీపీని.. తెలుగుదేశం పార్టీ అధినేతను ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారు. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీకి ఉన్న అలవాటు ఏమంటే.. తనను తాను పొగుడుకోవాల్సిన దుస్థితి మాత్రమే కాదు.. ప్రత్యర్థులపై దునుమాడేది కూడా చంద్రబాబే. అలాంటి పరిస్థితికి భిన్నంగా.. అధినేతను ఏమైనా అంటే.. ఇట్టే రియాక్టు అవుతానన్నట్లుగా వ్యవహరిస్తున్న తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

ఖమ్మం శంఖారావం సభ సక్సెస్ కావటం.. అంచనాలకు మించి ప్రజలు హాజరు కావటంతో టీడీపీ మాంచి జోష్ లో ఉంటే.. తెలంగాణ రాష్ట్ర మంత్రులు మాత్రం ప్రెస్ మీట్లు పెట్టేసి.. చంద్రబాబును.. తెలుగుదేశం పార్టీపైనా విమర్శలు సంధించటం తెలిసిందే. వారి మాటలకు కౌంటర్ ఇచ్చే బాధ్యతను పర్ ఫెక్టుగా అమలు చేశారు కాసాని. ఖమ్మం సభ సక్సెస్ కావటంతో బీఆర్ఎస్ లో అభద్రతా భావం మొదలైందని.. అందుకే మంత్రులు విమర్శలు చేస్తున్నారన్నారు.

ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్ననేతలంతా ఒకప్పుడు టీడీపీలో ఒకటో తరగతి చదివిన వాళ్లేనని వ్యాఖ్యానించారు. ఖమ్మం సభలో చంద్రబాబు మాటల్ని తప్పు పట్టాల్సిన అవసరం ఏమీ లేదన్న కాసాని.. మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. వచ్చే ఎన్నికల్లో 119 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందన్న ఆయన.. హరీశ్ రావు సభ ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతామని.. కరీంనగర్ లో పెట్టాలా? అంటూ ఘాటుగా రియాక్టు అయిన కాసాని తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మాటకు మాట అనటమే  కాదు.. ఆ మాటల్లో కమిట్ మెంట్.. అంతకు మించిన లాజిక్ ఉండాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కాసాని మాటల్లో కనిపిస్తున్నాయని చెప్పాలి. ఇప్పుడు  పార్టీ నుంచి  ఇలాంటి తీరునే తెలుగు తమ్ముళ్లు కోరుకుంటారని చెప్పాలి. ఇన్నాళ్లకు టీడీపీ తరఫున బలమైన గొంతును వినిపించే నేత వచ్చారన్న సంబరం వ్యక్తమవుతోంది. కాసాని వ్యాఖ్యలు బాంబుల మాదిరి ఉన్నాయని అభిమానుల వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత.. పరాయి పార్టీ అయిపోయిందని.. టీడీపీ లోకల్ పార్టీగా పేర్కొన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News