కేసీఆర్ కు వార్నింగ్‌..టికెట్ ఇవ్వ‌కుంటే సూసైడ్‌

Update: 2018-09-17 04:33 GMT
ముంద‌స్తు ముచ్చ‌టేమో కానీ.. కేసీఆర్ కు షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన కాసేప‌టికే 105 మంది అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించ‌టం ద్వారా టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ సంచ‌ల‌నం సృష్టించారు. పార్టీలోనే కాదు.. విప‌క్షాల‌కు సైతం ఆయ‌న తీసుకున్న సాహ‌సోపేత‌మైన చ‌ర్యకు నోట మాట రాని ప‌రిస్థితి. ఇదిలా ఉంటే..టికెట్లు ప్ర‌క‌టించిన‌ప్పుడు పార్టీ నేత‌ల నుంచి వ‌చ్చిన అభ్యంత‌రాలు పెద్ద‌గా లేవ‌నుకున్న దానికి భిన్నంగా.. టికెట్లు ఆశిస్తున్న వారి ఆందోళ‌న‌లు రోజురోజుకీ పెరుగుతున్నాయి.

అసంతృప్తుల్ని బుజ్జ‌గించేందుకు కిందా మీదా ప‌డుతున్న‌ప్ప‌టికీ.. వారిని దారికి తెచ్చుకోవ‌టం అంత సులువు కాద‌న్న విష‌యం టీఆర్ ఎస్ అధినాయ‌క‌త్వానికి అర్థ‌మైంది. ఇదిలా ఉంటే.. తాజాగా హుజూర్ న‌గ‌ర్ నుంచి త‌న‌కు టీఆర్ ఎస్ టికెట్ ఇవ్వ‌కుంటే ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని బెదిరిస్తున్నారు ఆ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జి కాసోజు శంక‌ర‌మ్మ‌.

జిల్లాకు చెందిన మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి త‌న‌కు టికెట్ రాకుండా చేస్తున్నార‌ని మండిప‌డ్డ ఆమె.. మంత్రికి కానీ ద‌మ్ముంటే హుజూర్ న‌గ‌ర్ నుంచి పోటీ చేయ‌గ‌ల‌రా? అంటూ స‌వాల్ విసురుతున్నారు.

పార్టీ అధినేత కేసీఆర్‌.. మంత్రి కేటీఆర్ లు త‌న‌కు టికెట్ ఇచ్చే విష‌యంలో సానుకూలంగా ఉన్న‌ప్ప‌టికీ.. తాజా మాజీ మంత్రి జ‌గ‌దీశ్ మాత్రం త‌న అనుచ‌రుల‌కు టికెట్ ఇప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆమె ఆరోపిస్తున్నారు. జ‌గ‌దీశ్ కుట్రలో భాగంగానే త‌న‌పైన లేనిపోని అప‌వాదులు వేస్తున్నార‌న్నారు. తాను కాంగ్రెస్ నేత ఉత్త‌మ్ తో ఫోన్లో మాట్లాడుతున్న‌ట్లుగా చెప్పి  త‌న‌పై కొత్త అనుమానాలు పుట్టేలా ప్ర‌చారం చేస్తున్నార‌న్నారు. త‌న‌కు టికెట్ ఇవ్వ‌కుంటే ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌న్న శంక‌ర‌మ్మ మాట టీఆర్ఎస్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


Tags:    

Similar News