కాలికి గాయం.. 3 వారాలు పూర్తి రెస్టు: వైరల్ గా కవిత ట్వీట్

Update: 2023-04-11 14:55 GMT
ఎమ్మెల్యే కవిత పోస్టు చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తన కాలికి గాయమైందని ఆమె పేర్కొన్నారు. అయితే.. వైద్యుల సూచన మేరకు మూడు వారాలు పూర్తిగా విశ్రాంతి అవసరమని చెప్పినట్లుగా తెలిపారు. తాను అందుబాటులో ఉండనన్న విషయాన్ని చెప్పిన కవిత.. అదే సమయంలో తనకు ఏదైనా సమాచారం అందించాలంటే తన ఆఫీసును సంప్రదించాలని పేర్కొన్నారు.

మంగళవారం మధ్యాహ్న సమయంలో చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. వైరల్ గా మారింది. ఢిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ.. ఇప్పటికే పలుమార్లు ఈడీ విచారణకు హాజరైన ఆమెను త్వరలోనే అరెస్టు చేస్తారన్న వాదన జోరుగా వినిపిస్తోంది. అయితే.. అలాంటిదేమీ లేదని.. ఒకవేళ అరెస్టు చేసి ఉంటే ఈపాటికే అలాంటిది జరిగి ఉండేదన్న వాదనను వినిపిస్తున్నారు. మొదట్లో ప్రదర్శించినంత దూకుడుగా కవిత ఇష్యూలో ఈడీ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పదోతరగతి పరీక్షా పత్రాల లీకేజీ కేసులో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను అర్థరాత్రి దాటిన తర్వాత కారణంగా చెప్పకుండా అరెస్టు చేయటం.. అనూహ్యంగా కరీంనగర్ నుంచి వరంగల్ కు వాహనంలోతరలించటం.

ఈ సందర్భంగా వాహనంలో తిప్పటం లాంటి పరిణామాలు చోటు చేసుకోవటం.. దీనిపై బీజేపీ లో పెద్ద ఎత్తున ఆగ్రహాం వ్యక్తమైంది. అయితే.. రిమాండ్ కు తరలించిన అనంతరం కోర్టులో పెద్ద ఎత్తున వాదనలు జరగటం.. చివరకు బెయిల్ లభించటం తెలిసిందే.

బండి అరెస్టుపై బీజేపీ కేంద్ర నాయకత్వం సీరియస్ గా ఉందన్న వాదనలు వినిపించాయి. అందుకు తగ్గ ప్రతిచర్య త్వరలోనే ఉంటుందన్న మాట బలంగా వినిపించింది.

ఇలాంటి వేళలోనే.. కవిత తాజా ట్వీట్ బయటకు రావటం గమనార్హం. తన కాలికి గాయం తగిలిందని.. మూడు వారాలు పూర్తి విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పినట్లుగా పేర్కొన్న నేపథ్యంలో.. ఈడీతో సహా మరెవరికి తాను అందుబాటులో ఉండనన్న విషయాన్ని ఎమ్మెల్సీ కవిత చెప్పకనే చెప్పేసినట్లు లేదు? ఈ మూడు వారాల్లో ఏం జరుగుతుందో చూడాలి.

Similar News