క‌విత దెబ్బ‌!... యాష్కీ ప‌రార‌య్యారే!

Update: 2019-03-06 11:43 GMT
తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసినా... టీ కాంగ్రెస్ నేత‌లు ఇంకా భ‌యం గుప్పిట్లో నుంచి బ‌య‌ట‌కు రాలేద‌న్న వాద‌న ఇప్పుడు ఆస‌క్తి రేకెత్తిస్తోంది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి తెలంగాణ‌లో 17 ఎంపీ సీట్ల‌కు ఎన్నిక‌ల‌కు జ‌గ‌ర‌నున్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బంప‌ర్ మెజారిటీ సాధించిన అధికార టీఆర్ ఎస్... సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో క్లీన్ స్వీప్ చేయాల‌ని ప‌క్కా ప‌థ‌కంతో ముందుకు సాగుతోంది. ఈ క్ర‌మంలోనే త‌మ అన‌ధికారిక మిత్ర‌ప‌క్షం మ‌జ్లిస్ కు హైద‌రాబాదు ఎంపీ సీటును వ‌దిలేసి... మిగిలిన 16 సీట్ల‌లోనూ జ‌య‌కేత‌నం ఎగుర‌వేయాల్సిందేన‌ని కేసీఆర్ చెబుతున్నారు. ఇది నూటికి నూరు పాళ్లు జ‌రిగి తీరాల్సిందేన‌ని గ‌ట్టి మాట కూడా ఆయ‌న నోట వెంట వినిప‌డుతోంది. ఈ క్ర‌మంలో మిగిలిన 15 నియోజ‌కవ‌ర్గాల ప‌రిస్థితి ఏమిటో తెలియ‌దు గానీ... ఓ ప‌దేళ్ల దాకా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట‌గా కొన‌సాగిన నిజామాబాద్ ఎంపీ సీటు పేరెత్తితేనే.... టీ కాంగ్రెస్ నేత‌లు ప‌రార్ మంత్రాన్ని ప‌ఠిస్తున్నారు.

ఎన్నారైగా త‌న‌దైన శైలి స‌త్తాను చాటిన నిజామాబాద్ మాజీ ఎంపీ మ‌ధు యాష్కీ గౌడ్ ఇక్క‌డి నుంచే పార్ల‌మెంటులో అడుగుపెట్టారు. 2004లో పాలిటిక్స్‌ లోకి ఎంట్రీ ఇచ్చిన యాష్కీ.... ఆ ఎన్నిక‌ల్లో నిజామాబాద్ నుంచే కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ త‌ర్వాత సిట్టింగ్ ఎంపీగా 2009 లోనూ నిజామాబాద్ బ‌రిలో నుంచే రంగంలోకి దిగిన ఆయ‌న వ‌రుస‌గా రెండో సారి కూడా ఘ‌న విజ‌యం సాధించారు. వ‌రుస‌గా రెండు సార్లు నిజామాబాద్ నుంచి గెలిచిన యాష్కీ... కాంగ్రెస్ పార్టీలో కీల‌క నేత‌గా ఎద‌గ‌డంతో పాటుగా నిజామాబాద్ లో త‌న బ‌లాన్ని బాగానే పెంచుకున్నారు. అయితే తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డ్డ త‌ర్వాత 2014లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనూ యాష్కీ నిజామాబాద్ నుంచే బ‌రిలోకి దిగారు. వ‌రుస‌గా రెండు సార్లు విజ‌యం సాధించిన యాష్కీ... మూడో సారి కూడా గెలుస్తార‌న్న మాట బ‌లంగానే వినిపించింది.

అయితే తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా సాధించిన పార్టీగా టీఆర్ ఎస్ యాష్కీకి పోటీగా క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను కేసీఆర్ రంగంలోకి దించారు. టీఆర్ ఎస్ అధినేత కూతురు హోదాలో బ‌రిలోకి దిగిన క‌విత‌కు యాష్కీ గ‌ట్టి పోటీనే ఇచ్చారు. అయితే ఫ‌లితం తిర‌గ‌బ‌డింది. టీఆర్ ఎస్ వైపు బ‌లంగా వీచిన గాలిలో క‌విత బంప‌ర్ మెజారిటీతో విజ‌యం సాధించ‌గా... యాష్కీకి ఓట‌మి త‌ప్ప‌లేదు. స‌రే రెండు సార్లు గెలిచారు... ఓ సారి ఓట‌మి... అది కూడా సెంటిమెంట్ నేప‌థ్యంగా సాగిన ఎన్నిక‌లో ఓట‌మి అంటే పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన ప‌ని లేదు క‌దా. ఇదే భావ‌న‌తో ఉన్న కాంగ్రెస్ పార్టీ 2019లో కూడా నిజామాబాద్ నుంచే బ‌రిలోకి దిగాల‌ని యాష్కీకి ప్ర‌తిపాదించింద‌ట‌. ఈ మాట విన్నంత‌నే షాక్ కొట్టిన వాడికి మ‌ల్లే వ్య‌వ‌హ‌రించిన యాష్కీ... నిజామాబాద్ నుంచి తాను బ‌రిలోకి దిగ‌లేన‌ని చేతులెత్తేశార‌ట‌.

అంత‌గా పోటీ చేయ‌మంటే... ఖ‌మ్మం నుంచి గానీ - భువ‌నగిరి నుంచి గానీ బ‌రిలోకి దిగుతాను త‌ప్పించి నిజామాబాద్ లో మాత్రం తాను పోటీ చేయ‌లేన‌ని తేల్చి చెప్పార‌ట‌. అయినా యాష్కీ ఈ త‌ర‌హా వైఖ‌రికి కార‌ణం ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... ఈ ఐదేళ్ల‌లో క‌విత నిజామాబాద్ ను త‌న‌కు పెట్ట‌ని కోట‌గా మార్చుకోవ‌డంతో పాటుగా టీఆర్ ఎస్‌ కు ఆ స్థానాన్ని సేఫ్ జోన్‌ గానూ మార్చేశార‌ట‌. ఈ క్ర‌మంలో ఇప్పుడు నిజామాబాద్ లో యాష్కీ కాదు క‌దా.. టీ కాంగ్రెస్ నుంచి ఏ నేత నిల‌బ‌డ్డా ఓట‌మి త‌ప్ప‌ద‌ట‌. అంతేకాదండోయ్‌... క‌విత‌కు పోటీగా బ‌రిలోకి దిగితే... క‌నీసం డిపాజిట్ కూడా ద‌క్కే అవ‌కాశాలు లేవ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ కార‌ణంగానే వాస్త‌వ చిత్రాన్ని ముందుగానే అంచ‌నా వేసిన యాష్కీ... నిజామాబాద్ ను వ‌దిలేసి ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల వైపు చూస్తున్నార‌ట‌.




Tags:    

Similar News