ఈడీపై సుప్రీంకోర్టుకు.. కవితకు గట్టి షాక్

Update: 2023-03-15 15:08 GMT
ఢిల్లీ మద్యం కేసులో ఈడీపై సుప్రీంకోర్టుకు ఎక్కింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల  కవిత.    రేపు కవితను ఈడీ అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాల నడుమ ఈ పరిణామం సంచలనమైంది. ఒక మహిళను విచారించేందుకు ఈడీ కార్యాలయానికి పిలవడంపై ఆమె పిటీషన్ దాఖలు చేశారు.  ఈడీ అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ, భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ కె. కవిత చేసిన పిటిషన్‌ను మార్చి 24న విచారించేందుకు సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది.ఇప్పటికిప్పుడు స్టే ఇవ్వలమేని స్పష్టం చేసింది.

ఢిల్లీ మద్యం కేసులో తాను ఒక మహిళనని, తనను విచారించేందుకు ఈడీ కార్యాలయానికి పిలవడం సరికాదని ఆమె పిటిషన్‌ దాఖలు చేశారు. తమకు ఇచ్చిన నోటీసుల్లో ఇతరులతో కలిపి విచారిస్తామని చెప్పారని.. కానీ అలా చేయలేదని కవిత పేర్కొన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మొబైల్‌ ఫోన్లు సీజ్‌చేశారని కోర్టు దృష్టికి కవిత తీసుకెళ్లారు. సీఆర్పీసీ సెక్షన్‌ 160 ప్రకారం ఓ మహిళను ఆమె ఇంటికి వెళ్లి మాత్రమే విచారించాల్సి ఉన్నా.. ఈడీ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు తీసుకుంటున్నట్లు సీజేఐ ధర్మాసనం తెలిపింది. అయితే ఈడీ విచారణపై స్టే ఇవ్వడానికి మాత్రం నిరాకరిచింది. ఈనెల 24న వాదనలు వింటామని స్పష్టం చేసింది.

మార్చి 16న ఈడీ ముందట కవిత హాజరుకావాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఆమె సుప్రీంకోర్టుకు ఎక్కడం విశేషం.  ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు ప్రస్తావించలేదని కవిత పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇదే కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్నారు.

బుధవారం భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ ముందు అత్యవసర జాబితా కోసం ఈ పిటీషన్ దాఖలు చేశారు.  సుప్రీంకోర్టు ఈ పిటీషన్ ను వెంటనే విచారించడానికి తిరస్కరించారు. మార్చి 24కి వాయిదా వేశారు.

కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదిస్తూ ఈ నెల మొదట్లో కవిత ఈడీ ముందు హాజరయ్యారని, అయితే పిటిషనర్ మహిళ అయినందున పదేపదే సమన్లు జారీ చేయడం చట్టానికి విరుద్ధమని వాదించారు. "ఎఫ్‌ఐఆర్‌లో పిటిషనర్ పేరు లేనప్పటికీ, కేంద్రంలో అధికారంలో ఉన్న అధికార రాజకీయ పార్టీకి చెందిన కొందరు సభ్యులు పిటిషనర్‌ను ఢిల్లీ ఎక్సైజ్ పాలసీతో ముడిపెట్టి అపకీర్తితో కూడిన ప్రకటనలు చేశారు" అని పిటిషన్‌లో పేర్కొంది. ఈడి "అత్యంత సిగ్గుచేటు"గా వ్యవహరిస్తోందని.. "కేంద్రంలో అధికారంలో ఉన్న అధికార పార్టీ సభ్యుల కోరిక మేరకు పెద్ద కుట్ర పన్నింది" అని కవిత పిటీషన్ లో ఆరోపించారు.

తమను , వారి కుటుంబ సభ్యులను అరెస్టు చేస్తామని బెదిరించడం ద్వారా ఇతర సాక్షుల నుండి ఈడీ తప్పుడు వాంగ్మూలాలను పొందుతోందని కవిత పేర్కొన్నారు. "తనపై విచారణ కేవలం అధికారంలో ఉన్న అధికార రాజకీయ పార్టీ ఆదేశానుసారం ఈడీ కేసులు పెట్టింది తప్ప మరేమీ కాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. తనను శారీరకంగా మరియు మానసికంగా ఈడీ బలవంతం చేస్తుందని.. తనపై ఎటువంటి కేసు లేదని కవిత పిటీషన్ లో తెలిపింది.  

ఢిల్లీ లిక్కర్ స్కాం చూస్తే కుంభకోణానికి పాల్పడిన మద్యం సంస్థ ఇండోస్పిరిటిస్‌లో కవిత బినామీ పెట్టుబడులు పెట్టారని ఈడీ ఆరోపణలు చేసింది.  హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై ఇండోస్పిరిట్స్‌లో కవితకు వాటా ఉందని ఈడీ ఆరోపించింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News