టీడీపీని గిల్లుతున్న కావూరి

Update: 2015-11-03 07:04 GMT
మాజీ కేంద్రమంత్రి, మొన్నటి ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన సీనియర్ నేత కావూరి సాంబశివ రావు మిత్రపక్షం తెలుదేశాన్ని గిల్లడం ప్రారంభించారు. ఏపీలో టిడిపి క్రమంగా బలహీనపడుతోందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఏపీలో లంచగొండితనం కూడా పెరిగిపోతోందన్నారు. ఏపీలో బిజెపికే అవకాశాలు ఉన్నాయని చెప్పిన ఆయన ఆంధ్రకు అవసరమైన సాయం చేసేందుకు బిజెపి సిద్ధంగా ఉందని అభిప్రాయపడ్డారు.

దేశంలో అవినీతిని రూపుమాపాలని, అభివృద్ధిలో నిలపాలని ప్రధాని మోడీ ముందుకు వెళ్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి బలపడుతుందన్న నమ్మకం ఉందని కావూరి అన్నారు. అయితే... ఏపీకి ఎలాంటి సాయం కావాలన్నా చేయడానికి బీజేపీ సిద్దంగా ఉందని చెబుతున్న కావూరి... కేంద్రం ప్రత్యేక హోదా, ప్యాకేజీ మాత్రం ఎందుకు ఇవ్వడం లేదో చెప్పడం లేదు.

మరోవైపు చంద్రబాబుపై ఎగిరెగిరి పడుతున్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా మంగళవారం మరోసారి చంద్రబాబును టార్గెట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలను రాష్ట్రంలోని పలుచోట్ల దగ్ధం చేస్తుండటంపై ఆయన మండిపడ్డారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు స్పందించాలని డిమాండ్ చేశారు. ఒక్క ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమనే భావన సరికాదన్నారు. ముప్పై సంవత్సరాలకు పైగా ప్రత్యేక హోదా ఉన్న అస్సోం రాష్ట్రం ఇప్పటికీ ఎందుకు అభివృద్ధి చెందలేదో తెలుసుకోవాలన్నారు. ఏపీకు హోదా ఇవ్వడంలో కేంద్రానికి ఇబ్బందులున్నాయన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం హోదా కన్నా ఎక్కువ నిధులు ఇస్తుందన్న నమ్మకముందన్నారు.

మొత్తానికి బీజేపీ నాయకులు ఒక్కరొక్కరుగా చంద్రబాబును టార్గెట్ చేసి నిత్యం ఏదో ఒక విమర్శలు చేస్తున్నారు. అయినప్పటికీ టీడీపీ సంయమనం పాటిస్తుండడంతో వారి జోరు మరింత పెరుగుతోంది. దీనిపై చంద్రబాబు ఆలస్యం చేస్తే నష్టం కలగక మానదు.
Tags:    

Similar News