కేసీఆర్ లాంటి బ‌ఫూన్ ప్ర‌పంచంలోనే ఉండ‌ర‌ట‌!

Update: 2018-09-08 07:30 GMT
మాట‌కు మాట పాత ముచ్చ‌ట‌. మాట‌కు రెండు మాట‌లా.. మూడు మాట‌లా?  నాలుగు మాట‌లా?  ఇవే ఇప్ప‌టి రాజ‌కీయం. వాతావ‌ర‌ణం వేడెక్కిపోవాలంటే నోటికి వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడ‌టానికి మించిన మార్గం మ‌రొక‌టి ఉండ‌దు. ఆ విష‌యంపై తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు ఉన్నంత క్లారిటీ మ‌రెవ‌రికీ ఉండ‌ద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో పాటు.. ఎవ‌రినైనా.. ఎంత‌టి వారినైనా తుస్కారంగా మాట్లాడే తీరు కేసీఆర్ లో చాలానే ఉంటుంది. త‌న‌కు న‌చ్చ‌ని వారిని ఎవ‌రినైనా ఆయ‌న ఇట్టే తేలిగ్గా తీసేస్తారు. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో మోడీ అంటే అస్స‌లు గిట్టని కేసీఆర్‌.. ఆయ‌న్ను ఫాసిస్ట్ తో పోల్చారు. నిజానికి ఆ స‌మ‌యంలో మోడీని అంత మాట అన్న ఏకైన అధినేత కేసీఆర్ మాత్ర‌మే.

త‌ర్వాతి కాలంలో కేసీఆర్ మాట‌ను గుర్తు పెట్టుకొని మ‌రీ మోడీ ఆయ‌న‌కు చుక్క‌లు చూపించార‌ని చెబుతారు. ఇప్పుడంటే ఒక‌రికి ఒక‌రు రాజ‌కీయ అవ‌స‌రాల నేప‌థ్యంలో పాత ముచ్చ‌ట్ల‌ను మ‌ర్చిపోయార‌ని చెప్పాలి.ముంద‌స్తుకు రంగంలోకి దిగిన కేసీఆర్‌ కు ఉన్న ఏకైన బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి కాంగ్రెస్ పార్టీనే. ఆ పార్టీ సంగ‌తి కానీ చూస్తే.. తెలంగాణ‌లో టీఆర్ ఎస్ కు మ‌రెవ‌రూ పోటీ ఉండ‌ని ప‌రిస్థితి.

ఈ విష‌యాన్ని గుర్తించిన ఆయ‌న‌.. కాంగ్రెస్ పార్టీ మీద ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రూ చేయ‌ని విమ‌ర్శ‌ల్ని చేసేందుకు సైతం సిద్ధ‌ప‌డుతున్నారు. దేశ ప్ర‌ధ‌మ ప్ర‌ధాని నెహ్రుపైనా విమ‌ర్శ‌లు చేయ‌టం.. ఇందిర‌మ్మ‌ను తూల‌నాడ‌టం అన్ని ఇందులో భాగ‌మే. రాహుల్ దేశంలోనే  అతి పెద్ద బ‌ఫూన్ అని మాట తూలిన కేసీఆర్ పై కాంగ్రెస్ నేత‌లు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు.

త‌మ అధినేత‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కు ధీటుగా కేసీఆర్ పై విమ‌ర్శ‌ల్ని ఎక్కు పెట్టారు ఏఐసీసీ తెలంగాణ వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జ్ ఆర్సీ ఖుంటియా. స‌చివాల‌యానికి వెళితే చ‌స్తావ‌ని జ్యోతిష్యుడు చెప్పిన మాట‌ల్నిన‌మ్మి నాలుగేళ్లుగా ఆ గ‌డప కూడా తొక్క‌ని బ‌ఫూన్ ప్ర‌పంచంలో కేసీఆర్ ఒక్క‌డేన‌ని విమ‌ర్శించారు.

నెల వ్య‌వ‌ధిలో మోడీని మూడు సార్లు క‌లిసిన కేసీఆర్ రాష్ట్రానికి ఏం సాధించార‌ని ప్ర‌శ్నించారు. పోల‌వ‌రంలా ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా సాధించావా? అని నిల‌దీశారు.

తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో టీఆర్ఎస్ ను విలీనం చేస్తాన‌ని సోనియాగాంధీ పాదాల‌కు మొక్క‌లేదా? అని ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. సురేశ్ రెడ్డి పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి వ‌చ్చే న‌ష్ట‌మేమీ ఉండ‌ద‌న్నారు. కేసీఆర్ దొంగ పాస్ పోర్టుల వ్యాపారం చేసి రాజ‌కీయాల్లోకి వ‌చ్చార‌న్నారు. కేసీఆర్ మోసాలు.. ద‌గాల‌ను ఎదిరించాల‌ని.. అందుకు భిన్నంగా నిశ్శ‌బ్దంగా ఉండే వారు సైతం ఆయ‌న పాపంలో  భాగ‌స్వాములు అవుతార‌ని మండిప‌డుతున్నారు. త‌మ‌పై దాడి మొద‌లెట్టిన కేసీఆర్ కు అంతే స్థాయిలో రిటార్ట్ ఇచ్చేందుకు తెలంగాణ‌కాంగ్రెస్ నేత‌లుసిద్ధ‌మ‌వుతున్న‌ట్లుగా క‌నిపిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News