దళితబంధును విమర్శించే వారికి సమాధానం ఎందుకు ఇవ్వలేదో చెప్పిన కేసీఆర్

Update: 2021-08-17 03:52 GMT
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన రాజకీయ ప్రత్యర్థులకు షాకుల మీద షాకులు ఇచ్చారు. దళితబంధు పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు.. చెప్పిన మాటలు విన్నంతనే నోట మాట రాని రీతిలో ఉన్నాయని చెప్పక తప్పదు. దళితబంధు అమలుపై తనపై విమర్శలు చేసిన వారికి సమాధానం చెప్పకుండా ఉండటానికి కారణం.. వారికి మొత్తం వివరాలు చెప్పి ఉంటే అనాడే నాయకుల గుండెలు ఆగి మరణించేవారని.. అలాంటి వారిని చూసి ఆగం కావొద్దన్నారు కేసీఆర్. దళితబంధు పథకాన్ని తప్పు పట్టే వారిని.. విమర్శలు చేసే వారి మాటల్ని సింఫుల్ గా తేల్చేందుకు వీలుగా కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పాలి.

హుజూరాబాద్ ఒక ప్రయోగశాల అని.. గతంలో తాను షురూ చేసిన రైతుబంధు ఇక్కడే ప్రారంభించామని.. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో దళితబంధును షురూ చేస్తున్నామని చెప్పారు. ఈ పథకాన్ని నూటికి నూరు పాళ్లు విజయవంతం చేసి తీరుతామని ధీమాగా చెప్పారు. ఈ పథకంపై గతంలో చిల్లరమల్లర విమర్శలు చేశారని.. అయినా తాను స్పందించలేదని చెప్పారు. దీనికి కారణం.. మొత్తం పథకం వివరాల్ని చెబితే.. నాయకులు చచ్చిపోతారన్న ఉద్దేశమన్న మాటను చెప్పటం ద్వారా.. దళితబంధు పథకాన్ని తాను ఆషామాషీగా ప్రకటించలేదని.. దాని వెనుక చాలా కసరత్తు ఉందన్న భావన కలిగేలా చేశారని చెప్పాలి.

ఈ పథకం పాతికేళ్ల నాటి కలగా కేసీఆర్ అభివర్ణించారు. ఈ పథకంలో దళిత వాడల్ని బంగారు మేడలుగా చేయటమే తన లక్ష్యమని చెప్పిన కేసీఆర్.. దళితబంధు ఆలోచన ఇప్పటిది కాదని.. పాతికేళ్ల క్రితం తాను తొలిసారిగా సిద్దిపేటలో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే ఉందన్నారు. తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దళిత చైతన్య జ్యోతి పేరుతో వారి అభ్యున్నతికి పాటుపడ్డామని.. దళితబంధు పథకం నిధులతో నచ్చిన వ్యాపారం చేసుకోవచ్చాన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా మార్కెటింగ్ కల్పిస్తాయని.. ఈ మేరకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు. ఒకవేళ పొరపాటున లబ్థిదారులు మరణిస్తే వారి కుటుంబం ఆపదకు లోనుకాకుండా ఉండటానికి దళిత రక్షణ నిధి నుంచి సాయం అందిస్తామని చెప్పారు.

దళితబంధు పథకం ఎంతమాత్రం కాదని.. అదొక మహా ఉద్యమని.. దేశమంతా ఈ ఉద్యమం పాకాలన్నారు. ఈ పథకం అమలు కోసమే కర్ణన్ ను కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా నియమించామని.. దళిత జాతి అభ్యున్నతికి.. ఉద్యమకారులకు అండగా నిలిచిన బొజ్జా తారకం కొడుకు ఐఏఎస్ అధికారి కమ్ ఎస్సీ వెల్ఫెర్ సెక్రటరీ రాహుల్ బొజ్జాను సీఎంవో సెక్రటరీగా ప్రకటించామన్నారు. మొత్తంగా దళితబంధు పథకం ఆషామాషీగా పెట్టలేదని.. దాని వెనుక ఎంతో కసర్తతు ఉన్నట్లుగా కేసీఆర్ చెప్పుకున్నారు. ఈ పథకాన్ని హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో తెర మీదకు తెచ్చినట్లుగా ప్రచారం జరుగుతున్న క్రమంలో.. అందులో వాస్తవం లేదన్న విషయాన్ని చెప్పేందుకు కేసీఆర్ ప్రయత్నించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News