మోడీతో ముచ్చట కోసం మళ్లీ కేసీఆర్ పరుగులు

Update: 2015-10-31 04:02 GMT
వారం రోజుల వ్యవధిలో రెండోసారి ఢిల్లీ పర్యటనకు కేసీఆర్...  కేంద్రం మీద కోపమో, మోదీ మీద అలకో... ఏదైతేనేం కానీ, ఢిల్లీకి వెళ్లాలంటే మొహం మెత్తిన చందాన ముడుచుకుంటూ వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఇంతగా మోదీకి దాసోహమైపోయారా? వారంలోపు రెండోసారి మళ్లీ ఆయన డిల్లీ పరుగెడుతుంటే ఈ వార్త నిజమేననిపించక మానదు మరి. అక్టోబర్ 26 నుంచి 28 వరకు దేశరాజధానిలోనే గడిపిన కేసీఆర్ మళ్లీ నవంబర్ 3 నుంచి 5వ తేదీవరకు మూడు రోజులపాటు ఢిల్లీ గడప తొక్కనున్నారు.  మొన్నటి పర్యటనలో కలవడానికి మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వకపోయినందునే.. కేసీఆర్ మళ్లీ ఢిల్లీ వెళుతున్నట్లుగా కనిపిస్తోంది.

వారంలోపు రెండోసారి కేసీఆర్ డిల్లీ పర్యటన రాజకీయ అంచనాలను మరింతగా రేకెత్తిస్తున్నది. తనను వెంటాడుతున్న సీబీఐ కేసులోంచి బయటపడేయవలిసిందిగా మోదీని వేడుకోవడానికే కేసీఆర్ మళ్లీ ఢిల్లీ పరుగెడుతున్నాడని జనాంతికం. 2004-2006 మద్య కాలంలో యూపీఏ హయాంలో కేంద్ర కార్మిక మంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఆ శాఖలో జరిపిన అవకతవకలకు సంబంధించి సీబీఐ కేసీఆర్‌ ని ఇటీవలే నిలదీసింది కూడా. రాజకీయ, ప్రభుత్వ వర్గాల్లో ఇది సంచలనం కలిగించింది. మొదట ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణ కాంట్రాక్టును అస్మదీయులకు కట్టబెట్టడం, తాజాగా సహారా గ్రూప్ సంస్థ ఈపీఎఫ్ ఖాతాల నిర్వహణలో అవకతవకలకు సంబంధించి కేసీఆర్ పాత్ర స్పష్టంగా బయటపడటంతో సీబీఐ దీని అంతు తేల్చడానికి పూనుకుంది.

సీబీఐ విచారణకు, కేసీఆర్ ఢిల్లీకి పరుగు పెట్టడానికి మధ్య బాదరాయణ సంబందం ఉందని జనం నమ్ముతున్నారు. అయితే అక్టోబర్ 26న కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు బీజీ షెడ్యూల్ కారణంగా మోదీతో మనసు విప్పి మాట్లాడలేకపోయారని అందుకే మనసు విప్పి మాట్లాడటానికే మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారని టీఆరెస్ పార్టీ వర్గీయులు సమర్థించుకుంటూ ఉండటం ఇంకా నవ్వు తెప్పిస్తోంది. నవంబర్ 3 - 4 తేదీల్లో ఢిల్లీలో జరుగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం, కాన్ఫెడరేషన్ ఆప్ ఇండియన్ ఇండస్ట్రీ సమావేశాలకు హాజరు కావడానికే కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారని చెప్పుకోవడం వరకు కరెక్టే కానీ, నవంబర్ 5న ఢిల్లీలోనే ఉండి మోదీ అప్పాయింట్ మెంటుకు కేసీఆర్ ఎందుకు ప్రయత్నిస్తున్నారనేదే అనుమానాలు రేకెత్తిస్తోంది.

తను తన ఫాంహౌస్ లో నిర్వహించబోతున్న మహా చండీ యాగానికి ఆహ్వానించడం ఒక్కటే తన ముందున్న ఎజెండా అని కేసీఆర్ సమర్థించుకోవచ్చు గాక.. కానీ.. వాస్తవానికి ప్రజలు, పరిశీలకులు మాత్రం.. సీబీఐ కేసునుంచి తనను బయటపడేసే మార్గ నిర్దేశం చేయడానికి మోడీని ఆశ్రయిస్తున్నారని అనుకుంటున్నారు.
Tags:    

Similar News