అవును.. కేసీఆర్ వెన‌క్కి త‌గ్గారు

Update: 2018-06-11 04:51 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కోప‌గించుకునే సంద‌ర్భాల్లో చాలా త‌క్కువ‌గానే క‌నిపిస్తాయి. వీలైనంత వ‌ర‌కూ ఎట‌కారంతో.. ఒకింత సీరియ‌స్ తో వ‌చ్చే మాట‌ల‌తోనే గ‌జ‌గ‌జా వ‌ణికే ప‌రిస్థితి. అలాంటిది ఆయ‌నకు ఆగ్ర‌హం వ‌స్తే త‌ట్టుకోలేమ‌న్న మాట బ‌లంగా వినిపిస్తూ ఉంటుంది.

కేసీఆర్‌కు కోపం వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న ఎంత‌లా విరుచుకుప‌డతార‌న్న విష‌యం తాజాగా ఆర్టీసీ ఎపిసోడ్‌లో అంద‌రికి అర్థ‌మైన ప‌రిస్థితి. అవ‌స‌ర‌మైతే ఆర్టీసీని మూసేస్తా.. స‌మ్మె పేరుతో బెదిరిస్తారా? అంటూ చెల‌రేగిపోయిన ఆయ‌న‌.. తాజాగా కూల్ అయిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

ఆర్టీసీ కార్మికులు తామిచ్చిన స‌మ్మె నోటీసును వెన‌క్కి తీసుకోవాల‌ని.. లేకుంటే విప‌రిణామాలు త‌ప్ప‌వంటూ చెల‌రేగిపోయిన కేసీఆర్‌.. అందుకు భిన్నంగా ఆర్టీసీ కార్మికుల ప్ర‌ధాన డిమాండ్ల‌లో కీల‌క‌మైన తాత్కాలిక భృతిని ప్ర‌క‌టించ‌టంతో పాటు మ‌రికొన్ని వ‌రాల జ‌ల్లు కురిపించింది. కేసీఆర్ ఆగ్ర‌హంతో వ‌ణికిన ఆర్టీసీ కార్మిక సంఘ నేత‌లు.. కార్మికుల ఆగ్ర‌హంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వ బెదిరింపుల‌కు లొంగే ప్ర‌స‌క్తే లేద‌న్న సంకేతాల్ని ఇచ్చారు.

ఇలాంటివేళ‌.. మంత్రుల‌తో న‌డిపిన మంత్రాంగంతో పాటు ఆర్టీసీకి చెందిన సంఘాల నాయ‌కుల‌తో జ‌రిపిన సుదీర్ఘ భేటీలు ఎట్ట‌కేల‌కు వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం దిశ‌గా అడుగులు ప‌డ్డాయి.

కొన్నికీల‌క డిమాండ్ల విష‌యంలో ప్ర‌భుత్వం సానుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌టంతో తాము చేస్తామ‌న్న స‌మ్మెను వాయిదా వేసుకున్న‌ట్లుగా ఆర్టీసీ నేత‌లు స్ప‌ష్టం చేశారు.శ‌నివారం స్టార్ట్ అయిన చ‌ర్చ‌ల ప‌రంప‌ర ఆదివారం సాయంత్రానికి ఒక కొలిక్కి వ‌చ్చాయి.  కార్మికులు అడిగిన తాత్కాలిక భృతి మీద కార్మిక సంఘాల నాయ‌కుల‌కు.. రాష్ట్ర ప్ర‌భుత్వానికి మ‌ద్య నాట‌కీయంగా బేరాలు జ‌రిగాయి. చివ‌ర‌కు మ‌ధ్యే మార్గంగా 16 శాతం తాత్కాలిక భృతిని ఇస్తాన‌ని చెప్ప‌టంతో తాము చేస్తాన‌న్న స‌మ్మెను విర‌మించుకోనున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. ఈ నిర్ణ‌యంతో ఆర్టీసీపై రూ.16కోట్ల అద‌న‌పు భారం ప‌డుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఆర్టీసీ ఇప్ప‌టికే న‌ష్టాల్లో ఉంద‌ని.. కార్మికుల డిమాండ్ల‌తో మ‌రింత న‌ష్టాల్లోకి వెళుతుంద‌ని.. స‌మ్మె విష‌యంలో వెన‌క్కి తగ్గ‌కుంటే ప్ర‌త్యామ్నాయాన్ని చూస్తామ‌ని.. అవ‌స‌ర‌మైతే ఆర్టీసీని మూసివేస్తామ‌ని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించ‌టం సంచ‌ల‌నంగా మారింది. అయితే.. ఆ మాట‌లు అన్నంత తేలిక కాదు చేత‌ల్లో చేసి చూపించ‌ట‌మ‌న్న‌ది కేసీఆర్‌కు అర్థ‌మైంద‌ని చెబుతున్నారు.

ఆర్టీసీపై ఆయ‌న చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ముఖ్య‌మంత్రి ఇమేజ్ ను డ్యామేజ్ చేసింద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి న‌ష్ట‌నివార‌ణ‌లో భాగంగానే కార్మికుల డిమాండ్ల మీద ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించింద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ప్ర‌భుత్వ ఉద్యోగుల విష‌యంలో ఉదారంగా వ్య‌వ‌హ‌రించే ప్ర‌భుత్వం ఆర్టీసీ కార్మికుల విష‌యానికి వ‌స్తే మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్న విమ‌ర్శ పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌గా మారింది.

ఆర్టీసీ స‌మ్మెను విర‌మించేలా చేయ‌టంతో పాటు.. ఆర్టీసీ కార్మిక సంఘాల నేత‌ల‌కు.. ప్ర‌భుత్వానికి మ‌ధ్య రాజీ కుదిర్చేందుకు ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి..  మంత్రులు ఈటెల‌.. హ‌రీశ్ రావు.. కేటీఆర్.. జ‌గ‌దీశ్ రెడ్డి.. మ‌హేంద‌ర్ రెడ్డిల‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఆర్టీసీ సంఘ నేత‌ల‌తో ఆదివారం ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం వ‌ర‌కూ చ‌ర్చ‌లు జ‌రిపి రాజీ ఫార్ములాను తెర మీద‌కు తెచ్చారు. దీనికి ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించ‌టంతో స‌మ్మెను చేప‌ట్ట‌బోమ‌ని ఆర్టీసీ కార్మిక సంఘ నేత‌లు స్ప‌ష్టం చేశారు.

ఆర్టీసీపై ప్ర‌భుత్వం ఇచ్చిన హామీలు చూస్తే..

+ ఇప్పుడిస్తున్న దానికి తోడుగా తాత్కాలిక భృతిని 16 శాతం పెంచ‌టం. అది కూడా జులై నుంచి అమ‌ల్లోకి తేవ‌టం

+ ఆర్టీసీ బ‌కాయిల్ని ప్ర‌భుత్వం తీర్చ‌టం

+ ఆర్టీసీ అప్పులు.. న‌ష్టాల్లో నుంచి బ‌య‌ట‌ప‌డేసేందుకు వీలుగా త్వ‌ర‌లో ఉన్న‌త‌స్థాయి నిపుణుల క‌మిటీ ఏర్పాటు

+ మోటారు వాహ‌న ప‌న్ను.. డీజిల్ పై వ్యాట్ మిన‌హాయింపు.. జీహెచ్ ఎంసీ ఇవ్వాల్సిన నిధుల‌పై క‌మిటీ అధ్య‌య‌నం

+ చార్ట‌ర్డ్ అకౌంటెంట్లు.. ఆర్థిక నిపుణులు.. ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన ఎండీలు.. కార్మిక సంఘ నేత‌ల‌తో క‌మిటీ ఏర్పాటు.

+ మూడు నెల‌ల్లో ప్ర‌భుత్వానికి నివేదిక‌

+ తెలంగాణ ఉద్య‌మ సంద‌ర్భంగా ఆర్టీసీ కార్మికులు చేప‌ట్టిన స‌క‌ల జ‌నుల స‌మ్మె కాలానికి వెంట‌నే వేత‌నాల విడుద‌ల‌కు ఆదేశం.

+ తెలంగాణ ఉద్య‌మ వేళ‌లో ఇవ్వాల్సిన బ‌కాయిల్ని ఇప్ప‌టికి చెల్లించ‌క‌పోవ‌టంపై కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసి.. వెంట‌నే న‌గ‌దు రూపంలో చెల్లింపులు జ‌ర‌పాల‌న్న ఆదేశంతో. దీంతో.. మ‌రో రూ.80 కోట్ల అద‌న‌పు భారం ప‌డనుంది.


Tags:    

Similar News