మైలేజీ కోసం చంద్రుళ్లు పోటీ ప‌డుతున్నారే

Update: 2017-06-20 05:03 GMT
దేశంలో చాలానే రాష్ట్రాలు ఉన్నాయి. చాలానే ముఖ్య‌మంత్రులు ఉన్నారు. కానీ.. ఎవ‌రూ చెప్పుకోలేని రీతిలో గొప్ప‌లు చెప్పుకోవ‌టం.. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో త‌మ పాత్ర చాలా కీల‌క‌మ‌న్న‌ట్లుగా బ‌డాయికి పోవ‌టం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు మాత్ర‌మే చెల్లుతుందేమో?

రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా అధికార ఎన్డీయే ప‌క్షం త‌ర‌ఫున బీజేపీ జాతీయ పార్టీ నేత‌లు కూర్చొని రామ్ నాథ్ కోవింద్‌ ను ఎంపిక చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో అనూహ్యంగా వ‌చ్చిన పేరుతో రాజ‌కీయ వ‌ర్గాల‌తో పాటు.. దేశ ప్ర‌జ‌లు కాసింత ఆశ్చ‌ర్య‌పోయారు. రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా పెద్ద‌గా ప‌రిచ‌యం లేని పేరును తెర మీద‌కు తీసుకురావ‌టంతో ఆస‌క్తి వ్య‌క్త‌మైంది.

ఇదే స‌మ‌యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు రాష్ట్రప‌తి అభ్య‌ర్థిపైన త‌మ‌దైన శైలిలో గొప్ప‌లు చెప్పుకోవ‌టం విశేషం.రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా రామ్ నాథ్‌ ను ఎంపిక చేసిన త‌ర్వాత ప్ర‌ధాని మోడీ ప‌లువురు సీఎంల‌తో మాట్లాడారు. త‌మ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇవ్వాల్సిందిగా కోరారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు ఫోన్ చేశారు. మోడీ బ్యాచ్ ఎంపిక చేసిన ద‌ళిత నేత రామ్ నాథ్‌ కు త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని కేసీఆర్ చెప్పేశారు. ఇది జ‌రిగిన కాసేప‌టికే తెలంగాణ‌రాష్ట్ర సీఎంవో ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది.

రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ఎంపిక‌లో కేసీఆర్ చేసిన సూచ‌న‌ను ప్ర‌ధాని మోడీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నార‌ని.. ఆ విష‌యాన్ని మోడీనే స్వ‌యంగా కేసీఆర్ తో ప్ర‌స్తావించారంటూ ఒక ప్రెస్ నోట్‌ ను రిలీజ్ చేసింది. "మీ సూచ‌న మేర‌కు ఒక ద‌ళిత నాయ‌కుడిని రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ఎంపిక చేశాం" అని కేసీఆర్‌ కు ప్ర‌ధాని మోడీ చెప్పిన‌ట్లుగా పేర్కొన్నారు.  రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ఏ వ‌ర్గానికి చెందిన వ్య‌క్తిని ఎంపిక చేస్తే బాగుంటుంద‌న్న విష‌యాన్ని తాను గ‌తంలో మోడీతో చ‌ర్చించిన‌ట్లుగా తాజా ప్రెస్ నోట్‌ లో చెప్ప‌క‌నే చెప్పేయ‌టంతో పాటు.. తానెంత ద‌ళిత ప‌క్ష‌పాతిన‌న్న విష‌యాన్ని చెప్పేశారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి త‌ర‌ఫు నుంచి ఇలాంటి ప్రెస్ నోట్ వ‌స్తే.. ఏపీ సీఎంవో మాత్రం ఊరుకుంటుందా? త‌మ అధినేత గొప్ప‌త‌నాన్ని.. కీర్తిని చాటేలా ప్రెస్ నోట్‌ ను సిద్ధం చేసేశారు. రాష్ట్రప‌తి అభ్య‌ర్థిత్వం ఖ‌రారు చేసిన వెంట‌నే ఏపీ సీఎం చంద్ర‌బాబుతో ప్ర‌ధాని మోడీ మాట్లాడార‌ని.. రామ్ నాథ్ అభ్య‌ర్థిత్వానికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోర‌టం.. ఆ వెంటనే ఓకే అన‌ట‌మే కాదు.. స‌రైన అభ్య‌ర్థిని ఎంపిక చేశారంటూ మోడీని ముఖ్య‌మంత్రి కీర్తించిన‌ట్లుగా చెప్పేశారు. ఇదంతా బాగానే ఉంది. ఇందులో ఏం గొప్ప‌త‌నం ఉంద‌న్న సందేహం రావొచ్చు. కానీ.. అస‌లు విష‌యం ఇంకా చెప్ప‌లేదు.

అభ్య‌ర్థి ముచ్చ‌ట చెప్పిన త‌ర్వాత‌.. ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ మ‌ద్ద‌తు కావాల‌ని.. అందుకోసం ఆమెతో మాట్లాడాల్సిందిగా చంద్ర‌బాబును మోడీ కోరిన‌ట్లుగా సీఎంవోవ‌ర్గాలు చెబుతున్నాయి. అంటే.. మ‌మ‌త‌తో రాయ‌బారానికి చంద్ర‌బాబు సాయాన్ని మోడీ కోరార‌న్న మాట‌. ఈ రెండు సీఎంవోల మాట‌లు చూస్తే.. రాష్ట్రప‌తి ఎంపిక.. ఆయ‌న ఎన్నిక‌ల మోడీ ప‌రివారం కంటే కూడా  తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కీల‌క భూమిక పోషించిన‌ట్లుగా చెప్పుకోవ‌టం విశేషంగా క‌నిపించ‌క మాన‌దు. ఏమైనా ఇద్ద‌రు చంద్రుళ్లు.. రాష్ట్రప‌తి ఎన్నిక విష‌యంలో త‌మ మైలేజీని పెంచుకోవ‌టానికి ఎంత‌గా ప్ర‌య‌త్నిస్తున్నార‌న్న విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News