ఈటల విషయంలో కేటీఆర్ లెక్క ఏంటి?

Update: 2021-08-12 07:42 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడు? ఏ నిర్ణయాలు తీసుకుంటాడు? ఎవరిని పైకి లేపుతాడన్నది మూడో కంటికి కూడా తెలియదు.. రాజకీయ చాణక్యంతో ఆయన ఒకేసారి రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసేస్తుంటారు. పార్టీ నిర్ణయాలైనా.. పరిపాలన విషయంలోనైనా కేసీఆర్ అడుగులు ఎవరూ కనిపెట్టలేరు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ విషయంలోనూ ఆయనపై అవినీతి ముద్రవేసి తన చేతికి మట్టి అంటకుండా ఆయనే రాజీనామా చేసి పోయేలా తెరవెనుక చేసిన మంత్రాంగం అంతా ఇంతా కాదు.. హుజూరాబాద్ నియోజకవర్గం కేంద్రంగా ఉప ఎన్నికలకు కేసీఆర్ వేస్తున్న స్కెచ్చులు అంతుబట్టకుండా ఉన్నాయి.

అయితే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యిండి కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికల విషయంలో ఏమాత్రం పట్టించుకోకుండా కేటీఆర్ సైలెంట్ గా ఉండడం హాట్ టాపిక్ గా మారింది.

హుజూరాబాద్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ప్రకటించగానే.. గెల్లు శ్రీనివాస్ వెళ్లి కేటీఆర్ ను కలిశాడు. ఈ ఫొటోను ట్వీట్ చేసి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ‘ప్రజల ఆశీర్వాదంతో మరో విద్యార్థి నాయకుడు అసెంబ్లీకి రానున్నారని’ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమకారుడికే సీటు వచ్చిందని తెలిపాడు.

అయితే నిజానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇన్ చార్జిగా హరీష్ రావు ఉన్నాడు.నియోజకవర్గంలో మొత్తం హరీష్ నే చూసుకుంటున్నాడు. రాష్ట్రానికి చెందిన మంత్రులు సైతం హుజూరాబాద్ లో మోహరించారు. అయితే కేటీఆర్ ఇప్పటిదాకా అక్కడ అడుగు పెట్టలేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రి అయిన కేటీఆర్ ‘హుజూరాబాద్’ రాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. కేటీఆర్ ఎందుకు సైలెంట్ అయ్యాడన్నది ఆసక్తి రేపుతోంది. ఈటలతో ఉన్న సాన్నిహిత్యం వల్లనే కేటీఆర్ దూరం ఉన్నారా? లేక మరేదైనా కారణమా? అన్నది తెలియాల్సి ఉంది.




Tags:    

Similar News