వామ్మో.. ఈ విందులేంటి బాబోయ్..?

Update: 2015-12-31 04:47 GMT
ఒకరోజు విందు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రెండు రోజులు.. ఓకే. అదే మూడు రోజులు వరుస విందులైతే కాస్త ఇబ్బంది. కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. గవర్నర్ లు దాదాపుగా 8 రోజుల పాటు వరుస విందులలో పాల్గొనాల్సిన పరిస్థితి. ఈ వరుస విందులతో వామ్మో అనుకోవాల్సిన పరిస్థితి. మన దగ్గర వీవీఐపీల విందులు అంటే ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. భారీగా సాగే ఈ విందులు వరుసగా సాగటం కాస్తంత ఆసక్తిరమైన అంశంగా చెప్పాలి.

డిసెంబరు 23 నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత హోదాలో అయుత చండీ యాగాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తొలిరోజు గవర్నర్ నరసింహన్ హాజరయ్యారు. ఆ రోజు మొదలు.. చండీయాగం పూర్తయ్యే వరకూ .. దాదాపుగా క్రమం తప్పకుండా గవర్నర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏదైనా మిస్ అయితే.. ఒక రోజు ఏమన్నా అయి ఉంటుంది. ఇక.. కేసీఆర్ సంగతైతే చెప్పాల్సిన అవసరమే లేదు. ఎర్రవెల్లి నుంచి దాటిందే లేదు.

23 నుంచి 27 వరకు ఆయన ఎర్రవల్లిలోనే ఉన్నారు. అంటే ఐదు రోజులు. అన్ని రోజులు గవర్నర్ రెగ్యులర్ గా కలుస్తూనే ఉన్నారు. మరి.. ఇలా ఇద్దరు ప్రముఖులు కలిసే వేళ.. విందు మామూలే. ఇక.. యాగం అయిపోయిన తర్వాత శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ నరసింహన్ 29న రాజ్ భవన్ లో  విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి..రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఇది పూర్తి అయ్యిందో లేదో.. తర్వాతి రోజు అంటే.. 30న రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్ ఎట్ హోం పేరిట విందును ఏర్పాటు చేశారు.

దీంతో.. మళ్లీ రాష్ట్రపతి.. గవర్నర్.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరయ్యారు. విందులో పాల్గొన్నారు. అంటే.. డిసెంబరు 23 నుంచి 30 వరకు నాన్ స్టాప్ విందులే విందులు. ఇక.. 31 కలవకున్నా.. జనవరి 1న కొత్త సంవత్సరం నేపథ్యంలో ప్రముఖుల్ని కలుసుకునే అనవాయితీకి తగ్గట్లు మరోసారి కలుసుకోవటం ఖాయం.  వరుసగా ఇన్నేసిసార్లు వీవీఐపీలు కలవటం.. విందులు ఏర్పాటు చేయటం వాటితో ఎంత ఖర్చు అయి ఉంటుందంటారు..?
Tags:    

Similar News