కేసీఆర్‌, లోకేష్ ఒక్క‌ట‌య్యారు.

Update: 2015-07-18 07:14 GMT
ఒక‌రు కాక‌లు తీరిన రాజ‌కీయ నాయ‌కుడు. త‌న సొంత రాజ‌కీయ చ‌తుర‌త‌తో ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిష్టించిన వ్య‌క్తి. మరొక‌రు తండ్రి చాటు బిడ్డ‌గా రాజ‌కీయాల్లో రాటుదేలుతున్న వ్య‌క్తి. మొద‌టి వ్య‌క్తి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కాగా...రెండో వ్య‌క్తి ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుకు కుమారుడు లోకేష్‌. రాజ‌కీయాల ప‌రంగా బ‌ద్ద‌శ‌త్రుత్వం ఉన్న ఈ ఇద్ద‌రు నాయ‌కులు ఒక్క‌తాటిపైకి వ‌చ్చారు. రెండు రాష్ర్టాల విష‌యంలోనూ, రెండు పార్టీల ఆలోచ‌న విధానంలోనూ ఎంతో వైరుధ్యం ఉన్న వారిద్ద‌రు ఏకం అవ‌డం ఏంట‌నుకుంటున్నారు. వాళ్లిద్ద‌రిలో ఉన్న మాన‌వ‌త్వ‌మే ఇందుకు కార‌ణం.

కసాయిలా మారిన కన్న తండ్రి.... న‌ర‌కం చూపిన పిన్న తండ్రి చిత్ర హింసలను భ‌రించిన ప్రత్యూష అనే అమ్మాయి ఘ‌ట‌న ప్ర‌తి ఒక్క‌రినీ క‌లచివేసిన సంగ‌తి తెలిసిందే. త‌ను అనుభ‌వించిన‌ న‌ర‌కాన్ని మీడియా ద్వారా ప్ర‌త్యూష వెల్ల‌డించిన తీరుతో హృద‌యాలు ద్ర‌వించుకుపోయాయి. ఈ నేప‌థ్యంలో ఆమెకు స‌హాయం అందించేందుకు ఈ ఇద్ద‌రు నాయ‌కులు ముందుకు వ‌చ్చారు. త‌మ నేతృత్వంలోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారానే కాకుండా... వ్య‌క్తిగ‌తంగా కూడా ప్రత్యూషకు ఎలాంటి స‌హాయం అయినా చేస్తానంటూ లోకేష్  ప్ర‌క‌టించారు.

మ‌రోవైపు సీఎం కేసీఆర్‌ ప్రత్యూషను కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి ప‌రామ‌ర్శించ‌నున్నారు. అంతేకాదు ప్రభుత్వం తరపున ప్రత్యూషకు ఎలాంటి సహాయం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేసీఆర్ ప్ర‌క‌టించారు.

మొత్తంగా మంచి ప‌నికోసం, మాన‌వ‌త్వం చాటుకునేందుకు ఇద్ద‌రు కీల‌క నేత‌లు ముందుకు రావ‌డం సంతోష‌క‌ర‌మే.
Tags:    

Similar News