ఇంట‌రెస్టింగ్‌!.. జ‌గ‌న్ గృహ‌ప్ర‌వేశానికి కేసీఆర్‌!

Update: 2019-01-16 15:23 GMT
ఏపీలో విప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత వ‌చ్చే నెల 14న ఏపీ నూత‌న రాజ‌దాని అమ‌రావ‌తి స‌మీపంలో క‌ట్టుకున్న కొత్త ఇంటిలోకి మారిపోతున్నారు. గుంటూరు జిల్లా ప‌రిధిలోని మంగ‌ళ‌గిరి ప‌రిధిలో వైసీపీ పార్టీ కార్యాల‌యంతో పాటుగా అక్క‌డే త‌న ఇంటికి కూడా చాలా రోజుల క్రిత‌మే శ్రీ‌కారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ భ‌వ‌న నిర్మాణం ఇప్పటికే పూర్తి కాగా... శుభ ముహూర్తం చూసుకున్న జ‌గ‌న్‌... వ‌చ్చే నెల 14న అందులో ప్ర‌వేశించేందుకు నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో ఈ కార్య‌క్ర‌మానికి ఇప్ప‌టికే ఏర్పాట్లు ముమ్మ‌రంగా సాగుతుండ‌గా... పార్టీ నేత‌ల్లో కొత్త ఉత్సాహం కొట్టొచ్చిన‌ట్టుగా క‌నిపిస్తోంది. ఏపీలో జ‌గ‌న్ గృహ ప్ర‌వేశ‌మే ప్ర‌త్యేక విష‌యంగా ప‌రిగ‌ణిస్తుండ‌గా - ఈ కార్య‌క్ర‌మానికి వ‌స్తున్న ప్ర‌త్యేక అతిథి ఎవ‌ర‌న్న విష‌యం మ‌రింత ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది. ఈ కార్య‌క్ర‌మానికి టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ సీఎం క‌ల్వకుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు హాజ‌ర‌వుతున్నట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ వార్త‌లు నిజ‌మా?  కాదా?  అన్న విష‌యాన్ని నిర్ధారించుకునేందుకు అటు టీఆర్ ఎస్‌ తో పాటు ఇటు వైసీపీ నేత‌లు కూడా ఆస‌క్తి చూపుతున్న వేళ‌... ఏకంగా ఈ వార్త వాస్త‌వ‌మేనంటూ ఓ ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. వ‌చ్చే నెల 14న జ‌ర‌గ‌నున్న జ‌గ‌న్ గృహ ప్ర‌వేశానికి కేసీఆర్ ప్ర‌త్యేక అతిథిగా హాజ‌రుకానున్నార‌ని ఇటు వైసీపీతో పాటు అటు టీఆర్ఎస్‌లు కూడా ప్ర‌క‌టించేశాయి. ఈ వార్త ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌ గా మారిపోయింద‌ని చెప్పాలి. మ‌రో 3 నెల‌ల్లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరిట కొత్త కూటమి కోసం కేసీఆర్ స‌న్నాహాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ కూట‌మి ఏర్పాట్ల‌లో భాగంగా నేటి మ‌ధ్యాహ్నం ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటుచేసుకుంది. ఫ్రంట్‌కు మ‌ద్ద‌తుగా రావాల్సింది వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఆహ్వానించేందుకు టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వ‌యంగా హైద‌రాబాద్ లోని జ‌గ‌న్ నివాసం లోట‌స్ పాండ్ కు వెళ్లారు.

పార్టీ ప్ర‌తినిధి బృందంతో క‌లిసి వెళ్లిన కేటీఆర్‌.... జ‌గ‌న్‌తో సుదీర్ఘంగానే భేటీ అయ్యారు. ఇరు పార్టీల మ‌ధ్య చ‌ర్చ‌ల అనంత‌రం బ‌య‌ట‌కు వ‌చ్చిన జ‌గ‌న్‌ - కేటీఆర్‌ లు మీడియాతోనూ మాట్లాడారు. దీనిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతుండ‌గానే... జ‌గ‌న్ గృహ ప్ర‌వేశం - ఆ కార్య‌క్ర‌మానికి కేసీఆర్ హాజ‌ర‌వుతున్న విష‌యం కూడా నిర్దార‌ణ కావ‌డం గ‌మ‌నార్హం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్ర‌చారం చేయ‌డం, దానికి బ‌దులుగా రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ కేసీఆర్ ప్ర‌క‌టించ‌డం తెలిసిందే. ఇలాంటి కీల‌క త‌రుణంలో జ‌గ‌న్ గృహ ప్ర‌వేశానికి కేసీఆర్ వ‌స్తుండ‌టం నిజంగానే ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి.

Tags:    

Similar News