కేసీఆర్ కు కోపం వస్తే అలానే చేస్తారా..?

Update: 2015-10-16 05:36 GMT
మిగిలిన ముఖ్యమంత్రులతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఖరి కాస్త భిన్నం. ఆయనేది మనసులో దాచుకోరు. దాచుకోవాలన్న ప్రయత్నం చేయరు. మనసుకు నచ్చినట్లుగా చేస్తారు. మనసులో ఒకటి.. ముఖంలో మరొకటన్న విధానానికి పూర్తి విరుద్ధం. మనసుకు నచ్చని వారు ఎవరైనా సరే.. డోన్ట్ కేర్ అనే వైఖరి తాజాగా రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.

ఆ మధ్యన తనపై అదే పనిగా విమర్శలు చేస్తూ.. నిరసనలు నిర్వహిస్తున్న విపక్షాలు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుసుకొని తమ డిమాండ్లను ఆయన ముందు పెట్టాలని భావించాయి. ఇందుకోసం సీఎం కార్యాలయానికి వచ్చారు. అలా వచ్చిన విపక్ష నేతల్ని కొన్ని గంటలు వెయిట్ చేయించేలా చేసి.. తర్వాత వారికి సమయం ఇవ్వకుండా వెనక్కి పంపించేశారు. ఇలాంటి ఊహించని పరిణామాలకు విపక్ష నేతలు అవాక్కు అయ్యారు.

పవర్ లేని వాళ్లనే కాదు.. పవర్ లో ఉన్న వారి విషయంలోనే కేసీఆర్ ఇలానే వ్యవహరిస్తారని మరోసారి నిరూపితమైంది. కలాం జయంతి సందర్భంగా హైదరాబాద్ కు కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వచ్చారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఇమారత్ కు కేంద్ర రక్షణ మంత్రి అతిధిగా హాజరైతే.. డీఆర్ డీఎల్ సెంటర్ కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు.

నిజానికి ఈ రెండు కేంద్రాల మధ్య దూరం కేవలం 10 కిలోమీటర్లు మాత్రమే. అంతేకాదు.. ఈ రెండు చోట్ల కార్యక్రమాలు ఇంచుమించు ఒకే సమయంలో జరుగుతున్నా.. ముఖ్యమంత్రి కేసీఆర్ తాను పాల్గొవాల్సిన కార్యక్రమంలో పాల్గొని తన దారిన తాను వెళ్లిపోయారు. నిజానికి.. కేంద్రం నుంచి ఎవరైనా అతిధి వస్తే.. వారిని సాదరంగా ఆహ్వానించటం.. లేదంటే గౌరవంగా కలవటం లాంటివి చేస్తుంటారు. కానీ.. అందుకు భిన్నంగా తనకేమీ పట్టనట్లుగా కేసీఆర్ వ్యవహరించటం టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది.

కేంద్ర రక్షణ శాఖా మంత్రి వచ్చిన కేసీఆర్ పట్టనట్లుగా ఎందుకు ఉన్నారన్న దానిపై ఆసక్తికర కారణాన్ని చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ఆ మధ్య వివిధ కార్యక్రమాల్లో భాగంగా రక్షణ శాఖ పరిధిలో ఉన్న భూములు అవసరమయ్యాయి. అవి తమకు ఇవ్వాలని తెలంగాణ సర్కారు కోరింది. అయితే.. తెలంగాణ సర్కారు కోరికను రక్షణ శాఖ తిరస్కరించింది. దీంతో.. అగ్రహం చెందిన కేసీఆర్.. తన కోపాన్ని తాజాగా ప్రదర్శించారని చెబుతున్నారు. తన ఇలాకాకు వచ్చిన కేంద్రమంత్రిని లైట్ తీసుకోవటం చూస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందేనని పొగిడేసే వారు ఉండటం గమనార్హం.
Tags:    

Similar News