కేసీఆర్ అంటే అంతే మ‌రి.. ఇలానే చేస్తారు

Update: 2018-05-09 08:45 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ లో నాట‌కీయ పాళ్లు ఎక్కువ‌. ఎప్పుడేం చేస్తారో.. ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో ఒక ప‌ట్టాన అర్థం కారు. మంత్రుల‌కు సైతం అపాయింట్ మెంట్ దొర‌క‌టం క‌ష్టంగా ఉండే కేసీఆర్‌.. చిన్న‌నాటి స్నేహితుడికి ఇచ్చిన మాట‌ను మాత్రం గుర్తు పెట్టుకుంటారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల‌కు కేసీఆర్ ద‌ర్శ‌న భాగ్యం దొర‌క‌ట‌మే క‌ష్టంగా మారింద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్న వేళ‌.. సామాన్యుల విష‌యంలో ఎంత అస‌మాన్యంగా వ్య‌వ‌హ‌రిస్తారో తెలిసిన‌ప్పుడు ఆశ్చ‌ర్యానికి గురి కాక మాన‌రు.

త‌న చిన్ననాటి స్నేహితుడికి కీల‌క ప‌ద‌విని క‌ట్ట‌బెట్టిన వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. రాజ‌కీయంగా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. పార్టీలో కీల‌క భూమిక పోషించ‌న‌ప్ప‌టికి త‌న స్నేహితుడ‌న్న ట్యాగ్ కార‌ణంగా ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి అప్ప‌గించిన వైనం చూస్తే కేసీఆరా మ‌జాకానా? అనిపించ‌క మాన‌దు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు మెద‌క్ జిల్లా దుబ్బాక మండ‌లం చెల్లాపూర్ గ్రామానికి చెందిన బొమ్మెర వెంక‌టేశం బాల్య మిత్రులు. ఇద్ద‌రు క‌లిసి దుబ్బాక‌లో ఐదో త‌ర‌గ‌తి వ‌ర‌కూ క‌లిసి చ‌దువుకున్నారు. బొమ్మెర చిన్నసైజు వ్యాపారుస్తుడు. కేసీఆర్ ఏ పొజిష‌న్లో ఉన్నా వారిద్ద‌రి మ‌ధ్య రిలేష‌న్ మాత్రం కొన‌సాగుతుండేది.

ఎవ‌రికి ఇవ్వ‌ని స్వేచ్ఛ‌ను బొమ్మెర‌కు ఇచ్చారు కేసీఆర్. అదేమంటే.. త‌న‌ను క‌ల‌వాలంటే ఎవ‌రికి అనుమ‌తి లేకుండా నేరుగా త‌న‌ని క‌లిసేయొచ్చ‌ని. అదే టైంలో ఇక్క‌డ మ‌రో మాట కూడా చెప్పాలి. కేసీఆర్ ఇచ్చిన స్వేచ్ఛ‌ను బొమ్మెర ఎప్పుడూ దుర్వినియోగం చేసింది కూడా లేదు. త‌న‌ను క‌లిసి ప్ర‌తిసారి నీకేమైనా ప‌ద‌వి కావాలిరా అంటూ నో చెప్పేవారు. ఈ మ‌ధ్య‌న త‌న మ‌న‌సులో చిగురించిన  కోరిక‌ను స్నేహితుడికి చెప్పారు. త‌న‌కేదైనా దేవాల‌యంలో డైరెక్ట‌ర్ ప‌ద‌విని ఇప్పిస్తే.. భ‌గ‌వంతుడి సేవ చేసుకుంటాన‌ని చెప్పారు.

స్నేహితుడు నోరు తెరిచి అడిగితే కేసీఆర్ ఊరుకుంటారా?  బాల్య‌మిత్రుడు కోరిన దానికంటే పెద్ద ప‌ద‌వి ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యారు. భూపాల‌ప‌ల్లి జిల్లా మంథ‌ని నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని కాళేశ్వ‌ర ముక్తేశ్వ‌ర స్వామి ఆల‌య ఛైర్మ‌న్ గా నామినేట్ ప‌ద‌విని ఆయ‌న‌కు ద‌క్కేలా చేశారు. ఏదో డైరెక్ట‌ర్ ప‌ద‌వి వ‌స్తుంద‌నుకున్న బొమ్మెర‌కు.. పేప‌ర్లో ఆల‌య ఛైర్మ‌న్ గా ఎంపిక చేసిన‌ట్లు వార్త రావ‌టంతో ఆశ్చ‌ర్య‌పోయారు. త‌న బాల్య‌స్నేహితుడి తీరుకు ఫుల్ హ్యాపీ అయ్యారు. ఛైర్మ‌న్ ప‌ద‌వి త‌న‌కు ద‌క్కుతుంద‌ని తాను అస్స‌లు అనుకోలేద‌ని చెప్పారు. క‌థ అక్క‌డితో అయిపోలేదు. నామినేటెడ్ ప‌ద‌వి పేప‌ర్ వార్త‌గా మిగిలిపోలేదు. త‌న స్నేహితుడికి ఇచ్చిన ప‌ద‌వికి సంబంధించిన నియామ‌క ఉత్త‌ర్వులు మంత్రి హ‌రీశ్ చేత పంపి త‌న స్నేహం విలువ ఎంటో చెప్ప‌క‌నే చెప్పేశారు కేసీఆర్‌. ఇలాంటి నాట‌కీయ ప‌రిణామాలు కేసీఆర్ కు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతాయేమో?
Tags:    

Similar News