కేసీఆర్ బ‌ర్త్ డే హ‌డావుడంతా బీటీ బ్యాచ్ దే

Update: 2018-02-17 04:59 GMT
నిద్ర లేచి పేప‌ర్ చూసినంత‌నే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు బ‌ర్త్ డే విషెస్ చెబుతూ భారీ ఎత్తున టీఆర్ ఎస్ నేత‌లు ప్ర‌క‌ట‌న‌లు అచ్చేయ‌టం క‌నిపించింది. ఇలా ఒక‌టో రెండో కాదు.. దాదాపు అన్ని ప్ర‌ధాన ప‌త్రిక‌ల్లోనూ ఇదే హ‌డావుడి క‌నిపించింది. అదే స‌మ‌యంలో ప్ర‌ముఖ ఇంగ్లిష్ దిన‌ప‌త్రిక‌ల్లో ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు అస్స‌లు క‌నిపించ‌లేదు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ప‌త్రిక‌ల్లో భారీ ఎత్తున ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చిన గులాబీ నేత‌ల్ని గ‌మ‌నించారా?

పేప‌ర్ల‌లో పెద్ద ఎత్తున బ‌ర్త్ డే విషెస్  ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చిన వారిలో అత్య‌ధికులు బీటీ బ్యాచ్ నేత‌లే కావ‌టం గ‌మ‌నార్హం. బీటీ బ్యాచ్ ఏమిటంటారా?  నిజ‌మే బీటీ బ్యాచ్ ప‌దాన్ని వాడి చాలా కాల‌మే అయిందిగా అందుకే మ‌ర్చిపోయి ఉండొచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ విజ‌యం సాధించి.. సీఎంగా కేసీఆర్ కుర్చీలో కుదురుగా కూర్చున్నాక‌.. తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ పొంగుకు రావ‌ట‌మే కాదు.. కేసీఆర్ నేతృత్వంలో బంగారు తెలంగాణ సాధ‌న కోసం అహ‌ర‌హం శ్ర‌మించేందుకు క్యూ క‌ట్టిన నేత‌ల్ని ముద్దుగా బంగారుతెలంగాణ బ్యాచ్ నేత‌లుగా అభివ‌ర్ణిస్తారు.

ప‌వ‌ర్ చేతిలో లేన‌ప్పుడు.. ఉద్య‌మంలో ఉన్న‌ప్పుడు ప‌ట్ట‌ని ఈ నేత‌లంతా ప‌వ‌ర్ చేతిలోకి వ‌చ్చినంత‌నే వాలిపోవ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఎన్నిక‌ల‌కు ఏడాది మాత్ర‌మే టైం ఉండ‌టం.. వ‌చ్చే బ‌ర్త్ డే నాటికి ఎన్నిక‌ల వేడితో వాతావ‌ర‌ణం హాట్ హాట్ గా మారిపోయే వేళ‌లో.. ముంద‌స్తుగా బ‌ర్త్ డే విషెస్ ను భారీగా చెప్ప‌టం ద్వారా అధినేత‌కు కాకున్నా.. ఆయ‌న కుటుంబ స‌భ్యుల దృష్టిలో అయినా ప‌డాల‌న్న‌ట్లుగా ప్ర‌క‌ట‌న‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం. గ‌తంలో ఎప్పుడూ లేని రీతిలో ఈసారి కేసీఆర్ మేన‌ల్లుడు.. త్వ‌ర‌లో రాజ్య‌స‌భ‌కు వెళ‌తార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న సంతోష్ ఫోటోను సార్ బ‌ర్త్ డే విషెస్ పోస్ట‌ర్ల‌లో వేయ‌టం క‌నిపిస్తోంది. ఏమైనా.. బీటీ బ్యాచ్ హ‌డావుడి ముందు మొద‌ట్నించి టీఆర్ ఎస్ లో ఉన్న నేత‌లు తేలిపోయార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News