పాత పాటే పడిన కేసీఆర్

Update: 2015-09-30 10:34 GMT
రైతు ఆత్మహత్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాత పాటే పాడారు. నెపాన్ని ఎప్పట్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నాయకుల మీద వేసేసి ఎంచక్కా తప్పుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అవలంబించిన విధానాల కారణంగానే ఇప్పుడు ఇబ్బందులు పడాల్సి వస్తోందని కూడా వ్యాఖ్యానించారు.

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అవుతోంది. అయినా కేసీఆర్ కు ఇది చాలా తక్కువ సమయమట. ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు సంబంధించిన పాపమంతా గత ప్రభుత్వాలదేనని చెప్పేందుకు కేసీఆర్ శతథా ప్రయత్నించారు. మళ్లీ నీళ్లు, నిధులు, నియామకాల పాటను తెరపైకి తెచ్చారు. సాగునీటి ప్రాజెక్టులను ప్రస్తావించారు. ఒక్క మాటలో చెప్పాలంటే గత 12 ఏళ్ల ఉద్యమ కాలంలో, గత ఏడాదిన్నరగా చెబుతున్న మాటలనే అసెంబ్లీలో మరోసారి వల్లె వేశారు. అంతే తప్పితే ప్రతిపక్షాల విమర్శలకు ఒక్క జవాబు కూడా చెప్పలేదు.

రైతు ఆత్మహత్యలకు ఒక కారణం రుణ మాఫీ విడతలవారీ అమలు అని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. దాంతో, ఒకేసారి అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. విద్యుత్తు సమస్యపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించినా దాని గురించి మాట్లాడలేదు. ఎందుకంటే, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి పూర్తిస్థాయిలో కరెంటు కోత కోసి దానిని కాస్తా హైదరాబాద్ లో నిరంతరాయంగా కరెంటు ఇచ్చారు. హైదరాబాద్ కోసం రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ప్రతిపక్షాలు విమర్శించినా దాని గురించి మాట్లాడలేదు. కరువు మండలాల ప్రకటనలో స్పందించడంలో జాప్యం చేసినా.. అదో వృథా ప్రయాస అని, కరువు మండలాల నివేదిక ఇస్తే కేంద్రం ఎప్పుడో ప్రతినిధులను పంపుతుందని, అదొక వేస్ట్ ప్ర్రక్రియ అని తేల్చేశారు. మొత్తం తప్పంతా ఇప్పటికీ సీమాంధ్ర పాలకులదేనని మరోసారి కేసీఆర్ పునరుద్ఘాటించారు.


Tags:    

Similar News