కేసీఆర్ వరాల జల్లు

Update: 2018-09-02 12:01 GMT
అనుకున్నదే. ఊహించినదే. ప్రగతి నివేదనకు ముందు జరిగిన క్యాబినెట‌ భేటీలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్ని వర్గాలకు వరాల జల్లు కురిపించారు. ప్రగతి నివేదన సభకు ముందు దాదాపు రెండు గంటలకు పైనే జరిగిన తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అర్చకుల ఉద్యోగ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచింది తెలంగాణ ప్రభుత్వం. దీని ద్వారా అగ్రవర్ణాలలో కీలకమైన బ్రాహ్మణుల మద్దతు కూడగట్టుకోవాలన్నది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖ‌ర రావు ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. ఇక వివిధ స్ధాయిల్లో ఉద్యోగుల వేతనాలను కూడా పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందులో గోపాలమిత్రులు - ఆశావర్కర్లు - కాంట్రాక్ట్ డాక్టర్లు ఉన్నారు. వీరంతా గత కొంతకాలంగా తమ వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే గడచిన నాలుగేళ్లుగా ఈ డిమాండ్లను పట్టించుకోని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముందస్తు ఎన్నికలకు వెళ్తారని అందరూ భావిస్తున్న సమయంలో వీరి వేతనాలు పెంచడం గమనార్హం.  గోపాలమిత్ర ఉద్యోగులకు ఇక నుంచి 8500 వేతనం అందుతుంది. ఈ మేరకు క్యాబినెట‌్‌ లో నిర్ణయాలు తీసుకున్నారు.

ఇక తెలంగాణాలో బీసీల ఓట్లను కొల్లగొట్టేందుకు బిసీ కులాల్లో 50 శాతం వారికి ఆత్మగౌరవ భవనాల నిర్మాణాల కోసం ఏకంగా 71 ఎకరాలు కేటాయించనున్నారు. ఇందుకోసం 68 కోట్ల రూపాయలు కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయించింది.  ఈ నిర్ణయంతో దాదాపు 30 బీసీ కులాల వారికి స్వంత భవనాల ఏర్పాటు జరుగుతుంది. ఇక ఆశా వర్కర్ల వేతనాలను కూడా 7500 రూపాయలకు పెంచాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ క్యాబినెట్. ఇప్పటి వరకూ కాంట్రాక్లు డాక్టర్లకు ఇస్తున్న జీతాలను కూడా భారీగా పెంచారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు. వారికి ఇక నుంచి నెలకు 40 వేల రూపాయల జీతం అందనుంది. ఈ నిర్ణయం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా దాదాపు నలభై వేల మంది డాక్టర్లకు ప్రయోజనం చేకూరుతుందని అంటున్నారు.  ఆశా వర్కర్ల వేతనాలు కూడా 7500 రూపాయల వరకూ పెంచారు. వీరి వేతనాలు పెంచాలని గత కొంతకాలంగా ఆశా ఉద్యోగాల నుంచి డిమాండ్ వప్తోంది. ఇన్నాళ్లూ వారి గురించి పట్టించుకోని తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పుడు ఎన్నికల ముందు వారి వేతనాలు పెంచాలని నిర్ణయించారు. ఇది తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఆశావర్కర్లకు కలిసి వచ్చే అంశం. ఇలా ఎన్నికలకు ముందు అన్ని వర్గాల వారిని ప్రసన్నం చేసుకుందుకు తెలంగాణ ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపిస్తున్నారు. మళ్లీ ఈ నెల ఐదున కాని, ఆరో తేదిన కాని మరోసారి తెలంగాణ మంత్రివర్గం సమావేశం అవుతుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. అంటే మరికొన్ని వర్గాలకు మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉందన్నది స్పష్టమవుతోంది.

Tags:    

Similar News