ఎన్నాళ్లకు... కరోనాపై కేసీఆర్ సమీక్ష !

Update: 2020-07-17 14:30 GMT
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండడంతో ప్రజల్లో కలవరం మొదలైంది. ముఖ్యంగా జీహెచ్ ఎంసీ పరిధిలో కరోనా విలయతాండవం చేయడంతో భాగ్య నగర వాసులు బెంబేలెత్తుతున్నారు. ఓ వైపు ప్రభుత్వ ఆసుత్రుల్లో కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతుండగా... మరోవైపు లక్షలు కుమ్మరించినా ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్లు దొరుకుతాయని గ్యారెంటీలేని పరిస్థితి. ఇక, కరోనా టెస్టుల సంఖ్య మరింత పెంచాలని, ఇటువంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ కనబడకుండా పోయారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక, సోషల్ మీడియాలో అయితే వేర్ ఈజ్ కేసీఆర్ అంటూ హ్యాష్ ట్యాగ్ నడిచింది. ఇటువంటి నేపథ్యంలో రెండు వారాల అనంతరం ప్రగతి భవన్ కు చేరుకున్న కేసీఆర్....ఇప్పటి వరకు వ్యవసాయం... ఇతరత్రా అంశాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించారు.

అయితే, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ...సీఎం కేసీఆర్ ఆ అంశంపై సమీక్ష నిర్వహించకపోవడంపై విపక్షాలు మరోసారి విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రగతి భవన్ లో కరోనా బాధితులకు మెరుగైన చికిత్స, కరోనాను పకడ్బందీగా కట్టడి చేయడం ఎలా అనే అంశాలపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. హోం ఐసోలేషన్లో ఉన్న బాధితులకు అందుతున్న చికిత్సతో పాటు కరోనాను కట్టడి చేసేందుకు మరిన్ని చర్యలు చేపట్టడంపై కేసీఆర్ సమీక్షించారు. ఈ భేటీలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

జూన్ 28వ తేదీన కరోనాపై రివ్యూ చేసిన కేసీఆర్....ప్రగతి భవన్ లో కరోనా కేసులు పెరగడంతో ఫామ్ హౌస్ కు వెళ్లారు. మళ్లీ లాక్ డౌన్ పెట్టే ఆలోచన ఉందని ఆ రోజు ప్రకటించిన కేసీఆర్....అప్పటి నుంచి నేటి వరకు కరోనాపై సమీక్ష నిర్వహించలేదు. 2 వారాల తర్వాత జులై 11న ప్రగతి భవన్ కు చేరుకున్న కేసీఆర్....రైతుల సమస్యలు, సాగునీరు, విద్యావిధానం తదితర అంశాలపై సమీక్షలు నిర్వహించారు. కానీ, కరోనాపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించకపోవడంతో.... కరోనాను కేసీఆర్ పట్టించుకోవడం లేదని బీజేపీ నేతలు విమర్శించారు.

దీంతోపాటు ఉస్మానియాలోకి వర్షపు నీరు, మురుగు నీరు వచ్చి చేరడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కరోనాపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. 2 లక్షల యాంటీజెన్ కిట్లను తెప్పించిన తెలంగాణ ప్రభుత్వం...టెస్టుల సంఖ్యను మరింత పెంచిందని సమీక్షలో అధికారులు వెల్లడించారు. కరోనా కేసుల కట్టడి కోసం మంత్రులతో కమిటీని ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే, కరోనాపై సమీక్ష తర్వాత..ఆ భేటీలో వివరాలు...కమిటీపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశముంది. ఒకవేళ విపక్షాల విమర్శలకు చెక్ పెట్టేందుకు కేసీఆర్ నేరుగా సమీక్షా సమావేశం అనంతరం మీడియా ముందుకు వచ్చే అవకాశం కూడా ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News