ఎవరు చెప్పారండి.. కరీంనగర్ ను డల్లాస్ చేస్తామని?

Update: 2021-10-08 05:17 GMT
హామీలు ఇవ్వటం.. ఆ తర్వాత ఆ మాటల్ని వెనక్కి తీసుకోవటం కొందరు అధినేతలు చేస్తుంటారు. మరికొందరు ఇచ్చే హామీల్ని ఇచ్చేసి.. ఆ తర్వాత వాటి గురించి ప్రస్తావనే తీసుకురారు. ఈ రెండు విధానాలకు భిన్నం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు. ఆయన ఏదైనా విషయం మీద ఒకసారి డిసైడ్ అయితే.. వెనుకా ముందు చూసుకోకకుండా మాట్లాడేయటం.. ఏం జరిగితే అది జరిగిందన్నట్లుగా ఉండటం అందరికి సాధ్యమయ్యే పని కాదు.
ఒక మాట అని.. ఆ మాటను అనలేదని చెబితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి వాటికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పంచ్ లు వేయటమే కాదు.. ఇమేజ్ డ్యామేజ్ భారీగా జరుగుతుంది. అయినప్పటికీ.. ఇలాంటి వాటిని ఫేస్ చేద్దామన్నట్లుగా కేసీఆర్ మాటలు ఉంటాయి. ఆ మాటకు వస్తే.. కొన్నిసందర్భాల్లో కేసీఆర్ నోటి నుంచి వచ్చే మాటల్ని చూసినప్పుడు.. నిజంగానే.. ఆయన అనలేదేమో? అన్నట్లుగా ఉంటుంది.

తాజాగా ఆ తరహానే ప్రదర్శించారు కేసీఆర్. కరీంనగర్ ను డల్లాస్ చేస్తానని కేసీఆర్ వ్యాఖ్యానించారన్న మాటను ఆయన కొట్టేశారు. తానెప్పుడూ కరీంనగర్ ను డల్లాస్ గా చేస్తామని చెప్పలేదని.. ఈ విషయంలో కావాలనే కొందరు వక్రీకరిస్తున్నారన్నారు. కరీంనగర్ లో ఎల్ఎండీ దిగువన మానేరు నదిపై రూ.336 కోట్లతో రోప్ వే బ్రిడ్జి నిర్మాణం చివరి దశలో ఉందని.. అది పూర్తి అయితే అక్కడి వాతావరణం లండన్ లోని థేమ్స్ నది మాదిరి మారుతుందన్నారు.

కరీంనగర్ ను డ్లలాస్ చేస్తామనలేదన్న ఆయన.. పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తామన్న మాట విషయంలో మాత్రం.. పాత స్టాండ్ నే ప్రస్తావించారు. ‘బరాబర్ పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తాం. హైదరాబాద్ నాలాల్ని గతంలో ధ్వంసం చేశారు. వాటిని పునరుద్ధరించేందుకు డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి రూ.15 వేల కోట్లు అవుతాయని అధికారులు అంచనా వేశారు. దశల వారీగా ఈ నిధుల్ని విడుదల చేస్తాం’ అని వ్యాఖ్యానించారు. ఫర్లేదు.. కరీంనగర్ విషయంలో యూటర్న్ తీసుకున్నా.. పాతబస్తీ విషయంలో మాత్రం అన్న మాటను మర్చిపోలేదు. అదే సంతోషం అనుకోవాలేమో?




Tags:    

Similar News