టీడీపీని తెలివిగా తిట్టిన కేసీఆర్

Update: 2016-01-28 10:18 GMT
చంద్రబాబుతో దోస్తీ తరువాత కేసీఆర్ కాస్త మారినట్లుగా కనిపించారు. కానీ.. ఎన్నికల అవసరం ఆయన్ను మళ్లీ తనలోని దూకుడు చూపించాల్సిన సమయం తెచ్చింది. అయితే... స్నేహం పోకుండా జాగ్రత్తగా తిట్టాలి కాబట్టి కేసీఆర్ అంతే జాగ్రత్తగా టీడీపీని తిట్టారు. టీడీపీ పేరు పలక్కుండా తిట్టడంతో కాంగ్రెస్ ను కనికరించి ఆ పార్టీనీ పరోక్షంగానే వేసుకున్నారు. తెలంగాణలో తమ ప్రభుత్వాన్ని ఉడుకు నెత్తురు ఉన్న కోడె దూడగా పోల్చుకుని... గ్రేటర్ లో గెలవాలని తపిస్తున్న ఇతర పార్టీలను దున్నపోతులతో పోల్చారు.

ఒక పక్క కోడెదూడను రెండోవైపు దున్నపోతును కట్టేసి బండి నడిపించాలంటే కుదరదని తెలంగాణ సీఎం కేసీఆర్ అంటున్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సరైన వాళ్లకు ఓటేస్తే సరైన ఫలితాలు వస్తాయని చెప్పడానికే తాను ఈ మాటలను చెప్పానంటూ వివరించకుండానే అర్థమయ్యేలా తెలివిగా మాట్లాడారు. జంటనగరాల ప్రజలు బాగా ఆలోచించుకుని ఓటేయాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ - టీడీపీల హయాంలోనే భూకబ్జాలు, ఇతర దారుణాలు జరిగాయని.. మూసీ నదిని మురికి కూపంగా మర్చిన ఘనత కూడా ఆ పార్టీలదేనని ఆయన మండిపడ్డారు. ఇప్పుడా పార్టీలు ఓట్ల కోసం వస్తున్నాయని... ఎవరికి ఓటేయాలో మీరే తేల్చుకోవాలని అన్నారు.

  మామూలుగా అయితే చంద్రబాబును ఒక రేంజిలో దులిపేయాల్సిన కేసీఆర్ మారిన పరిస్థితుల్లో చంద్రబాబు పేరు ఎత్తకుండానే మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం పైనా ప్రత్యక్షంగా పెద్దగా ఏమీ అనలేదు. గత ప్రభుత్వాలు అంటూనే ఆయన మొత్తంగా మాట్లాడారు.
Tags:    

Similar News