మితంగా ఉంటేనే బాగుంటుంది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే కొత్త తలనొప్పులు తప్పవు. కొన్నిసార్లు ఉత్సాహం కాస్తా అత్యుత్సాహంగా మారే వైనం తెలిసిందే. ఇలాంటి సందర్భాల్లో లాభం తర్వాత.. నష్టం ఎక్కువగా జరుగుతుంది. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతిని ఈ రోజు నుంచి ఏడాది పాటు అంగరంగ వైభవంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ డిసైడ్ కావటం తెలిసిందే.
ప్రతి విషయాన్ని రంధ్రాన్వేషణ చేయటమే తప్పించి.. సరిగా ఆలోచించరా? అని మండిపడే వారు కొందరుంటారు. కానీ.. ఇప్పుడు జరుగుతున్నదంతా చూస్తే.. పీవీ మాష్టారి మీద అమితమైన ప్రేమాభిమానాలు.. ఆయనకు భారతరత్నఇవ్వాలన్న డిమాండ్లతో పాటు.. దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ హోర్డింగులు.. యాభై దేశాల్లో కార్యక్రమాల నిర్వహణ చూస్తే.. పీవీ మీద ప్రేమతోనే ఇదంతా జరుగుతుందనుకుంటే తప్పులో కాలేసినట్లే.
తాజాగా సాగుతున్న ప్రచారం చూసినప్పుడు.. వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగుల్లో భాగమే పీవీ శతజయంతి అని చెప్పకతప్పదు. తాజాగా టీఆర్ఎస్ అధికారిక మీడియాలో పీవీ.. కేసీఆర్ ఇద్దరూఇద్దరే అంటూ భారీ కథనాన్ని అందించారు. అటు ఇటుగా పీవీతో కేసీఆర్ ను పోల్చటం.. ఆయనలోని సుగుణాలు.. కేసీఆర్ లోనూ కనిపిస్తాయన్న బోధ చూస్తుంటే.. సారు ఇమేజ్ బిల్డింగ్ ను మరో స్థాయికి తీసుకెళ్లే కొత్త కార్యాచరణ అన్న సందేహం కలుగక మానదు.
ఇద్దరిలోని గుణాల్ని పోలిస్తూ.. ఇద్దరూ దేశ చరిత్రను మలుపు తిప్పిన నాయకులు.. ఇద్దరూ గ్రామీణ భూస్వామ్య కుటుంబాల నేపథ్యంలో పుట్టి.. ఉద్యమాల వైపు రావటమే కాదు.. నాయకత్వం వహించారన్న మాటలు చూస్తే.. విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఎవరు ఎవరితోనైనా పోలిక పెట్టుకోవచ్చు. అదేం తప్పు కూడా కాదు. కానీ.. అదంతా కావాలని చేస్తున్నట్లుగా ఉండకూడదు. కేసీఆర్ లో పీవీ ప్రజలకు కనిపించాలే కానీ.. తమ వారు చేసే వ్యాఖ్యల్లో కాదన్నది మర్చిపోకూడదు.