కేసీఆర్ ముందుచూపు ఎంత ఎక్కువంటే?

Update: 2018-03-24 05:26 GMT
రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఆరు స్థానాల్లో మూడు టీఆర్ఎస్ ఖాతాలోకి వెళితే.. రెండు టీడీపీ.. ఒక‌టి వైఎస్సార్ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ‌ర‌కూ వ‌స్తే.. త‌మ‌కున్న బ‌లానికి త‌గ్గ‌ట్లే అభ్య‌ర్థుల్ని నిలిపిన అధికార‌..విప‌క్షం తీరుతో ఎన్నిక ఏక‌గ్రీవ‌మైంది.

తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. త‌మ‌కు బ‌లం లేకున్నా కాంగ్రెస్ త‌మ అభ్య‌ర్థిని బ‌రిలోకి దింపింది. ఇదిలా ఉంటే.. త‌మ పార్టీలోకి జంపింగ్స్ అండ‌తో మూడోస్థానానికి అభ్య‌ర్థిని ప్ర‌క‌టించింది. నైతికంగా చూస్తే టీఆర్ఎస్ త‌న అభ్య‌ర్థిని బ‌రిలోకి దింప‌కూడ‌ని స్థితి. అదే స‌మ‌యంలో సాంకేతికంగా చూస్తే.. టీఆర్ఎస్ కు మూడో అభ్య‌ర్థిని గెలిపించుకునే అవ‌కాశాలు పూర్తిగా ఉన్నాయి.

ఇవాల్టి దూకుడు రాజ‌కీయాల్లో నైతిక‌త అన్న‌ది పెద్ద బూతుగా మారిపోయిన నేప‌థ్యంలో దాని గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిదిగా మారింది. గెలుపు లెక్క‌ల్ని ప‌క్క‌న పెడితే.. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు చూసిన‌ప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి సునిశిత దృష్టికి.. ఆయ‌న ముందుచూపును.. చిన్న విష‌యాల్ని సైతం ఆయ‌న ఎంత లోతుగా ఆలోచిస్తార‌న్న విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంది.

ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డైన త‌ర్వాత విజ‌యం సాధించిన అభ్య‌ర్థుల‌కు వ‌చ్చిన ఓట్ల‌ను చూసిన‌ప్పుడు కాసింత ఆశ్చ‌ర్యపోయినోళ్లు ఉన్నారు. ఎందుకంటే.. త‌న‌కు బంధువైన సంతోష్ కు 32 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చేలా చేసిన కేసీఆర్.. అదే స‌మ‌యంలో బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చెందిన బండ ప్ర‌కాశ్ కు మాత్రం 33 ఓట్లు వ‌చ్చేలా చేశారు. ఇక‌.. మ‌రో అభ్య‌ర్థి బ‌డుగుల లింగ‌య్య‌కు 32 ఓట్లు వ‌చ్చేలా సెట్ చేశారు.

బ‌రిలో ఉన్న ముగ్గురు అభ్య‌ర్థుల్ని గెలిపించుకునేందుకు పూర్తిస్థాయి బ‌లం ఉన్న టీఆర్ఎస్‌.. ముందుగానే ఎవ‌రి ఓటు ఎవ‌రికి వేయాల‌న్న విష‌యంపై శిక్ష‌ణ ఇచ్చింది. కొంతమంది ఎమ్మెల్యేల‌ను జ‌ట్టుగా చేసి.. వారిని ఫ‌లానా అభ్య‌ర్థికి ఓటు వేయాల‌న్న స్ప‌ష్ట‌మైన ఆదేశాన్ని ముందే ఇచ్చారు. ఈ లెక్క‌న చూసిన‌ప్పుడు త‌న బంధువుకు ఎక్కువ ఓట్లు రాకుండా జాగ్ర‌త్త తీసుకోవ‌టం ద్వారా.. బంధువు కంటే కూడా త‌న‌కు బ‌డుగుజీవులే ఎక్కువ మ‌క్కువ అన్న‌ట్లు కేసీఆర్ వ్య‌వ‌హ‌రించార‌ని చెప్పాలి.

ఇంత సూక్ష్మ‌మైన విష‌యాన్ని ఎవ‌రైనా ప‌ట్టించుకుంటారా? అంటే.. క‌చ్ఛితంగా అని చెప్ప‌క త‌ప్ప‌దు. అదే సంతోష్ కు 33 ఓట్లు వ‌చ్చి.. మిగిలిన అభ్య‌ర్థులకు 32 చొప్పున ఓట్లు వ‌స్తే.. అంద‌రి దృష్టి దాని మీదే ప‌డేది. అంతేనా.. విప‌క్షం ఆ విష‌యాన్ని పెద్ద‌ది చేసి ర‌చ్చ చేసేది. అందుకే.. అలాంటి విమ‌ర్శ‌ల‌కు తావివ్వ‌కుండా కేసీఆర్ జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌ని చెప్పాలి. రాజ‌కీయాల్లో ప్ర‌తి అడుగు ఆచితూచి వేయ‌ట‌మే కాదు.. ప‌క్కా వ్యూహం ఉండాల‌న్న‌ది కేసీఆర్ తీరు చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్పాలి.
Tags:    

Similar News