సినారెకు కేసీఆర్ మార్క్ నివాళి

Update: 2017-06-13 09:51 GMT
తెలంగాణ‌రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరు చాలా చాలా భిన్నం. ఆయ‌న ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో ఒక ప‌ట్టాన అంచ‌నా వేయ‌టం చాలా క‌ష్టం. ఎవ‌రి విష‌యంలో ఆయ‌న ఎలా స్పందిస్తారో అస్స‌లు చెప్ప‌లేరన్న మాట ప‌లువురి నోట వినిపిస్తుంటుంది. తాజాగా చోటు చేసుకున్న సంఘ‌ట‌న‌ను చూస్తే అదెంత నిజ‌మో ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

గుండెపోటుతో సోమ‌వారం ఉద‌యం క‌న్నుమూసిన సాహితీశిఖ‌రం  సి.నారాయ‌ణ‌రెడ్డికి నివాళులు అర్పించేందుకు తెలంగాణ‌రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఆయ‌న ఇంటికి వెళ్లారు. సినారె పార్ధిప‌దేహానికి పుష్పాంజ‌లి ఘ‌టించారు. అనంత‌రం సినారె గ‌దిని ప‌రిశీలించారు. ఆపై మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. సినారెకు ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో అంతిమ సంస్కారం చేయించ‌నున్న‌ట్లుగా వెల్ల‌డించారు. సినారెను చూసేందుకు రావాల‌నుకునే వారి కోసం ప్ర‌త్యేకంగా వంద బ‌స్సుల్ని ఏర్పాటు చేస్తామ‌ని.. వారంతా వ‌చ్చి భ‌ద్రంగా త‌మ స్వ‌స్థలాల‌కు వెళ్లొచ్చ‌ని చెప్పారు. క‌వుల‌కు గ్లామ‌ర్‌ తెచ్చిన మ‌హానుభావుడు సినారె అన్న ఆయ‌న తెలుగు ప్ర‌జ‌లు గ‌ర్వంతో చెప్పుకునే వ్య‌క్తిగా అభివ‌ర్ణించారు.

ఆది.. అంత్య‌ప్రాస‌ల‌కు అద్భుత‌మైన న‌డ‌క నేర్పిన మ‌హాక‌వి ఆత్మ‌కు భ‌గ‌వంతుడు శాంతిని చేకూర్చాల‌న్నారు. సాహిత్య రంగానికి విశేష సేవ‌లు అందించిన సినారె సంస్మ‌ర‌నార్థం తెలంగాణ‌లోని ఒక సంస్థ‌కు ఆయ‌న పేరును పెట్ట‌నున్న‌ట్లుగా వెల్ల‌డించారు. హైద‌రాబాద్ లో స్థ‌లం కేటాయించి సినారెపేరిట ఒక స్మార‌క భ‌వ‌నాన్ని.. స‌మావేశ మందిరాన్ని ఏర్పాటు చేయించ‌నున్న‌ట్లుగా చెప్పారు. హైద‌రాబాద్‌ లోనూ ఆయ‌న పుట్టిన క‌రీంన‌గ‌ర్‌.. సిరిసిల్లా జిల్లాలోనూ.. ఆయ‌న స్వ‌గ్రామంలోనూ విగ్ర‌హాల్ని ఆవిష్క‌రిస్తామ‌న్నారు. తెలంగాణ‌లోని ఒక వ‌ర్సిటీకి సినారెకు పేరు పెడ‌తామ‌ని చెప్పారు. హైద‌రాబాద్ న‌డిబొడ్డున మ్యూజియం ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక‌.. ప్ర‌ముఖులు ప‌లువురు మ‌ర‌ణించినా.. ఇప్ప‌టివ‌ర‌కూ మ‌రే ప్ర‌ముఖుడి నివాళి సంద‌ర్భంగా కేసీఆర్ ఇన్నేసి హామీలు ఇవ్వ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News