ఎంపీ అభ్య‌ర్థుల‌కు ఇంట‌ర్వ్యూలు చేస్తున్న కేసీఆర్‌

Update: 2019-03-04 05:02 GMT
రాజ‌కీయ వ్యూహాల్ని సిద్ధం చేయ‌టం కానీ.. వాటిని అమ‌లు చేసే విష‌యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎంత నేర్పుగా వ్య‌వ‌హ‌రిస్తారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఆయ‌న‌లో ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమంటే.. ఒక అంశం మీద దృష్టి పెట్టిన‌ప్పుడు దాని మీద‌నే మొత్తం ఫోక‌స్ పెడుతుంటారు. అంతేకానీ.. రోజుకు నాలుగు అంశాల మీద దృష్టి సారించ‌టం..దేనిని పూర్తిస్థాయిలో పూర్తి చేయ‌క‌పోవ‌టం లాంటివి అస్స‌లు ఉండ‌దు.

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసి ప్ర‌భుత్వం ఏర్ప‌డి నెల‌లు కావొస్తున్నా.. ఇప్ప‌టివ‌ర‌కూ పాల‌న మీద కేసీఆర్ పెద్ద‌గా దృష్టి సారించ‌లేద‌న్న మాట ఉంది. ఇప్పుడు ఆయ‌న దృష్టి అంతా త్వ‌ర‌లో జ‌రిగే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో 16 ఎంపీ స్థానాల్ని సొంతం చేసుకోవ‌టం.. రెండోది.. ఏపీ ఎన్నిక‌ల్లో ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు దిమ్మ తిరిగేలా షాకివ్వ‌టం.. మ‌ర్చిపోలేని రిట‌ర్న్ గిఫ్ట్ ఇవ్వట‌మే ల‌క్ష్య‌మ‌న్న‌ట్లుగా చెబుతున్నారు.

ఈ క్ర‌మంలో పాల‌న‌ను అస్స‌లు ప‌ట్టించుకోవ‌టం లేద‌న్న‌విమ‌ర్శ ఉంది. అయితే.. అలాంటి వాటిని పెద్ద‌గా లెక్క చేయ‌ని ఆయ‌న‌.. ఈ మ‌ధ్య‌న మాట్లాడుతూ.. ఎంపీ ఎన్నిక‌లు.. ఆ త‌ర్వాత మున్సిప‌ల్ ఎన్నిక‌ల వ‌ర‌కూ పాల‌న మీద పెద్ద‌గా దృష్టి పెట్ట‌లేమ‌న్న అంశాన్ని త‌న‌దైన శైలిలో చెప్పేశారు.

తాజాగా లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌ఫున పోటీ చేయాల‌న్న ఉత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించే వారితోపాటు.. సిట్టింగులతోనూ కేసీఆర్ ప్ర‌త్యేకంగా భేటీ అవుతున్న‌ట్లుగా చెబుతున్నారు. పార్టీ టికెట్ ఆశిస్తున్న వారిని ఇప్ప‌టికే షార్ట్ లిస్ట్ చేసుకున్న కేసీఆర్‌.. ఇప్పుడు వ‌రుస పెట్టి వారంద‌రిని ఇంట‌ర్వ్యూలు చేయ‌నున్నారు. ఇందులో భాగంగా తొలి అవ‌కాశం మెద‌క్ ఎంపీస్థానాన్ని ఆశిస్తున్న కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డిని వ‌రించిన‌ట్లుగా  చెబుతారు.

ప్ర‌త్యేకంగా త‌న వ‌ద్ద‌కు పిలిపించుకున్న కేసీఆర్‌.. ఆయ‌న్ను కాసేపు ఇంట‌ర్వ్యూ చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ప‌లు అంశాల‌పై కొత్త ప్ర‌భాక‌ర్ ఆలోచ‌న‌లు ఏ విధంగా ఉన్నాయ‌న్న విష‌యంతో పాటు.. ఎన్నిక‌ల్లో టికెట్ ల‌భిస్తే ఏం చేయ‌నున్నారు?  అన్న విష‌యాల మీద కూడా ప్ర‌శ్న‌లు ఎదుర్కొన్న‌ట్లు చెబుతున్నారు. ఆయ‌న‌తో పాటు.. జ‌హీరాబాద్ ఎంపీ స్థానానికి టికెట్ ఆశిస్తున్న బీబీ పాటిల్.. భువ‌న‌గిరి ఎంపీ బూర న‌ర్స‌య్య‌గౌడ్ తోనూ కేసీఆర్ భేటీ జ‌రిపిన‌ట్లుగా తెలుస్తోంది. ఎన్నిక‌ల సంద‌ర్భంగా అనుస‌రించే వ్యూహాలు.. పార్టీ టికెట్ ఇస్తే ఏం చేస్తారు?  గెలుపు మంత్రం ఏమిట‌న్న విష‌యంపై కేసీఆర్ ప‌లు ప్ర‌శ్న‌లు వేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ముగ్గురు నేత‌ల‌కు పిలుపు రాగా.. ఈ ముగ్గురికి ఒకేలాంటి ప్ర‌శ్న‌లు వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఇదే తీరులో ఇంట‌ర్వ్యూలు చేప‌ట్ట‌నున్న‌ట్లు చెబుతున్నారు. కేసీఆర్ నుంచి ఇంట‌ర్వ్యూ కోసం ఫోన్ కాల్ వ‌స్తే.. దాదాపుగా టికెట్ క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్లేన‌న్న మాట టీఆర్ఎస్ నేత‌ల్లో వినిపిస్తోంది. మ‌రేం చేస్తారో.. అభ్య‌ర్థుల ఎంపిక ప్ర‌క‌ట‌న‌ చూస్తే కానీ అర్థం కాని ప‌రిస్థితి.
Tags:    

Similar News