కేసీఆర్ పెద్ద టెన్ష‌న్ త‌ప్పించాడు

Update: 2017-03-26 06:09 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ ద‌ళ‌ప‌తి కే చంద్రశేఖర్‌ రావు పెద్ద రిలీఫ్ ఇచ్చారు. ఎవ‌రికి ఇచ్చారు? ఎలా ఇచ్చారు? త‌ద్వారా మ‌న‌కు క‌లిగే లాభం ఏంటి అని ఆలోచించకండి. మ‌న‌కు కాదు. సొంత పార్టీ ఎమ్మెల్యేల‌కు. ఎలా అంటే....గ‌త కొద్ది కాలంగా టీఆర్ఎస్‌లో జోరుగా ఓ చ‌ర్చ‌ వినిపిస్తోంది. అదేంటంటే... ప్ర‌స్తుతం టీఆర్ ఎస్ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా ఉన్న వారిలో కొంద‌రి ప‌ట్ల‌ కేసీఆర్ చాలా అసంతృప్తిగా ఉన్నారు. అందులో చాలా మందికి రాబోయే ఎన్నిక‌ల్లో చాన్స్ ఇవ్వ‌రూ అని! అయితే ఈ విష‌యంలో కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. ప్రగతిభవన్‌ లో మంత్రులు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌ లందరికీ మళ్లీ టికెట్లు ఇస్తామని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందవలిసిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇటీవ‌ల నిర్వ‌హించిన సర్వేల్లో ఎవరైనా వెనుకబడి ఉన్నంత మాత్రాన భయపడాల్సిందేమీ లేదని, ప్రజలతో మమేకమై, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను అందిస్తే వారే అక్కున చేర్చుకుంటారని కేసీఆర్ భ‌రోసా ఇచ్చారు. ప్రజల్లోకి వెళ్లి పనిచేయాలని, వారితో మరింతగా మమేకం కావాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ సంవత్సరం డబుల్‌బెడ్‌రూం ఇండ్లు, మిషన్ భగీరథ పథకాలను కీలకంగా తీసుకున్నామని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీటిపై పూర్తిస్థాయి దృష్టి పెట్టాలన్నారు.

కాగా, రాబోయే ఎన్నిక‌ల గురించి కేసీఆర్ త‌న పార్టీ శ్రేణుల‌కు భారీ భ‌రోసా క‌ల్పించారు. రాష్ట్రంలో ఈరోజే ఎన్నికలు వచ్చినా ప్రజలు టీఆర్ఎస్‌ను అఖండ విజయంతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. `` 119 నియోజకవర్గాల్లో పార్టీ బలం రోజురోజుకు పెరుగుతున్నది. ఎమ్మెల్యేలే కాస్త ప్రజలను కలిసి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.15 ఎంపీలు క్లియర్‌కట్‌గా గెలుస్తం. కొన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా వచ్చే స్థితి లేదు. సికింద్రాబాద్‌లో టీఆర్‌ఎస్-బీజేపీ మధ్య పోటీ ఉంది. అయినా రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా కేవలం మూడు శాతమే. ఇక ఎంఐఎంకు హైదరాబాద్ లోక్‌సభ స్థానం ఖాయమే. మనపై ప్రజలకున్న విశ్వాసానికి ఇటీవల చేసిన సర్వే ఫలితాలే నిదర్శనం`` అని సీఎం వెల్లడించారు. నిరంతరం ప్రజలతో మమేకమయ్యేవారికి ఎలాంటి ఇబ్బందుల్లేవని చెప్పారు.  కాగా, పార్టీ ఎంపీలపై చేయించిన సర్వేలో ఎంపీ వినోద్ 60.2శాతంతో మొదటి స్థానంలో ఉండగా బాల్కసుమన్ 60శాతం, జితేందర్‌ రెడ్డి 53శాతంలో ఉన్నారు. సీతారాంనాయక్, బూర నర్సయ్యగౌడ్, సీహెచ్ మల్లారెడ్డి మెరుగైన శాతం కోసం ప్రయత్నించాలి. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా వీరి విజయానికి ఢోకా లేదు అని సీఎం కేసీఆర్‌ చెప్పినట్లు సమాచారం.

ఇదిలాఉండ‌గా... ఏప్రిల్ 27న తలపెట్టిన వరంగల్ బహిరంగ సభ ఏర్పాట్లను ఆ జిల్లా నాయకులు చూస్తారని కేసీఆర్‌ చెప్పారు. వరంగల్ జిల్లా వారికి భారీ బహిరంగ సభలు నిర్వహించడం అలవాటేనని ఆయన అన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దూర ప్రాంతాల నుంచి జన సమీకరణ చేసే కంటే, వరంగల్ చుట్టుపక్కల జిల్లాల నుంచే అధిక సంఖ్యలో జనం వచ్చేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. బహిరంగ సభ ప్రాంగణంలో తాగునీటి కోసం బోర్లు, ఆహార పాకెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. బహిరంగ సభకు వచ్చే వారికి ఏర్పాట్లు చేసేందుకు క్యాడర్ మొత్తం శ్రమదానం చేసి ఆ డబ్బుతోనే సభ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. తానుకూడా శ్రమదానం చేస్తానని సీఎం చెప్పారు.  కాగా, పార్టీ సంస్థాగత నిర్మాణంలో టీఆర్‌ఎస్ వినూత్న రీతిలో ముందుకు వెళ్తున్నదని కేసీఆర్ చెప్పారు. ``ఈసారి జిల్లాలకు కమిటీలు వేయడం లేదు. నియోజకవర్గ కమిటీలనే కాస్త బలంగా వేసుకుంటున్నారు. ఈ కమిటీకి ఛైర్మన్‌గా ఎమ్మెల్యేనే ఉంటారు. కార్యవర్గ ఎన్నికపై కూడా ఆయనకే అధికారాలు ఉంటాయి. ఈ కమిటీలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇతర చైర్మన్లు ఉండేలా చూసుకోవాలి`` అని కేసీఆర్‌ ఆదేశించారు.  ఈనెల 6 తేదీనాటికి సభ్యత్వ నమోదు పూర్తిచేయాలని, ఆరు నుంచి గ్రామ కమిటీలు వేసుకోవాలని సీఎం ఆదేశించారు. ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో ఇతరులెవ్వరూ జోక్యం చేసుకోవద్దని, నియోజకవర్గానికి సంబంధించినంత వరకూ ఎమ్మెల్యేనే బాస్ అని కేసీఆర్‌ స్పష్టం చేసినట్టు సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News