కేసీఆర్ ను తెగవాడేస్తున్న వాహనదారులు

Update: 2018-11-10 08:36 GMT
తాడిని తన్నేవాడుంటే.. వాడిని తలదన్నేవాడు ఉన్నాడంటారు.. అది నిజమే మరీ.. ప్రత్యర్థులు కూడా పసిగట్టలేని రాజకీయాలు చేసే కేసీఆర్ ను కొందరు వాహనదారులు తెగ వాడేస్తున్నారు. ఆయన సెంటిమెంట్ వాహనాల నెంబర్లను తమ వాహనాలకు వేసుకొని జరిమానాలు, ఇతర చలాన్లనుంచి తప్పించుకుంటున్నారు.. ఇది చూసి పోలీసులు నోరెళ్ల బెడుతున్నారు.

 రాజకీయాలలో  టీఆర్ ఎస్ అధినేత - అపద్ధర్మ ముఖ్యమత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు అచ్చొచ్చిన సంఖ్య 6. ఆయనకు ఈ నెంబరు బాగా సెంటిమెంట్ గా భావిస్తారు. అందుకే... వాహన శ్రణిలో అన్ని 6666 నంబర్లే ఉంటాయి. ఈ నెంబరు ఉన్న అనధికార వాహనాలు తెలంగాణాలో ఎక్కువై పోయాయట. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఈ-చలానాలు తెలంగాణ భవన్ కు కుప్పలు తెప్పలుగా చేరుతున్నాయట.

ముఖ్యమత్రి కాన్వాయ్ కు ట్రాఫిక్ చలానాలు రావడం ఏమిటని టీఆర్ ఎస్ నేతలతో పాటు పోలీసులు కూడా నోరెళ్లబెడుతున్నారు. విషయమేమిటని ఆరా తీయడం మొదలుపెట్టారు. హైదరాబాద్ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలకు హైటెక్ రశీదులు పంపుతున్నారు. వాహన నెంబరు ఆధారంగా చలానాలు ఇళ్లకు వెళ్లిపోతాయి.

దాంతో కొంతమంది వాహనదారులు తెలివితేటలను ప్రదర్శిస్తున్నారు. తమ బండ్లకు ఉన్న నెంబర్లలో చివరి అంకెను తీసివేయడం.. కనబడకుండా చేయడం లాంటి పనులను ప్రారంభించారు. ఇంకొంతమంది కేసీఆర్ కు గురి కుదిరిన వాహనాల 6 నంబరు ప్లేట్లను వేసుకొని తిరగడం ప్రారంభించారు. దాంతో చలానాలన్నీ తెలంగాణ భవన్ కు చేరుతున్నాయన్నమాట .

మరోవైపు సదరు  6 నెంబరుతో ఉన్న వాహనాలు నిబంధనలు ఎందుకు ఉల్లంఘిస్తున్నాయి.. వేగంగా వెళ్లిపోవడం ఏమిటి? ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా? ఎవరికి సంబంధించిన వాహనాలు అవి? అన్న అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. కేసీఆర్ నెంబర్ ప్లేట్లను ఉపయోగించుకొని మోసం చేస్తున్న వారి పనిపట్టాలని పోలీసులు యోచిస్తున్నారట..
   

Tags:    

Similar News