కేసీఆర్ కుమార్తె.. క‌విత చుట్టూ.. ఉచ్చు ఏం జ‌రుగుతోంది?

Update: 2022-11-22 06:30 GMT
తెలంగాణ రాజ‌కీయం స‌ల‌స‌ల కాగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. రెండు ప్ర‌ధాన మైన కేసులు ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఒక‌టి దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో జ‌రిగింది అయితే, రెండోది తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌కు స‌మీపంలోని మొయినా బాద్‌లో జ‌రిగింది కావ‌డం గ‌మ‌నార్హం. ఈ రెండు ప‌రిణామాల్లోనూ అటు బీజేపీ, ఇటు టీఆర్ ఎస్‌లు వ్యూహ ప్ర‌తివ్యూహాల‌తో ముందుకు సాగుతున్నాయి.

తెలంగాణ‌పై క‌న్నేసిన బీజేపీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకుని, కేసీఆర్‌ను ఇంటికి పం పించాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ ఎమ్మెల్యేల‌ను తీసుకోవ‌డం, ఉప ఎన్నిక‌లు వ‌చ్చేలా చేయ‌డం వంటివి గ‌మ‌నిస్తున్నారు. ఇక‌, ఏకంగా ఢిల్లీ గ‌ద్దెపైనే క‌న్నేసిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ప్ర‌ధాని మోడీకి వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్పుతున్నారు. ఇత‌ర ప్రాంతాల పార్టీల నేత‌ల‌ను కూడా ఆయ‌న టార్గెట్ చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో బీజేపీ, టీఆర్ ఎస్ రాజ‌కీయాలు ర‌స‌కందాయంలో ప‌డ్డాయి. దీంతో ఒక‌రిని ఒక‌రు దెబ్బ‌తీసు కునేందుకు కేసుల ప‌ద్దుల్లోకి వెళ్లారు. ఢిల్లీలో జ‌రిగిన లిక్క‌ర్ కుంభ‌కోణం ఇప్పుడు తెలంగాణ వేదిక‌గా విచార‌ణ జ‌రుగుతోంది. దీనిలో సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ క‌విత పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఇప్ప‌టికే ఆమె అనుచరుగా పేరున్న అభిషేక్‌ను సీబీఐ విచారించింది. ఇక‌, క‌విత‌కు కూడా రేపోమాపో నోటీసులు ఇచ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఇటీవ‌ల క‌విత కూడా త‌న న్యాయ‌వాదుల‌ను, ప్ర‌భుత్వ న్యాయ‌వాదుల‌ను కూడా సంప్ర‌దించి దీనిపై చ‌ర్చించారు. నోటీసులు ఇస్తే ఏం చేయాల‌నే దానిపై చ‌ర్చించారు. అంటే, దాదాపు క‌విత‌కు నోటీసులు ఖాయ‌మ‌నే వాద‌న‌కు బ‌లం చేకూరింది. ఇక‌, బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బీఎల్‌. సంతోష్‌ను (ఈయ‌న మోడీ, అమిత్‌షాకు కీల‌క నేత‌)  తెలంగాణ ప్ర‌భుత్వం టార్గెట్ చేసింది.

మొయినాబాద్‌లో జ‌రిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారంలో సంతోష్ కీల‌క పాత్ర‌, సూత్ర‌ధారిగా భావిస్తున్న పోలీసులు ఆయ‌న‌ను విచారించాల‌ని నోటీసులు పంపారు. ఈ క్రమంలో ఆయ‌న‌ను అరెస్టు చేయ‌డం కూడా ఖాయ‌మ‌ని తెలిసిపోయింది. అయితే, ముందు జాగ్ర‌త్త‌ప‌డ్డారో ఏమో తాజాగా ఆయ‌న విచార‌ణ‌కు మాత్రం హాజ‌రు కాలేదు.

అయితే, రేపోమాపో ఆయ‌న‌కు మ‌ళ్లీ నోటీసులు పంపించ‌నున్నారు. ఏతా వాతా.. ఈ కేసులు ఎటూ తేలేవి కావు. కానీ, వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యానికి బీజేపీ, టీఆర్ ఎస్‌ల‌లో ఒక పార్టీ పైచేయి సాధించి.. ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందాల‌నే వ్యూహం మాత్రం క‌ళ్ల‌కు క‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News