కేసీఆర్ డిసైడ్ అయ్యారు..ప్రకటనే మిగిలింది

Update: 2015-10-28 04:51 GMT
వరంగల్ ఉఫ ఎన్నికకు సంబంధించి అధికారిక టీఆర్ ఎస్ అభ్యర్థి ఎవరన్న విషయంపై ఉత్కంట నెలకొంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉండటంతో వరంగల్ అభ్యర్థి విషయంలో తుది నిర్ణయం ఆయన తిరిగి వచ్చే వరకు ఉండదు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పార్టీ నేతలతో.. వరంగల్ జిల్లా నాయకులతో సమీక్ష జరిపి తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ఇందుకోసం ముహుర్తం ఈ నెల 29 (గురువారం) నిర్ణయించారు. అంతేకాదు.. గురువారం వరంగల్ జిల్లా నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కానున్న తీరు చూస్తుంటే.. వరంగల్ ఉఫ ఎన్నికకు సంబంధించిన అభ్యర్థి ఫిక్స్ అయినట్లేనని చెప్పొచ్చు.

టీఆర్ ఎస్ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం వరంగల్ ఉఫ ఎన్నికల అభ్యర్థిగా టిక్కెట్టు ఆశిస్తున్న వారి జాబితా కాస్త పెరిగింది. వీరిలో పసునూరి దయాకర్.. గుడిమల్ల రవికుమార్.. ప్రొఫెసర్ సాంబయ్య.. డాక్టర్ రమేశ్.. ఎర్రోళ్ల శ్రీనివాస్.. కడియం శ్రీహరి కుమార్తె కావ్య పేర్లు వినిపిస్తున్నాయి. అయితే.. కావ్య పోటీలో లేరని కడియం తేల్చి చెబుతున్నారు. ఇక.. వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించి అధికార పార్టీ ఇప్పటికి నాలుగు సర్వేలు నిర్వహించింది. ఈ నాలుగు సర్వేల సారాంశాన్ని ఇప్పటికే కేసీఆర్ మదింపు చేశారని చెబుతున్నారు.

తాను తీసుకున్న నిర్ణయానికి తగినట్లుగా పార్టీ క్యాడర్ ను సంసిద్ధం చేయటం.. ముఖ్యనేతలతో చర్చలు జరిపి.. వారందరితో చర్చించిన తర్వాతే తాను నిర్ణయం తీసుకున్నానన్న భావన కలిగించేందుకు గురువారం వరంగల్ జిల్లా నేతలతో సీఎం భేటీ కానున్నారని చెబుతున్నారు. భేటీ అనంతరం వరంగల్ అభ్యర్థిని కేసీఆర్ అధికారికంగా ప్రకటించనున్నారు. టిక్కెట్టు ఆశిస్తున్న వారిని బుజ్జగించటం.. తాను నిర్ణయించిన అభ్యర్థి గెలుపు విషయంలో బాధ్యతలు తీసుకునే విషయాన్ని స్వయంగా అప్పజెప్పటం లాంటి కార్యక్రమాలు గురువారం ఉంటాయని చెబుతున్నారు. అభ్యర్థి విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వందశాతం అవగాహనతో ఉన్నారని.. ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వరంగల్ ఉప ఎన్నిక విషయంలో ఇప్పటికే పూర్తిస్థాయిలో కేసీఆర్ కసరత్తు చేశారని చెబుతున్నారు.

కీలకమైన విషయాలకు సంబంధించి కేసీఆర్ చాలా క్లారిటీతో ఉంటారని ఆయన సన్నిహితులు చెబుతారు. కానీ.. సమయం.. సందర్భం చూసుకొని తన నిర్ణయాన్ని వెల్లడించాలన్న ఆలోచనతోనే జాప్యం చేస్తారు తప్పించి.. ముఖ్యమైన విషయాల్లో చివరి క్షణాల్లో నిర్ణయం తీసుకునే తీరుకు కేసీఆర్ పూర్తి వ్యతిరేకమని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక ఎప్పుడో జరిగిపోయిందని.. అధికారికంగా వెల్లడించటం మాత్రమే మిగిలిందని చెబుతున్నారు. నీళ్లు తీర్థంగా మారాలంటే శంఖులో పోయాలి కదా.
Tags:    

Similar News