మోడీ.. కేసీఆర్ రిలేష‌న్ తేలిపోయింది

Update: 2018-04-11 10:25 GMT
ఈ మ‌ధ్య‌న కొన్ని ముఖ్య‌మైన వార్త‌ల‌కు ప్ర‌ధాన మీడియాల‌లో పెద్ద‌గా ప్రాధాన్య‌త ఇవ్వ‌టం లేదు. ఎక్క‌డో ఒక మూల‌న మూడు ముక్క‌ల్లో విష‌యాన్ని ముగించేస్తున్నారు. తాజాగా అలాంటి ఉదంత‌మే ఒక‌టి చోటు చేసుకుంది.మోడీ స‌ర్కారు హ‌యాంలో నిధుల కేటాయింపులో ద‌క్షిణాది రాష్ట్రాల‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతుంద‌న్న వాద‌న ఒక‌టి ఈ మ‌ధ్య‌న బ‌లంగా వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే.

దీనిపై చ‌ర్చించేందుకు కేర‌ళ ఆర్థిక మంత్రి ద‌క్షిణాదికి చెందిన అన్ని రాష్ట్రాల ఆర్థిక‌మంత్రుల‌ను స‌మావేశానికి ఆహ్వానించ‌టం తెలిసిందే. ఈ ఆహ్వానంపై భారీగానే క‌వ‌ర్ చేసిన తెలుగు మీడియా సంస్థ‌లు.. తీరా స‌మావేశం జ‌రిగిన వైనాన్ని మాత్రం పెద్ద‌గా ఫోక‌స్ చేయ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.

ఈ స‌మావేశానికి తెలంగాణ‌.. త‌మిళ‌నాడు మిన‌హా మిగిలిన రాష్ట్రాల ఆర్థిక‌మంత్రులు హాజ‌రు కావ‌టం గ‌మ‌నార్హం. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు.. ప్ర‌ధాని మోడీకి మ‌ధ్య మంచి ట‌ర్మ్స్ ఉన్నాయ‌ని.. జాతీయ ఫ్రంట్ పేరుతో కొత్త కుంప‌ని పెట్ట‌టం వెనుక మోడీ మాస్ట‌ర్ మైండ్ ఉంద‌న్న మాట వినిపించింది. అయితే.. ఇలాంటివ‌న్నీ త‌ప్పుడు ప్ర‌చారాలే అన్న‌ట్లుగా కేసీఆర్ మాట‌లు ఉన్నాయి. బీజేపీ.. కాంగ్రెస్ పార్టీల‌తో సంబంధం లేకుండా కొత్త‌త‌ర‌హా ఫ్రంట్ అవ‌స‌ర‌మ‌న్న వాద‌న‌ను కేసీఆర్ బ‌లంగా వినిపించ‌టం తెలిసిందే. మ‌రి.. అలాంటివేళ‌.. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక‌మంత్రిని కేర‌ళ‌కు ఎందుకు పంప‌లేద‌న్న ప్ర‌శ్న‌ను సంధిస్తున్నారు.

అదే స‌మ‌యంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశంపై మోడీ స‌ర్కారుపై ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం చ‌ర్చ‌కు రాకుండా.. స‌భ జ‌ర‌గ‌కుండా అడ్డుకున్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. దీంతో.. కాస్తంత వెన‌క్కి త‌గ్గిన కేసీఆర్‌.. త‌న ఎంపీల‌ను ఢిల్లీ నుంచి వ‌చ్చేయ‌మ‌ని చెప్ప‌టం తెలిసిందే. తాజాగా కేర‌ళ‌కు తెలంగాణ ఆర్థిక‌మంత్రి ఈటెల‌ను పంప‌క‌పోవ‌టం వ్యూహాత్మ‌క‌మేన‌న్న వాద‌న‌ను వినిపిస్తున్నారు. మోడీతో లోగుట్టు రిలేష‌న్ కార‌ణంగానే కేర‌ళ‌కు ఈటెల‌ను పంప‌లేద‌న్న వాద‌న‌లో నిజం లేద‌ని.. అది త‌ప్ప‌న్న వాద‌న‌ను టీఆర్ ఎస్ నేత‌లు చెబుతున్నారు.

జాతీయ స్థాయిలో  బ‌ల‌మైన ఫ్రంట్ ను ఏర్పాటు చేయాల‌ని చెబుతున్న వేళ‌.. అందుకు భిన్నంగా ద‌క్షిణాది రాష్ట్రాల హ‌క్కుల గురించి ఏర్పాటు చేసిన స‌మావేశానికి వెళ్ల‌టం ద్వారా జాతీయ స్థాయిలో ప్ర‌శ్న‌లు త‌లెత్తుతాయ‌ని.. ఈ దూర‌పు ఆలోచ‌న‌తోనే స‌మావేశానికి వెళ్ల‌లేద‌న్న మాట‌ను వారు చెబుతున్నారు. ఈ యాంగిల్ లో చూసిన‌ప్పుడు కేసీఆర్ నిర్ణ‌యం స‌రైన‌దే అన్న భావ‌న క‌లుగుతుంది. అయితే.. నిధుల కేటాయింపులో ద‌క్షిణాది రాష్ట్రాల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌న్న విష‌యంలో త‌మ స్టాండ్ ను చెప్ప‌టంతో పాటు.. స‌మావేశానికి గైర్హాజ‌రు అయిన దానికి వివ‌ర‌ణ ఇచ్చి ఉంటే మ‌రింత బాగుండేద‌న్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News