బాబుతో పొత్తా?.. ఛీ.. ఛీ.. ద‌రిద్ర‌పు ఐర‌న్ లెగ్ అది!

Update: 2018-10-06 06:05 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు తెలంగాణ ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. గ‌డిచిన రెండు రోజులుగా చేప‌ట్టిన బ‌హిరంగ స‌భ‌ల్లో బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కేసీఆర్‌.. శుక్ర‌వారం కూడా అదే ప‌రంప‌ర‌ను కొన‌సాగించారు. త‌న‌పై దునుమాడుతున్న కేసీఆర్‌ను ఉద్దేశించి బాబు స్పందిస్తూ.. కాస్త మ‌ర్యాద‌గా మాట్లాడాల‌ని సున్నితంగా చెప్పిన‌ప్ప‌టికీ కేసీఆర్ ఆ సూచ‌న‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు స‌రిక‌దా.. త‌న విమ‌ర్శ‌ల తీవ్ర‌త‌ను పెంచారు.
అన్నింటికి మించి బాబుపై వ్య‌క్తిగ‌త వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్ఎస్ తో తాను దోస్తానా కోసం అడిగాన‌ని.. అయినా ఒప్పుకోలేద‌ని.. దాంతో మ‌హా కూట‌మి ఏర్పాటైన‌ట్లుగా చెప్పిన బాబు వ్యాఖ్య‌ల‌పై కేసీఆర్ త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు. చంద్ర‌బాబూ నీతో పొత్తా.. ఛీ.. ఛీ.. బ‌తికుండ‌గా క‌ల‌వ‌మ‌ని చెప్పేశారు. బాబు అడుగు పడితే ప‌చ్చ‌ని చెట్టు కూడా భ‌స్మ‌మైపోత‌ద‌ని.. అంత‌టి ద‌రిద్ర‌పు ఐర‌న్ లెగ్ అన్నారు. నీ దోస్తీ మాకెందుకు.. మా సంసారం మేం చేసుకుంటున్నం.. మా బ‌తుకు మేం బ‌తుకుతున్నామ‌న్నారు.

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ నీచాతినీచంగా బాబుతో పొత్తు పెట్టుకుంద‌ని.. మ‌ళ్లీ ఆంధ్రోళ్ల‌కు అవ‌కాశం ఇస్త‌మా?  తెలంగాణ నిర్ణ‌యాలు హైద‌రాబాద్‌లో జ‌ర‌గాలా?  అమ‌రావ‌తిలో జ‌ర‌గాలా?  ఢిల్లీలో జ‌ర‌గాలా?  అన్న విష‌యాన్ని ప్ర‌జ‌లే తేల్చుకోవాల‌న్నారు.

నిజామాబాద్‌.. న‌ల్గొండ జిల్లాల త‌ర్వాత ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో వ‌న‌ప‌ర్తిలో శుక్ర‌వారం సాయంత్రం నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో బాబుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. తెలుగు.. తెలుగుత‌ల్లి పేరు చెప్పే 60 ఏళ్లు దోచుకున్నార‌ని.. ఇప్పుడు మ‌ళ్లీ తియ్య‌గ‌.. పుల్ల‌గ మాట్లాడి దోస్తీ అంటావా? అంటూ నిప్పులు చెరిగారు. మోడీ.. కేసీఆర్ లు ఇద్ద‌రూ క‌లిసి త‌న‌ను వేధిస్తున్న‌ట్లు బాబు వ్యాఖ్య‌ల‌పైనా తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. నీ సంగ‌తి.. మ‌హా కూట‌మి సంగ‌తి తేల్చేందుకు తెలంగాణ ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నార‌ని.. మీ ద‌మ్మేందో.. మా ద‌మ్మేందో తేల్చుకుందామంటూ స‌వాల్ విసిరారు.

ఓటుకు నోటు కేసును మ‌రోసారి ప్ర‌స్తావించిన కేసీఆర్‌..  రేవంత్‌ను బాబుపంపితే అడ్డంగా బుక్ అయ్యార‌ని.. ఆ సంద‌ర్భంగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆడియో క్లిప్ లో ఉన్న‌ది నీ గొంతు కాదా బాబు?  అంటూ ఫైర్ అయ్యారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఓటుకు నోటు విష‌యాన్ని కేసీఆర్ ప్ర‌స్తావించిన‌ప్ప‌టికీ.. ఇంత తీవ్ర స్థాయిలో మండిప‌డింది లేదు. ఓటుకు నోటు ఇష్యూలో బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆడియో క్లిప్ మా వాళ్లు బ్రీఫ్ డ్ మీ అంటూ బాబు మాట‌లేన‌న్న ఆరోప‌ణ బ‌లంగా వినిపించింది. తాజాగా అదే అంశాన్ని కేసీఆర్ ప్ర‌స్తావించి.. అందులో ఉన్న‌ది నీ గొంతు కాదా? అంటూ ప్ర‌శ్నించ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. చంద్ర‌బాబు నేను కానీ మూడో క‌న్ను తెరిస్తే నీ గ‌తేమైపోవాల‌న్న మాట‌ల త‌ర్వాతి రోజే.. ఓటుకు నోటు వ్య‌వ‌హారంలో ఆడియో క్లిప్ లో ఉన్న‌ది నీ గొంతేగా అంటున్న కేసీఆర్ మాట‌లు  ఆయ‌న కొత్త వ్యూహాన్ని చెప్ప‌క‌నే చెప్పేస్తున్నాయ‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.
Tags:    

Similar News