జోరుగా సాగుతున్న ప్ర‌గ‌తి నివేద‌న పోస్ట్ మార్టం

Update: 2018-09-06 04:59 GMT
దేశ చ‌రిత్ర‌లో మ‌రెప్పుడూ.. మ‌రే పార్టీ చేయ‌లేని రీతిలో భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేస్తున్నాం. పాతిక ల‌క్ష‌ల మందితో స‌భ‌ను ఏర్పాటు చేసి.. గ‌డిచిన నాలుగున్న‌రేళ్ల కాలంలో ప్ర‌భుత్వం చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు.. సాధించిన విజ‌యాల్ని చెప్పుకుంటాం అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ధీమాగా చెప్పిన మాట‌లు వాస్త‌వంలోకి వ‌చ్చేస‌రికి ఎలా మారాయో తెలిసిందే.

ప్ర‌గ‌తి నివేద‌న స‌భ పేరుతో కొంగ‌ర క‌లాన్ లో నిర్వ‌హించే భారీ బ‌హిరంగ స‌భతో భారీ మైలేజీని సొంతం చేసుకోవ‌ట‌మే కాదు.. ఎన్నిక‌ల పోరు ముందు ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లు కనిపించేలా చేయాల‌న్న భారీ ఆలోచ‌న‌తో బ‌డ్జెట్ విష‌యాన్ని సైతం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా భారీ స‌భ‌కు కేసీఆర్ ప్లాన్ చేయ‌టం తెలిసిందే.

స‌భ‌ను ఎలా నిర్వ‌హించాల‌న్న అంశంపై ప‌క్కా ఆలోచ‌న‌లో ఉన్న కేసీఆర్‌.. అందుకు సంబంధించిన పూర్తిస్థాయి బ్లూ ప్రింట్ ను త‌న ద‌గ్గ‌ర ఉంచుకొన్న త‌ర్వాతనే స‌భ ఆలోచ‌న‌ను ప్ర‌క‌టించారు. స‌భ గురించి ప్ర‌స్తావించి.. సెప్టెంబ‌రు మొద‌టి వారంలో ఉంటుంద‌న్న మాట చెప్పిన వారంలోనే.. పార్టీ విస్తృత స్థాయి స‌మావేశాన్ని ఏర్పాటు చేసి.. మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేల‌కు ప్ర‌చార మెటీరియ‌ల్ ను సైతం ముంద‌స్తుగా ఇచ్చేయ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఏ విష‌యంలోనైనా కేసీఆర్ ప్లానింగ్ ఎంత ప‌క్కాగా ఉంటుంద‌న్న దానికి నిద‌ర్శ‌నంగా ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌కు సంబంధించిన ఏర్పాట్లుగా ప‌లువురు మాట్లాడుకోవ‌టం క‌నిపించింది.

అంచ‌నాల‌కు భిన్నంగా ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌కు పాతిక ల‌క్ష‌ల మంది స్థానే ప‌ది ల‌క్ష‌లు మాత్ర‌మే రావ‌టం.. ఆ జ‌నాల్ని చూసిన కేసీఆర్ మ‌న‌స్తాపంతో పెద్ద‌గా మాట్లాడ‌కుండానే స‌భ‌ను ముగించ‌టం.. మొత్తంగా ప్ర‌గ‌తి నివేద‌న ప్లాప్ షోగా మార‌టం తెలిసిందే. తాను ఎన్నో క‌ల‌లు క‌ని.. ఒక్క స‌భ‌తో ప్ర‌తిప‌క్షాల‌కు ముచ్చ‌మ‌ట‌లు పోసేలా చేయాల‌న్న ప్లాన్ కాస్తా ప్లాప్ కావ‌టంతో కేసీఆర్ రుద్ర‌నేత్రుడైన‌ట్లుగా తెలుస్తోంది.

పాతిక ల‌క్ష‌ల జ‌న స‌మీక‌ర‌ణ ఏలా చేయాల‌న్న దానిపై ప‌క్కా వ్యూహాన్ని సిద్ధం చేసిన‌ప్ప‌టికీ.. వాస్త‌వంలోకి వ‌చ్చేస‌రికి ఎందుకు ఫెయిల్ అయ్యామ‌న్న దానిపై నిఘా వ‌ర్గాల రిపోర్ట్ కు ఆదేశాలు జారీ చేశార‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే నిఘా వ‌ర్గాల నివేదిక కేసీఆర్ చేతిలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. దాదాపు రూ.300 కోట్ల భారీ బ‌డ్జెట్‌ లో ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌ను ఏర్పాటు చేసిన‌ట్లుగా విప‌క్షాలు ఆరోపించాయి. ఈ విష‌యంలో నిజానిజాలు చాలావ‌ర‌కూ నిజ‌మేన‌ని అధికార‌ప‌క్ష నేత‌లు కొంద‌రు ప్రైవేటు సంభాష‌ణ‌ల్లో ఒప్పుకుంటున్నారు.

మ‌రింత భారీగా ఖ‌ర్చు చేసిన త‌ర్వాత స‌భ ఎందుకు ఫెయిల్ అయింద‌న్న దానిపై నిఘా వ‌ర్గాలు అందించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ లో క్లియ‌ర్ గా పొందుప‌ర్చార‌ని చెబుతున్నారు. ప‌లువురు నేత‌ల క‌క్కుర్తితో పాటు.. కొంద‌రు నేత‌ల భారీ నిర్ల‌క్ష్య‌మే ప్ర‌గ‌తి నివేద‌న స‌భ ప్లాప్ కావ‌టానికి కార‌ణ‌మ‌న్న విష‌యం కేసీఆర్ కు అర్థం కావ‌టంతో పాటు.. వారెవ‌రు? అన్న దానిపై రిపోర్ట్ చేతిలో పెట్టుకున్న‌ట్లుగా తెలుస్తోంది. స‌భ ప్లాప్ కావ‌టానికి కార‌ణ‌మైన నేత‌ల‌పై కేసీఆర్ తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. త‌న క‌ల‌ల్ని దెబ్బేసిన నేత‌ల విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లు ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి. మొత్తానికి ప్ర‌గ‌తి నివేద‌న స‌భ పుణ్య‌మా అని కేసీఆర్ కు పార్టీ నేత‌ల విష‌యంలో మ‌రింత క్లారిటీ వ‌చ్చిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News