కేసీఆర్ స్కెచ్ పార‌లేదా?

Update: 2015-09-20 05:36 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు అంటే... మొండిప‌ట్టుద‌ల‌కు, ప్ర‌త్యేక శైలిలో ముందుకు పోయే వ్య‌క్తిత్వానికి పెట్టింది పేరు. అలాంటి కేసీఆర్ త‌నకు న‌చ్చిన ఏ నిర్ణ‌యాన్ని అయినా, ఎన్ని అభ్యంత‌రాలు ఎదుర‌యినా మ‌రోమాట లేకుండా...వెన‌క‌డుగు వేయ‌కుండా చేసేస్తుంటారు. ఉద్య‌మకాలంలో ఇలాంటి వైఖ‌రి అవ‌లంభించిన కేసీఆర్‌.... తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత ఆ తీరుకు మ‌రింత ప‌దును పెట్టారు. అయితే ఇటీవ‌లి కాలంలో కేసీఆర్ త‌న దూకుడు వైఖ‌రిని మార్చుకుంటున్న‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

తెలంగాణ‌కు కొత్త స‌చివాల‌యం క‌ట్టేందుకు చాతి ఆస్ప‌త్రిని తీసుకోవాల‌ని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. అయితే ప్ర‌తిప‌క్షాలు - వైద్యులు - సంఘాలు ఎంత నిర‌సించినా ఆయ‌న వెన‌క్కిత‌గ్గ‌లేదు. రోగులు అని కూడా చూడ‌కుండా వికారాబాద్ ఆస్ప‌త్రికి వ్యాధిగ్ర‌స్తుల‌ను త‌ర‌లించి మ‌రి సెక్ర‌టేరియ‌ట్ క‌ట్టాల‌నే అంత మొండిప‌ట్టుద‌ల‌ను కేసీఆర్ చూపారు. అయితే కోర్టు ఆదేశాలు, త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఆ ప్ర‌తిపాద‌న వెన‌క్కిపోయింది. అది వేరే విష‌యం. అంత మొండిగా ఉన్న కేసీఆర్ ఈ మ‌ధ్య‌కాలంలో ప్ర‌జాభిప్రాయానికి త‌లొగ్గుతున్నారు. ప్ర‌తిప‌క్షాల డిమాండ్ల‌ను గౌర‌విస్తున్నారు. తాజాగా రైతు ఆత్మ‌హ‌త్య‌ల‌కు ప‌రిహారం పెంపు, క‌రువు మండ‌లాల ప్ర‌క‌ట‌న నిర్ణ‌యమే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌.

తెలంగాణ‌లోని రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌ను అరిక‌ట్టేందుకు నిర్ణ‌యం తీసుకోవాల‌ని రైతు సంఘాలు - పార్టీలు - స్వ‌చ్చంద సంస్థ‌లు ఎప్ప‌టినుంచో కోరుతున్నాయి. అయినా కేసీఆర్ పెద్ద‌గా స్పందించ‌లేదు. అలాగే క‌రువు మండ‌లాల‌ను ప్ర‌క‌టించి కేంద్రం నుంచి సాయం పొందేందుకు మార్గం సుగ‌మం చేయాల‌ని అధికారులు అడుగుతున్నా ఆయ‌న అవ‌కాశం  ఇవ్వ‌లేదు. ఆఖ‌రికి కేంద్ర‌మంత్రులు సైతం తెలంగాణలోని క‌రువుమండ‌లాల‌ను ప్ర‌క‌టిస్తే మేం స‌హాయం చేస్తామ‌ని చెప్పినా కూడా ఆయ‌న త‌గ్గ‌లేదు. కానీ తాజాగా కేబినెట్ మీటింగ్ సాక్షిగా కేసీఆర్ త‌న మ‌న‌స‌ మార్చుకున్నారు.

తెలంగాణ‌లో వ్య‌వ‌సాయ ఆధార - గ్రామీణ జీవ‌న‌విధానానికే అధిక ప్రాధాన్యం ఉంటుంది. టీఆర్ ఎస్‌ కు ప‌ట్ట‌ణాల‌తో పోలిస్తే ప‌ల్లెల్లోనే ఓట్లు ఎక్కువ‌. మ‌రోవైపు తెలంగాణ‌లోని ఆత్మ‌హ‌త్య‌ల‌పై జాతీయ స్థాయిలో చ‌ర్చ జ‌రుగుతోంది. అన్నింటికీ మించి.... రైతుగా ఉన్న కేసీఆర్ తాను చేస్తున్న ప‌ని చేస్తున్న తెలంగాణ పౌరుల‌పై మ‌మ‌కారం చూప‌డంలేదంటూ విమ‌ర్శ‌లు వ‌స్తాయి. వీట‌న్నింటి నేప‌థ్యంలో కేసీఆర్ రైతు సంక్షేమ నిర్ణ‌యాలు తీసుకున్నార‌ని  తెలుస్తోంది. అందుకే ప్ర‌తిప‌క్షాలు - పౌర స‌మాజం డిమాండ్ ల‌కు త‌లొగ్గిన భావ‌న వ‌స్తుంద‌ని తెలిసినా కూడా అన్న‌దాత‌ల కోసం పరిహారం పెంపు, వారి ఇంటి పెళ్లికాని ఆడ‌పిల్ల‌ల‌కు క‌ళ్యాణ‌ల‌క్ష్మి వ‌ర్తించేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని తెలుస్తోంది. దేశానికి క‌డుపునింపే అన్న‌దాత‌కు, వారి కుటుంబానికి అండ‌గా నిలిచే ఏ నిర్ణ‌యం అయినా...అలాంటివి తీసుకునే ఏ పాల‌కుల‌ను అయినా అభినందించాల్సిందే.
Tags:    

Similar News