కేసీఆర్ ఫాంహౌసా..తాత్కాలిక క్యాంప్ ఆఫీసా?

Update: 2018-09-05 05:59 GMT
ముంద‌స్తు జోరు అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది. ప్ర‌గ‌తి నివేద‌న స‌భ పూర్తి అయిన వెంట‌నే ఫాంహౌస్ కు వెళ్లిపోయిన సీఎం కేసీఆర్ అక్క‌డే ఉండిపోయారు. ఒక ముఖ్య‌మంత్రి త‌న ప‌ద‌వీ కాలంలో పాల‌నా కేంద్ర‌మైన స‌చివాల‌యానికి అతి త‌క్కువ‌సార్లు వెళ్లిన రికార్డు ఎవ‌రి మీద‌నైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మీద‌నే ఉండి ఉండాలి.

సెంటిమెంట్ కానీ మ‌రే ఇత‌ర కార‌ణంతో కానీ కేసీఆర్ స‌చివాల‌యానికి వ‌చ్చింది చాలా త‌క్కువ‌సార్లుగా చెప్పాలి. సెంటిమెంట్ ప్ర‌కారం.. స‌చివాల‌యాన్ని కూల‌గొట్టి కొత్త‌ది నిర్మించాల‌ని భావించారు. కానీ.. వీలు కాలేదు. తాను అనుకున్న‌ది జ‌ర‌గ‌న‌ప్పుడు కేసీఆర్ ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న‌దానికి నిద‌ర్శ‌నంగా.. ఆయ‌న సచివాల‌యానికే డుమ్మాలు కొట్టేసే ప‌రిస్థితి. మ‌రి.. పాల‌న అంటే.. ఏముంది అయితే క్యాంప్ ఆఫీసు లేదంటే ఫామ్ హౌస్. తాజాగా కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే గ‌డుపుతున్నారు.

మంగ‌ళ‌వారం కీల‌క అధికారులు ప‌లువురు ఫామ్ హౌస్ కు బారులు తీర‌టం గ‌మ‌నార్హం. ముంద‌స్తుకు వెళ్లాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న కేసీఆర్ అందుకు సంబంధించిన ప‌నుల్నిపూర్తి చేసే క్ర‌మంలో ఉన్న‌తాధికారుల్ని పామ్ హౌస్ కు పిలిపించుకున్న‌ట్లుగా తెలుస్తోంది.ఊపిరి స‌ల‌ప‌న‌ట్లుగా సాగిన స‌మావేశాల‌కు ఎవ‌రెవ‌రు హాజ‌ర‌య్యార‌న్న‌ది చూస్తే.. ఇంత భారీ స్థాయి అధికారులా? అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. కేసీఆర్ తో భేటీ అయిన అధికారుల లిస్టు చూస్తే.. ప్ర‌భుత్వ స‌ల‌హాదారు రాజీవ్ శ‌ర్మ‌.. సీఎం వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి  క‌మ్ సీఎంవో ముఖ్య కార్య‌ద‌ర్శి న‌ర్సింగ‌రావు..  అసెంబ్లీ కార్య‌ద‌ర్శి న‌ర్సింహాచార్యులు క‌లిసి కేసీఆర్ తో సుదీర్ఘ చ‌ర్చ‌లు జ‌రిపారు.

అనంత‌రం వీరు రాజ్ భ‌వ‌న్ కు వెళ్లి గ‌వ‌ర్న‌ర్ కార్య‌ద‌ర్శి హ‌ర్ ప్రీత్ సింగ్ ను క‌లిసిన‌ట్లుగా తెలుస్తోంది. కేబినెట్ తీర్మానం ఎలా ఉండాలి?  దానికి సంబంధించిన అంశాల్ని చ‌ర్చించిన‌ట్లుగా తెలుస్తోంది. అనంత‌రం వీరు ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధానాధికారి ర‌జ‌త్ కుమార్ తో చ‌ర్చించి.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం త‌మ ర‌ద్దు విష‌యంపై  చ‌ర్చించాల‌ని కోరిన‌ట్లు తెలుస్తోంది.

అసెంబ్లీని ర‌ద్దుచేసిన వెంట‌నే నాలుగు రాష్ట్రాలకు జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌లతో తెలంగాణ‌ను క‌ల‌పాల‌న్న రిక్వెస్ట్ ల‌ను చేసుకోవాల్సి ప‌రిస్థితి ఉంద‌ని చెబుతున్నారు. అయితే.. ఈ విష‌యంపై త‌న‌ను క‌లిసి సీఎంవో ముఖ్య‌ల‌తో రాష్ట్ర ఎన్నిక‌ల అధికారి మాట్లాడుతూ.. స‌భ‌ను ర‌ద్దు చేసిన త‌ర్వాత ఆ స‌మాచారాన్ని భార‌త ఎన్నిక‌ల సంఘానికి పంపించ‌టం మిన‌హా తాను చేసేదేమీ ఉండ‌ద‌ని.. తాను నిష్ప‌క్ష‌పాతంగా విధులు నిర్వ‌హించ‌నున్న‌ట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది. తాము భేటీ అవుతున్న అధికారుల స్పంద‌న‌ను సీఎం కేసీఆర్‌ కు ఎప్ప‌టిక‌ప్పుడు అందిస్తున్న‌ట్లుగా స‌మాచారం. చ‌క్క‌గా సాగుతున్న ప్ర‌భుత్వాన్ని ముంద‌స్తుగా ర‌ద్దు చేసే వేళ‌..ఆ మాత్రం ప్లానింగ్ లేక‌పోతే ఎలా?


Tags:    

Similar News