కేసీఆర్ స‌ర్వేలో బీజేపీకి ఎన్ని సీట్లంటే...

Update: 2017-05-24 17:30 GMT
బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌ షా తెలంగాణ ప‌ర్య‌ట‌నపై తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త విశ్లేష‌ణ చేశారు. అమిత్ షా నల్లగొండ జిల్లా పర్యటన సందర్భంగా తేరాట్‌ పల్లి గ్రామంలో దళితవాడలో పర్యటించి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అయితే అమిత్ షా తిన్న భోజనం దళితవాడల్లో వండిందికాదని సీఎం కేసీఆర్ తెలిపారు. ప‌క్కనే ఉన్న ఖమ్మంగూడెం గ్రామంలో మనోహర్‌ రెడ్డి అనే వ్యక్తి వండించి పంపించిన భోజనం అని కేసీఆర్ చెప్పారు.

కాగా న‌ల్గొండ‌లో అమిత్ షా నోటికొచ్చిన‌ట్లు మాట్లాడార‌ని సీఎం కేసీఆర్ మండిప‌డ్డారు. రాజ‌కీయాల‌కోసం అన్నీ అబ‌ద్దాలు మాట్లాడి తెలంగాణ ప్ర‌జ‌ల ఓట్ల‌కోసం వెంప‌ర్లాడుతున్నార‌ని ఫైర్ అయ్యారు. చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్నార‌ని కేసీఆర్ మండిప‌డ్డారు.  ఇట్లాంటి అమిత్‌షాలు వంద మంది వ‌చ్చినా ఏమి చేయ‌లేర‌ని, అవాస్తవాలు మాట్లాడితే ఎవ‌రినైనా వ‌దిలిపెట్టేది లేద‌ని కేసీఆర్ అన్నారు. అమిత్ షా ఎన్ని మాట్లాడినా తెలంగాణ ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని వాస్త‌వాలు ప్ర‌జానికానికి తెలుస‌న్నారు. తాజా స‌ర్వే ప్ర‌కారం బీజేపీకి తెలంగాణ‌లో ఒక్క సీటు కూడా రాద‌ని సీఎం వెల్ల‌డించారు. బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా ఎన్ని మాట్లాడినా ఇప్ప‌టికీ త‌న‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ అంటే గౌర‌వ‌మ‌ని, కేంద్రంతో రాజ్యాంగ‌ప‌ర‌మైన సంబంధాలు కొన‌సాగుతాయ‌ని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నోట్ల ర‌ద్దు సంద‌ర్భంగా దేశంలో ఏ సీఎం కూడా మ‌ద్ద‌తు చెప్ప‌లేద‌ని, ప్ర‌ధాని మోడీకి స‌పోర్ట్ చేసిన ఏకైక సీఎం తెలంగాణ తానేన‌ని కేసీఆర్ గుర్తు చేశారు.

తెలంగాణ‌లో ద‌ళితుల సంక్షేమం కోసం ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని కేసీఆర్ చెప్పారు. దళితుల కోసం పకడ్బందీగా ఉపప్రణాళిక తీసుకువచ్చామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల సంక్షేమం కోసం రూ. 14,375 కోట్లు, ఎస్టీల సంక్షేమం కోసం రూ. 31,919 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై కేంద్రం ఖర్చు చేస్తున్న దానికన్నా తెలంగాణ ప్రభుత్వం ఐదు రెట్లు అధికంగా ఖర్చు చేస్తోందని చెప్పారు. అమిత్ షా రాజకీయ ప్రేరేపితమైన వ్యాఖ్యలు చేశారు. తప్పులు ప్రచారం చేసినందుకు ఆయన ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు.

Tags:    

Similar News