ఏపీ పాల‌కుల‌పై కేసీఆర్ ఫైర్!

Update: 2018-06-29 05:57 GMT
బావ‌మ‌రిది.. బావ‌మ‌రిదే.. పేకాట‌.. పేకాటే. ఒక‌దానికి ఒక‌టి అస్స‌లు ముడి వేయ‌కూడ‌దు. ఈ విష‌యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉన్నంత క్లారిటీ మ‌రెవ‌రికీ ఉండ‌దేమో. మొక్కు తీర్చుకునేందుకు బెజ‌వాడ‌కు వెళ్లి.. అమ్మ‌వారి ద‌ర్శ‌నం త‌ర్వాత‌.. హైద‌రాబాద్‌కు తిరిగి వ‌చ్చిన కేసీఆర్‌.. ప్ర‌గ‌తి భ‌వ‌న్లో రివ్యూ పెట్టుకున్నారు. అంత‌కు ముందే బెజ‌వాడ‌లో త‌న‌కు ఘ‌న‌స్వాగ‌తం ప‌ల‌క‌టం.. త‌న ప‌ట్ల ఏపీ ప్ర‌జ‌లు.. పాల‌కులు ప్ర‌ద‌ర్శించిన అభిమానం.. మ‌ర్యాదల్ని ప‌క్క‌న పెట్టి మ‌రీ క‌స్సుమ‌న్నారు.

మ‌న విలువ మ‌న‌కు తెలీకుండా ఆంధ్రా పాల‌కులు దుర్మార్గం చేశారంటూ ఫైర్ అయ్యారు. ఉమ్మ‌డి పాల‌న‌లో విస్మ‌రించిన తెలంగాణ ప‌ర్యాట‌కాన్ని ప్ర‌పంచ స్థాయిలో వెలుగులోకి తెచ్చేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్న‌ట్లు చెప్పారు కేసీఆర్‌. కామారెడ్డి ప‌ట్ట‌ణ స‌మీపంలోని అడ్లూరి ఎల్లారెడ్డి చెరువుక‌ట్ట బ‌లోపేతంతో పాటు కామారెడ్డి జిల్లా ప్ర‌జాప్ర‌తినిధులు.. జిల్లా క‌లెక్ట‌రు.. అధికారుల‌తో క‌లిసి ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో నిర్వ‌హించిన స‌మీక్ష‌లో ఉమ్మ‌డి రాష్ట్రంలో ఏపీ పాల‌కు తీరుపై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు.

ప్ర‌పంచ స్థాయి ప‌ర్యాట‌క ప్రాంతాలు.. ప్ర‌కృతి ర‌మ‌ణీమ దృశ్యాలు.. అద్భుత పుణ్య‌క్షేత్రాలు తెలంగాణ‌లో ఉన్న‌ట్లుగా చెప్పిన ఆయ‌న‌.. వ‌ల‌స పాల‌న‌లో ఇవ‌న్నీ మ‌రుగ‌న ప‌డ్డాయ‌న్నారు. కాళేశ్వ‌రం పుణ్య‌క్షేత్రం మ‌హ‌త్యం ఎక్క‌డో ఉన్న శృంగేరి పీఠాధిపతికి తెలుస్తుంది కానీ ఆంధ్రా పాల‌కుల‌కు తెలీలేద‌న్నారు.

విశాల‌మైన అడ‌వులు.. కొండ‌లు.. గుట్ట‌లు.. న‌దీన‌దాలు.. చెరువులు.. స‌హ‌జ‌సిద్ధ సుంద‌ర దృశ్యాలున్న తెలంగాణ‌ను అత్య‌ద్భుతంగా తీర్చిదిద్దే అవ‌కాశం ఉంద‌న్నారు. మంచిర్యాల పిల్ల‌గాడు దూలం స‌త్య‌నారాయ‌ణ వ‌చ్చి వీడియోలు తీసి చూపించే వ‌ర‌కూ తెలంగాణ‌లో దాగి ఉన్న ప్ర‌కృతి అద్భుతాలు వెలుగులోకి రాలేద‌ని.. తెలంగాణ పుణ్య‌క్షేత్రాల‌కు.. ప‌ర్యాట‌క రంగానికి ఉమ్మ‌డి రాష్ట్రంలోని ఏపీ పాల‌కులు స‌రిగా ప‌ట్టించుకోలేద‌న్నారు. అంతా బాగానే ఉంది కానీ.. నాలుగేళ్ల త‌న పాల‌న‌లో కేసీఆర్ మాత్రం ఏం చేశారు? అన్న ప్ర‌శ్న‌ను అడిగితే ఆయ‌న స‌మాధానం ఏమిటి?  తెలంగాణ‌ను అత్య‌ద్భుతంగా త‌న కెమేరాతో బంధించి.. కొత్త ఇమేజ్ తెచ్చిన దూలం స‌త్య‌నారాయ‌ణ లాంటి పోర‌గాడి పేరును వాడుకోవ‌ట‌మే త‌ప్పించి.. అలాంటోళ్ల‌కు ప‌ర్యాట‌కానికి సంబంధించి ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌చారం చేసేందుకు కీల‌క బాధ్య‌త‌లు ఎందుకు ఇవ్వ‌లేద‌న్న మాట‌ను కేసీఆర్‌ ను ఎవ‌రు అడుగుతారు..?
Tags:    

Similar News