కాంగ్రెస్ పై కేసీఆర్ నిప్పులు..స‌న్నాసుల‌ని ఫైర్‌

Update: 2017-04-28 06:51 GMT
కాంగ్రెస్ నాయకులపై టీఆర్ ఎస్ అధినేత‌ - ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. వరంగల్ నగరంలోని ప్రకాశ్‌ రెడ్డిపేటలో జరిగిన టీఆర్‌ ఎస్ ఆవిర్భావ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాలన పురోగతిని వివరిస్తూనే కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఖరిని తూర్పార బట్టారు. ``కాంగ్రెస్ నాయ‌కులు దద్దమ్మలు.. సన్నాసులు.. పదవుల కోసం - పైసల కోసం నాటి పాలకుల పాదాల వద్ద మోకరిల్లే విధంగా వ్యవహరించారు, డబ్బుల సంచులు మోసారు.. అందుకే రాష్ట్రం అన్ని రంగాల్లో దివాళా తీసింది. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రాంతానికి సాగునీటి రంగంలో జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకు ప్రయత్నిస్తే సాగునీటి ప్రాజెక్టులకు అడ్డుపడుతూ శిఖండి పాత్ర పోషిస్తున్నారు. ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణకు తాను అడ్డం కాదు.. నిలువు కాదంటూ వ్యంగ్యంగా మాట్లాడితే తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎందుకు నోరు మెదపలేదు? తమ పదవులకు ఎందుకు రాజీనామా చేయలేదు` అని కేసీఆర్ ప్రశ్నించారు.

అదే విధంగా అసెంబ్లీలో తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని ఈటల రాజేందర్ నాయకత్వంలోని తెరాస ఎమ్మెల్యేల బృందం కోరితే నిండు సభలో ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఒక్కరూపాయి కూడా ఇచ్చేది లేదంటూ అహంకారపూరితంగా మాట్లాడితే కాంగ్రెస్ నాయకులు ఎందుకు నోరు విప్పలేదని కేసీఆర్‌ నిలదీశారు. పదవుల కోసం నాడు కాంగ్రెస్ నాయకులు సంచులు మోశారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా తెలంగాణ స్థితిగతులను మార్చుకుందామనే ప్రయత్నంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి తమ ప్రభుత్వం పూనుకుంటే కాంగ్రెస్ నాయకులు అడ్డుపడుతున్నారని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ఒకటి - రెండు సందర్భాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఉండవచ్చని, కానీ సాంకేతిక లోపాలను ఆధారంగా తీసుకుని ప్రాజెక్టుల నిర్మాణం జరుగకుండా కాంగ్రెస్ అడ్డుపడటం నీతిమాలిన‌ చర్యగా అభివర్ణించారు. పర్యావరణ తదితర అనుమతులు లేవంటూ కోర్టుల ద్వారా స్టే తెస్తూ శిఖండి పాత్ర పోషిస్తున్నారని కేసీఆర్‌ విమర్శించారు.

పాత ఖమ్మం జిల్లాలోని భక్త రామదాసు ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసి 65వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని, ఇదే తరహాలో ఇతర ప్రాజెక్టులన్నీ పూర్తయితే రెండు పంటలకు సాగునీరు అందే అవకాశం ఉంటుందని కేసీఆర్‌ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఉత్తర తెలంగాణ సస్యశ్యామలంగా మారనుందని వెల్లడించారు. ప్రాజెక్టులన్నీ పూర్తయితే తమకు పుట్టగతుల ఉండవనే భయంతోనే, వచ్చే ఎన్నికల్లో ఓట్లు రావనే భయంతోనే కాంగ్రెస్ నాయకులు సాగునీటి ప్రాజెక్టులకు అడ్డుకుంటున్నారని కేసీఆర్‌ ఆరోపించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News