అధికారుల‌పై కేసీఆర్ ఫైర్‌

Update: 2016-12-05 05:01 GMT
ఆంధ్ర‌ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుతో పోలిస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శైలి పూర్తి భిన్నం. సుదీర్ఘ స‌మీక్ష‌లు - అధికారుల‌పై రుసురుస‌లు బాబు నైజం అయితే వివ‌రంగా చెప్ప‌డం - అధికారుల‌కు ఉద్బోదించ‌డం కేసీఆర్ స్టైల్‌. కానీ అలాంటి కేసీఆర్ మొద‌టిసారిగా అధికారుల‌పై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. త‌ను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన కొత్త జిల్లాల ఏర్పాటు త‌ర్వాత ప్రజల మనోభావాలకు అనుగుణంగా పరిపాలనా విధానాలను అమలు చేయడంలో యంత్రాంగం విఫలమవుతుండ‌ట‌మే కేసీఆర్‌ అసంతృప్తికి కార‌ణం.

కొత్త జిల్లాల ఏర్పాటు త‌ర్వాత ప‌రిపాల‌న తీరుపై త‌న నూత‌న క్యాంపు కార్యాల‌యంలో స‌మీక్ష నిర్వ‌హించిన సీఎం కేసీఆర్ ఈ సంద‌ర్భంగా కొన్ని శాఖల్లో స్తంభించిన పురోగతిపై - సంబంధిత బాధ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా జిల్లాల ప్రాధాన్యతను బట్టి కార్యక్రమాలు ఉండాలని, ప్రతి జిల్లాలోనూ ఒకే విధమైన పద్ధతిని అవలంభించవద్దని కేసీఆర్  సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ శాఖల పనితీరులో గణనీయమైన మార్పులు రావల్సిన అవసరం ఉందన్నారు. కొత్త జిల్లాల్లో కలెక్టర్లు విధుల్లో చేరి నెలలు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదన్నారు. కొన్ని అంశాల్లో లోతుగా అధ్యయనం చేసి ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని సీఎం ఈ సందర్భంగా దిశ నిర్దేశం చేశారు. అభివృద్ధి - సంక్షేమ పథకాల ఫలాలను - పౌరసేవలను విస్తృతపరచాలన్న ఉద్దేశంతో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేపట్టామని, అయినప్పటికీ ఆ లక్ష్యం నెరవేరడం లేదని పేర్కొన్నారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలంటూ వివిధ శాఖల ఉన్నతాధికారులకు హితవు చెప్పారు. చిత్తశుద్ధి - నిబద్ధత లోపిస్తే ప్రభుత్వ లక్ష్యాలు గాడి తప్పుతాయని స్పష్టం చేశారు. ఏ కార్యక్రమంలోనైనా నిర్లక్ష్యాన్ని సహింబోమని హెచ్చరించారు.

జిల్లాల వారిగా చేపట్టాల్సిన కార్యక్రమాలు - ప్రాధాన్యతలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకు నేందుకు ఈ నెల 14న జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నట్టు కేసీఆర్‌ ప్రకటించారు. అన్ని జిల్లాల్లో సమగ్రమైన అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకోవల్సిన ఆవశ్యకతను వివరించేందుకు అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులు సిద్ధం కావాలన్నారు. సామాజిక - ఆర్ధిక స్థితిగతులు - రహదార్ల అభివృద్ధి - కొత్త రైల్వేలైన్ల ఏర్పాటు - నీటిపారుదల ప్రాజెక్టులు - భూసేకరణ - మిషన్‌ భగీరధ పనుల పురోగతి - నగదు రహిత వ్యవస్థ ఏర్పాటు - బ్యాంకింగ్‌ రంగం విస్తరణ - సాంకేతిక పరిజ్ఞానంపై ప్రజల్లో అవగాహన - చిన్న - సన్నకారు రైతు కుటుంబాల ఆర్ధిక పరిస్థితులు వారికి అందించే చేయూత - ఉద్యానవన పంటలకు ప్రోత్సహకాలు - పారిశ్రామిక రంగం అభివృద్ధి - కుటీర పరిశ్రమల ఏర్పాటు, ఆసుపత్రుల్లో మౌలిక వసతుల ఏర్పాటు - విద్యా ప్రమాణాల మెరుగుకు తీసుకోవల్సిన చర్యలు, అన్నింటికి మించి కరెన్సీ కష్టాలు తొలగిపోయేంత వరకు ప్రజలకు చేయూత నివ్వడం, అదే సమయంలో నగదు రహిత సేవలను గ్రామాలకు సైతం విస్తరింప చేయడం లాంటి అనేక అంశాలు కలెక్టర్ల సమావేశంలో చర్చించనున్నట్టు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. అలాగే ప్రాధాన్యతా క్రమంలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం - శిధిలమైన పాఠశాలల పునర్‌ నిర్మాణం - మరుగుదొడ్ల నిర్మాణం - డ్రాపౌట్స్‌ - మధ్యాహ్నా భోజన పథకం అమలు, అసైన్డ్‌ - ప్రభుత్వ భూముల వినియోగం - అటవీ భూముల వినియోగం గుర్తింపు తదితర అంశాలు కూడా చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోవల్సిన అవసరం ఉందని ఉన్నతాధికారులకు సూచించారు. అలాగే వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్‌ సరఫరా - యాసంగి పంటలకు కల్పించే ప్రోత్సహకాలు - సాదా బైనామాల రిజిస్ట్రేషన్ల అంశాలపై జిల్లా స్థాయి అధికారులకు దిశా నిర్దేశం చేయాలన్నారు.

దీంతోపాటు జిల్లాల వారిగా స్థానిక వనరులను పూర్తిస్థాయిలో ఉపయోగించుకుని ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కేసీఆర్ స్ప‌ష్టం చేశారురు. జిల్లాలను నాలుగు వేర్వేరు విభాగాలుగా ఏర్పాటు చేయాలని సూచించారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ప్రభుత్వం అత్యంత క్రియాశీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. చిత్తశుద్దితో పనిచేస్తే ఫలితాలు తప్పకుండా వస్తాయన్నారు. సంకోభంలో ఉన్న విద్యుత్‌ రంగాన్ని అభివృద్ధి వైపు మళ్లించిన విధానాలను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులకు వివరించారు. జిల్లా యూనిట్‌ గా కేంద్ర ప్రభుత్వం ద్వారా రావల్సిన నిధులకు సంబంధించి ప్రత్యేక నివేదిక తయారు చేయాలని అధికారులకు బాధ్యతలు అప్పగించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News