మోడీ ఈగో హ‌ర్ట‌య్యేలా కేసీఆర్ ఎన్ని మాట‌లు అన్నారంటే...

Update: 2022-02-01 14:32 GMT
కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌దైన శైలిలో ద‌ఫాద‌ఫాలుగా స్పందించారు. బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన వెంట‌నే ఓ ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన టీఆర్ఎస్ పార్టీ అధినేత ఆ వెంట‌నే సాయంత్రం విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ మీడియా స‌మావేశంలో త‌న‌దైన శైలిలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై విరుచుకుప‌డ్డారు. కేంద్ర బడ్జెట్ అత్యంత దారుణంగా ఉంద‌ని, ప్ర‌జా సంక్షేమాన్ని ప‌ట్టించుకోలేద‌ని సీఎం మండిప‌డ్డారు. `` కేంద్ర ప్ర‌భుత్వానికి మెద‌డు లేదు. ఈ బ‌డ్జెట్ దిక్కుమాలిన‌త‌నంగా ఉంది. పేద‌ల‌కు, రైతుల‌కు మొండి చేయి చూపించింది. దేశ ప్ర‌ధాని రైతుల‌కు క్ష‌మాప‌ణ చెప్పారు కానీ.. బ‌డ్జెట్‌లో మాత్రం వ్య‌వ‌సాయ రంగం గురించి ప్ర‌స్తావ‌నే లేదు. పేద ప్ర‌జ‌ల‌కు గుండు సున్నా చూపించారు.`` అంటూ విరుచుకుప‌డ్డారు.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీకి నిద్ర ప‌ట్ట‌డం లేద‌ని ఎద్దేవా చేసిన కేసీఆర్ ఆయ‌నో కుర‌చ ప్ర‌ధాని అంటూ క‌ల‌క‌లం రేపే కామెంట్లు చేశారు. హైద‌రాబాద్‌లో ఆర్బిట్రేష‌న్ సెంట‌ర్ ఏర్పాటు చేస్తుంటే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి నిద్ర ప‌ట్ట‌డం లేద‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో కుర‌చ బుద్ధి ఉన్న ప్ర‌ధాని ఉన్నాడు అని మోదీని కేసీఆర్ తీవ్రంగా విమ‌ర్శించారు. ``ఆర్బిట్రేష‌న్ సెంట‌ర్‌ అహ్మ‌దాబాద్‌లో పెట్టాల‌ని ప్ర‌ధాని మోడీ ఒత్తిడి తెచ్చారు. కానీ దాన్ని హైద‌రాబాద్‌లోనే ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా మోడీకి నిద్ర ప‌ట్ట‌డం లేదు. దీనికి పోటీగా గిఫ్ట్ సిటీ అని ఒక సంస్థ‌ను ఏర్పాటు చేయ‌బోతున్నారు.`` అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ వాళ్లు దేశానికి ఏం చేయ‌లేక‌పోయారని, ఆ త‌ర్వాత ఈ సిపాయి న‌రేంద్ర మోడీ వ‌చ్చిండు అంటూ కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. గుజ‌రాత్ మోడ‌ల్‌ను ఉద్ద‌రిస్తార‌ని చెప్పి న‌మ్మి ప్ర‌జ‌లు ఓటేశారని కామెంట్ చేశారు. ``గుజ‌రాత్‌లో ఏదో పొడిచిన‌ట్టు.. నాలుగు బొమ్మ‌లు దొంగ సోష‌ల్ మీడియాలో పెట్టి.. పూర్తి ప‌చ్చి అబద్దాలు చెప్పేట‌టువంటి సోష‌ల్ మీడియాలో దొంగ ప్ర‌చారాల‌తో.. త‌ల తోక లేని గుజ‌రాత్ మోడ‌ల్‌ను తీసుకొచ్చారు. ఎనిమిదేళ్లు గ‌డిచాక ఆయ‌న బండారం బ‌య‌ట‌పడ్డ‌ది. బీజేపీకి, మోడీకి ఉన్న తెలివి ఏందో స్ప‌ష్టంగా ఇవాళ బ‌య‌ట‌ప‌డింది.`` అంటూ కామెంట్ చేశారు.

ప‌చ్చి అబ‌ద్ధాలు మాట్లాడ‌టం.. దేశాన్ని అమ్మేయ‌డ‌మే బీజేపీ ప్ర‌భుత్వానికి తెలుస‌ని కేసీఆర్ మండిప‌డ్డారు. న‌దుల అనుసంధానం బిగ్ జోక్ అని.. జోక్ ఆఫ్ ది మిలీనియం అన్నారు. నదుల అనుసంధానం ప్ర‌క‌ట‌న‌పై ప్ర‌భుత్వం సిగ్గు ప‌డాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ``గోదావ‌రి, కృష్ణ‌, కావేరిని ఏ అధికారంతో అనుసంధానం చేస్తా అని చెప్పావు. గోదావ‌రి మీద ట్రిబ్యున‌ల్ తీర్పు ఉంది. ఆ తీర్పు ఆధారంగా ఒక్కసారి తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట‌ర్ అయిన ప్ర‌తి డ్రాప్ మీద అధికారం తెలుగు రాష్ట్రాల మీద‌నే ఉంట‌ది అని వాట‌ర్ ట్రిబ్యున‌ల్ తీర్పు ఉంది. ఆ తీర్పు అంటే సుప్రీంకోర్టు జ‌డ్జిమెంట్‌తో స‌మానం. మా నీళ్ల‌ను మ‌మ్మ‌ల్ని అడ‌గకుండా గోదావ‌రి జ‌లాల‌ను కావేరీ న‌దిలో ఎలా క‌లుపుతావు. ఏ చ‌ట్టం ప్ర‌కారం క‌లుపుతావు. ఇది జోక్ కాదా. ఇది సెన్స్ లెస్ కాదా. తెలివిత‌క్కువ‌త‌నం కాదా?`` అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. క్రిప్టోకరెన్సీని భార‌త్‌లో అఫిషియ‌ల్ చేశారా? దాని మీద 30 శాతం ప‌న్ను ఎలా వ‌సూలు చేస్తారు అని సీఎం కేసీఆర్ ప్ర‌శ్నించారు. ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా అడుగుతున్నా.. క్రిప్టో క‌రెన్సీని మీరు అఫిషియ‌ల్ చేశారా? అస‌లు కేంద్ర ప్ర‌భుత్వానికి దిమాక్ ఉందా? అని సీఎం కేసీఆర్ ప్ర‌శ్నించారు.
Tags:    

Similar News