మొహమాట పడకుండా వైఎస్‌ని తిట్టేశారు

Update: 2015-07-06 04:19 GMT
తన ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ.. ఎలాంటి మొహమాటాలకు తావివ్వకుండా వ్యవహరించే వైఖరి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లో కనిపిస్తుంది. తన రహస్య స్నేహితుడు.. అవసరానికి ఎన్ని కష్టాలు ఎదురైనా అండగా నిలిచే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ విషయంలో కేసీఆర్‌ ఎలా వ్యవహరిస్తారన్న దానికి తాజా ఉదంతమే నిదర్శనం. ఎక్కడైనా బావే కానీ వంగతోట దగ్గర కాదన్న మాటకు అసలుసిసలు అర్థంలా కేసీఆర్‌ కనిపిస్తారు.

తనకు అవసరమైన అంశాల విషయంలో జగన్‌ సహకారం తీసుకునే కేసీఆర్‌.. ఏదైనా విషయం వచ్చినప్పుడు అదే జగన్‌ తండ్రి వైఎస్‌ను విమర్శించేందుకు ఎలాంటి మొహమాట పడరు. ఫ్రెండ్‌షిప్‌ వేరు.. రాజకీయం వేరన్నట్లుగా ఆయన వైఖరి ఉంటుంది.

వైఎస్‌ కలల పంట అయినా ప్రాజెక్టులో ప్రాణహిత.. చేవెళ్ల విషయంపై తాజాగా కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. సదరు ప్రాజెక్టు డిజైన్‌పై విమర్శలు చేశారు. అంతేకాదు.. ఒప్పందాలు చేసుకోకుండా.. అంతర్రాష్ట్ర వివాదానికి వైఎస్‌ కారణమయ్యారంటూ మండిపడ్డారు. సదరు ప్రాజెక్టు పేరుతో కాంగ్రెస్‌ నేతలు రూ.4వేల కోట్లు జేబులో వేసుకున్న విషయాన్ని ఓపెన్‌గా చెప్పేశారు.

కాంగ్రెస్‌ నేతలు రూ.4వేల కోట్లు జేబులో వేసుకుంటే.. మరి.. నాటి రింగ్‌ మాస్టర్‌ వైఎస్‌ జేబులో కూడా చేరిందన్న మాట పరోక్షంగా ప్రస్తావించినట్లేనన్న భావన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌ హయాంలోని ప్రాజెక్టులు కడితే కాల్వలు లేవని.. ఒకవేళ కాల్వలు ఉండే ప్రాజెక్టులు లేవని.. ప్రాణహిత.. చేవళ్ల విషయంలో వైఎస్‌ కొంపముంచారని కేసీఆర్‌ విమర్శించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం మహారాష్ట్రలో అధికారంలో ఉన్న సమయంలోనే ఒప్పందం కుదుర్చుకోకుండా పనులు పెట్టారని.. ప్రాజెక్టు కోసం మీరు చేసే ఖర్చు వృధా అవుతుందని మహారాష్ట్ర సర్కారు హెచ్చరించినా పట్టించుకోకుండా ఒప్పందం చేసుకోలేదని విమర్శించిన కేసీఆర్‌.. ప్రాణహిత నుంచి చేవళ్లకు మధ్య 600 కిలోమీటర్ల దూరం అని.. అంతదూరం నీళ్లు రావని తేల్చేశారు.

తాము అధికారంలోకి వచ్చాక మహారాష్ట్ర సర్కారుతో మాట్లాడి.. సమస్య పరిష్కారం కోసం కృషి చేసినట్లుగా కేసీఆర్‌ వెల్లడించారు. ఆంధ్రావాళ్లు సృష్టించిన సుడిగుండాల వల్లే అదిలాబాద్‌కు నీళ్లు రాలేదని వ్యాఖ్యానించిన కేసీఆర్‌.. చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టు కాకుండా.. కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే.. అదిలాబాద్‌ జిల్లాకు వచ్చే నష్టం ఏమీ ఉండదని చెప్పుకొచ్చారు.

పుష్కరాల తర్వాత అదిలాబాద్‌ జిల్లాకు మరోసారి వస్తానని.. అప్పుడు మూడు రోజులు జిల్లాలోనే ఉండి ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి వెళతానన్నారు. అదిలాబాద్‌కు ఎయిర్‌పోర్ట్‌ కూడా వస్తుందని ఊరించారు. మొత్తానికి వైఎస్‌ను.. కాంగ్రెస్‌ నేతల్ని.. పనిలో పనిగా మరోసారి ఆంధ్రోళ్లు అని తిట్టేసిన కేసీఆర్‌ తాను కోరుకున్న రాజకీయ మైలేజీని సంపాదించుకొన్నారని చెప్పక తప్పదు. మరి.. వైఎస్‌ను ఉద్దేశించి మిత్రుడు కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై వైఎస్‌ జగన్‌ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.



Tags:    

Similar News